చైనా గిల్లికజ్జాలు!

23 Jul, 2013 01:21 IST|Sakshi
చైనా గిల్లికజ్జాలు!

మాటలకూ, చేతలకూ పొంతన లేకపోవడం...గిల్లికజ్జాలు పెట్టుకునే ధోరణిలో వ్యవహరించడం దౌత్య కళలో భాగం అనుకుంటే ఆ కళలో చైనాను మించిన వారుండరు. సరిహద్దు వివాదాన్ని పక్కనబెట్టి ఆర్ధిక, వాణిజ్య సంబంధాలను పరిపుష్టం చేసుకుందామని నాలుగు దశాబ్దాల నాడు భారత, చైనాలు నిర్ణయించుకున్నాయి. ఆ దిశగా ఎంతో కొంత అభివృద్ధి సాధిస్తున్న ప్రతిసారీ సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం చైనాకు సర్వసాధారణమైంది. తిరిగే కాలు... తిట్టే నోరూ తీరువగా ఉండటం అసాధ్యం. అందుకే, లడఖ్ ప్రాంతంలో  చైనా మరోసారి చొరబాటు యత్నం చేసినట్టు తాజాగా వెల్లడైంది. ఆ కథనాల ప్రకారం అయిదారు రోజుల క్రితం అక్కడి చుమార్ ప్రాంతంలో చైనా సైన్యానికి చెందిన అశ్విక దళం చొరబడింది.
 
 అది తమ భూభాగమని, అక్కడినుంచి వెళ్లిపోవాలని భారత సైనికులను బెదిరించింది. అదే ప్రాంతంలో 11వ తేదీన రెండు చైనా హెలికాప్టర్లు చొచ్చుకొచ్చాయి. ఈ ఘటనలు జరగడానికి ముందు చైనా సైనిక జనరల్ ఒకరు సరిహద్దుల్లో ‘కొత్త సమస్యలు’ సృష్టించవద్దని మన దేశానికి హితవు చెప్పారు! ఇలాంటి తుంటరి పనులకు పాల్పడటానికి చైనా ఎంచుకున్న సమయం చూస్తే దాని అంతరంగమేమిటో అర్ధమవుతుంది. ఈ నెల మొదటివారంలో రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోని చైనా సందర్శనకు వెళ్లారు. మన రక్షణ మంత్రి ఒకరు చైనాను సందర్శించడం ఏడేళ్లలో ఇదే మొదటిసారి. సరిహద్దుల్లో ఏదో రకమైన అలజడి సృష్టించ డానికి, ఒక సైనికాధికారితో బాధ్యతారహితంగా మాట్లాడించడానికి సరిగ్గా ఈ సమయాన్ని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. కావాలనే, ఉద్దేశపూర్వకంగానే అది అలా ప్రవర్తిస్తోంది.
 
  చైనాతో మనకు 4,057 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ సరిహద్దుగా ఉంది. ఆ రేఖ వెంబడి దాదాపు డజను ప్రాంతాలు వివాదంలో ఉన్నాయి. ఆక్సాయ్‌చిన్, లడఖ్ ప్రాంతాల్లో 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని భారత్ చెబుతుంటే, తమ భూభాగం 90,000 చదరపు కిలోమీటర్లు భారత్ అధీనంలో ఉన్నదని చైనా అంటోంది. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం వెతికేలోగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుందామని, సరిహద్దుల్లో ఎవరమూ హద్దు మీరవద్దని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. కానీ, ఈ ఒప్పందానికి ఏనాడూ చైనా కట్టుబడి లేదు. ఇరుదేశాలమధ్యా సుహృద్భావ సంబంధాలు కొనసాగుతుండగానే అందుకు సమాంతరంగా సరిహద్దుల్లో ఏదో ఒక చేష్టకు పాల్పడటం చైనా ఆపలేదు. గత రెండేళ్లలోనే ఆ ప్రాంతంలో చైనా వైపునుంచి దాదాపు 500 సార్లు చొరబాట్లు జరిగాయి.
 
  తాజాగా చుమార్ ప్రాంతంలో జరిగిన ఘటన కూడా ఆ కోవలోనిదే. రెండు నెలలక్రితం లడఖ్‌లోని దౌలత్‌బేగ్ వద్ద చైనా సైన్యం చొచ్చుకురావడమే కాదు... ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటుచేసుకుంది. కొన్నిరోజులపాటు ఇరుదేశాల బలగాలు ఎదురుబొదురుగా నిలిచాయి. నెలక్రితం అదే ప్రాంతంలో మన భూభాగంలోకి వచ్చి అక్కడున్న నిఘా కెమెరాను చైనా సైనికులు అపహరించారు. మనవైపు గట్టిగా నిరసన వ్యక్తంచేశాక ఆ కెమెరా తిరిగొచ్చింది. అయితే, వీటిని పెద్దగా పట్టించుకోనవసరంలేదని మన దేశం చెబుతోంది. వివాదాలు రేకెత్తుతున్న మాట వాస్తవమే అయినా, అవి కాల్పుల వరకూ రావడంలేదంటోంది. వాస్తవాధీన రేఖ వద్ద కేవలం అతిక్రమణలున్నాయి తప్ప, చొరబాట్లు లేవని వివరిస్తోంది. అక్కడి పరిణామాలపై ఇరుదేశాలమధ్యా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, పరస్పరం అభిప్రాయాలు తెలుపుకున్నామని మన విదేశాంగ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. మంచిదే. అయితే, ఎల్లకాలమూ ఇలా ఏదో ఘటన చోటుచేసుకోవడం, అందుకు కొనసాగింపుగా చర్చలు, మళ్లీ ఎక్కడో మరో ఘటన జరుగుతూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట పడవలసిన అవసరం ఉంది.
 
  భారత్‌తో బలమైన స్నేహ బంధాన్ని కోరుతున్నామని తరచు చైనా అధినాయకులు చెబుతుంటారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్ మే నెలలో వచ్చినప్పుడూ ఇదే చెప్పారు. కానీ, చేతలు చూడబోతే మాత్రం వేరుగా ఉంటున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఇరు దేశాల అధినేతలు ప్రయత్నిస్తున్న ప్రతిసారీ చొరబాటు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి సంఖ్యరీత్యా చూసినా, ఇతరేతర ఏర్పాట్లరీత్యా చూసినా చైనా బలగాలదే ఆధిపత్యం. వారి ముందు భారత్ సైన్యం తీసికట్టే. అవి చొరబాట్లు కావొచ్చు, అతిక్రమణలు కావొచ్చు... ఎక్కువ సంఖ్యలో చోటుచేసుకోవడానికి కారణం ఇదే. బహుశా ఇందువల్లే కావొచ్చు... పర్వత ప్రాంతాల్లో శత్రువుతో తలపడగల ప్రత్యేక దళాలను ఏర్పాటుచేయాలని గతవారం జరిగిన కేబినెట్ కమిటీ భేటీలో మన ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, చైనా సరిహద్దు వెంబడి 50,000 అదనపు దళాలను మోహరించాలని సంకల్పించింది.
 
 భారత్ ప్రయత్నాలను ముందే పసిగట్టిన చైనా ఆంటోని ముందు కొత్త ప్రతిపాదన తెచ్చింది. సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ బలగాల సంఖ్యలో యథాతథ స్థితిని కొనసాగించాలన్నది ఆ ప్రతిపాదన సారాంశం. అలాగే, సైనికులకు సంబంధించి ఏర్పాటుచేసే మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలని కోరింది. ఈ రెండు అంశాల్లోనూ ఆధిక్యత ఉండబట్టే సరిహద్దుల్లో తాను ఆడింది ఆటగా ఉన్నదని చైనాకు తెలుసు. అందుకే ఈ స్థితి మారకూడదని వాంఛిస్తోంది. ఇరుదేశాల మధ్యా స్నేహసంబంధాలు బలపడాలని, పరస్పర సుహృద్భావ వాతావరణం ఏర్పడాలని కోరుకునేవారంతా సరిహద్దులు ఘర్షణలకు నిలయం కాకూడదనే భావిస్తారు. అయితే, అవతలివారి మెతకదనమో, సంయమనమో... చేతగానితనంగా భావిస్తున్నంతకాలమూ ప్రశాంతత లభించదు.  చైనా తాజా చేష్టలను తీవ్రంగా పరిగణించి, అవి పునరావృతం కాకుండా మన ప్రభుత్వం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి.

మరిన్ని వార్తలు