పరిహారంలో ‘పచ్చ’పాతం

26 Sep, 2016 21:49 IST|Sakshi
పరిహారంలో ‘పచ్చ’పాతం
* క్షేత్ర స్థాయికి వెళ్లని అధికారులు
* కార్యాలయాల్లోనే జాబితాల తయారీ
* పచ్చ చొక్కాలకే ప్రాధాన్యం
* బాధిత రైతుల ఆందోళన
 
గురజాల: బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు పల్నాడు ప్రాతంలోని రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పల్నాడులోని వాగులు, వంకలు పొంగి పొర్లి వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. విధి వక్రించినా... కనీసం పంట నష్ట పరిహారం ఇచ్చి అయినా ప్రభుత్వం ఆదుకుంటుందనుకుంటే.. ఆ ఆశా అడియాసే అవుతోంది. నష్టం అంచనాలను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయంలో కూర్చుని రూపొందిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
 
పచ్చ చొక్కా వాళ్లకే పరిహారం పరిమితమా...
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు  డివిజన్‌ పరిధిలోని తొమ్మిది మండలాల్లో గత శనివారం వరకు నిర్వహించిన సర్వేలో రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం 81 గృహాలు పూర్తిగా పడిపోయినట్లు, 369 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు, వాగులు, వంకలు పొంగి 1396 గృహాల్లోకి నీరు చేరినట్లు వెల్లడించారు. ఇంకా సర్వే జరగాల్సి ఉందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. డివిజన్‌ పరిధిలో లె లుగుదేశం పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సిఫార్సు చేసిన వారికే పరిహారం అందే విధంగా చూస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకులే వారికి అనుగుణంగా ఉన్న వారి పేర్లను రెవెన్యూ వర్గాలకు అందజేస్తున్నారు. 
 
రైతులను ఆదుకోవాలి
పురుగుమందులు, ఎరువులు ధరలన్నీ పెరిగిపోయాయి. పంట చేతికందివచ్చే సమయంలో వరుణుడి దెబ్బకు నీటిపాలైంది. తొమ్మిది ఎకరాలు సాగుచేశా. ఆరు ఎకరాల పత్తి, మూడు ఎకరాలు మిరప సాగుచేశా. సుమారుగా రూ.2 లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం అర్హులైన వారికి నష్టపరిహారం  అందే విధంగా చర్యలు తీసుకోవాలి.
– ఎన్‌.నాగేశ్వరరావు, గురజాల
 
అర్హులైన వారిని గుర్తించాలి..
వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను గుర్తించి వారికే నష్టపరిహారం అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆధికారులు పంట వద్దకు వెళ్లి పరిశీలించి ఎంత మేరకు నష్టం వాటిల్లిందన్న విషయాన్ని చూసి సర్వే చేయాలి. పరిహారం అందజేసే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
– మేకల శేషిరెడ్డి, అంజనాపురం

 

మరిన్ని వార్తలు