ఏం జరిగింది..?

3 Jan, 2017 01:09 IST|Sakshi
ఏం జరిగింది..?
  •  కర్నూలులో సీఎం సభలో పేలిన తుపాకీ
  • స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ హంపన్న మృతి
  • మిస్‌ఫైరా... ఆత్మహత్యా?
  • అనంతపురం సెంట్రల్‌ :

    కర్నూలులో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో తుపాకీ పేలి కానిస్టేబుల్‌ హంపయ్య (24) మృతి చెందారు. ఈ ఘటన ఎలా జరిగింది.. అసలు కారణాలు ఏంటి? అనే అంశంపై పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. కళ్యాణదుర్గానికి చెందిన నారాయణ, మారెక్క దంపతుల కుమారుడు హంపయ్య. 2011లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. విడపనకల్లు పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై స్పెషల్‌ పార్టీలోకి వచ్చారు. సోమవారం సీఎం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు విధుల కోసం వెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న హంపయ్య తుపాకీ పేలడంతో సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయారు. పోలీస్‌ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతోనే హంపన్న మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈ మృతిపై 'అనంత'లో పలు రకాల వాదనలు వినపడుతున్నాయి. హంపన్న కొద్దిరోజులుగా సెలవులో ఉన్నారని, సీఎం బందోబస్తు ఉండడంతో తిరిగి విధుల్లోకి వచ్చారని తెలుస్తోంది. మంగళవారం నుంచి కర్నూలు జిల్లాలో జరిగే ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌కు కూడా అర్హత సాధించినట్లు సమాచారం. ఈ సమయంలో డ్యూటీ వేయడంతో రిక్రూట్‌మెంట్‌ ఉందని, సెలవు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. అయినా డ్యూటీకి పంపడంతో ఎస్‌ఐ కావాలన్న కోరిక తీరకుండా పోతోందని మనస్తాపం చెంది..ఆత్మహత్య చేసుకున్నాడేమోనని కొందరు పోలీసులు చర్చించుకుంటున్నారు. అలాగే హంపన్న కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారని, ఇది కూడా కారణమా అనే అనుమానాలను మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే..మృతికి గల అసలు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

    ఈ విషయంపై స్పెషల్‌పార్టీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎస్‌ఐ వలిని వివరణ కోరగా... సెలవులో ఉంటూ గత నెల 24న విధుల్లోకి వచ్చి రిపోర్టు చేసుకున్నాడని తెలిపారు. ఎస్‌ఐ పరీక్షలకు ఎంపికయ్యాడా లేదా అన్నది చూడాల్సి ఉందన్నారు. మిస్‌ఫైర్‌ వల్ల చనిపోయాడా లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా దర్యాప్తులో తేలుతుందన్నారు.  

మరిన్ని వార్తలు