ఫ్యాక్షనిస్టులు, రౌడీలకు.. నంద్యాలలో స్థానం లేదు

20 Jul, 2017 02:34 IST|Sakshi
ఫ్యాక్షనిస్టులు, రౌడీలకు.. నంద్యాలలో స్థానం లేదు

ఇక్కడి ప్రజలు విజ్ఞత కల్గినవారు
బెదిరింపులు, దౌర్జన్యాలకు ఓటుతో దీటుగా సమాధానం చెప్పండి
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పిలుపు
అలజడి రేపేందుకు ప్రభుత్వ పెద్దల యత్నం: అనంత
23వ వార్డులో ప్రచారానికి విశేష స్పందన


నంద్యాల అర్బన్‌: ‘నంద్యాలకు దేశ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రజలు సౌమ్యులు, విజ్ఞత కల్గిన వారు. ఫ్యాక్షనిస్టులకు, రౌడీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానం కల్పించబోర’ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పట్టణంలోని 23వ వార్డులో పర్యటించారు. భగత్‌సింగ్‌ కాలనీ, పక్కీర్‌పేట, టీచర్స్‌ కాలనీ, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని వీధుల్లో స్థానిక మహిళలు, నాయకులు, కార్యకర్తలు  పూలవర్షం కురిపించి.. ఘన స్వాగతం పలికారు. అనంతరం తిక్కస్వామి దర్గా, శివాలయాల్లో శిల్పా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేశారు. శ్రమదానం బ్రిడ్జి సమీపంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బెదిరింపులు, దౌర్జన్యాలకు ఓటుతో దీటుగా సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న సీఎం చంద్రబాబు దిమ్మతిరిగేలా ఉప ఎన్నికలో తీర్పు ఇవ్వాలని కోరారు.

టీడీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా వైఎస్సార్‌సీపీ గెలుపును ఆపలేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక విజయంతో తమ పార్టీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక నాంది కాబట్టే అధికార పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఆ పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రశాంతమైన నంద్యాలలో అలజడి రేపేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజా బలంలో మనమే బలవంతులమని, అధికార పార్టీ ఆగడాలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.  ఉప ఎన్నికలో విజయానికి ప్రతి కార్యకర్తగా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.  సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం వైఎస్సార్‌సీపీ చేతకాదని, అలా చేసి ఉంటే 2014లోనే జగన్‌ సీఎం అయ్యేవారని అన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన మాట్లాడుతూ టీడీపీ కల్లబొల్లి హామీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వానికి నంద్యాల అభివృద్ధి గుర్తుకు రావడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, సీఈసీ సభ్యుడు ఆదిశేషు, స్థానిక కౌన్సిలర్‌ షేక్‌హజరాబీ, కో ఆప్షన్‌ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అమృతరాజు, సుబ్బరాయుడు, కృష్ణమోహన్,  దేవనగర్‌ బాషా, నాయకులు బషీర్‌ అహమ్మద్, మహబూబ్, కాంట్రాక్టర్‌ శీను, లాయర్‌ శ్రీనివాసులు, మస్తాన్, పెద్దకదిర్, రంగనాయకులు, సుబ్బారావు, మునెయ్య, శేఖర్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు