స్పీకర్‌ల అధికారాలు తేల్చాలి

27 Oct, 2018 01:41 IST|Sakshi

తమిళనాడులో టీటీవీ దినకరన్‌ శిబిరంలోకి వెళ్లిన18మంది అన్నా డీఎంకే శాసనసభ్యులపై అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌ అనర్హత వేటు వేయడం సరైందేనని మద్రాస్‌ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్ర రాజకీయాలకు ఓ కుదుపు. తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఆ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన  పిటిషన్‌పై నాలుగు నెలలక్రితం ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం రెండు భిన్నమైన తీర్పులివ్వడంతో ఈ కేసు మూడో న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణన్‌ దగ్గరకెళ్లింది.

స్పీకర్‌ చర్య సరైనదేనని ఆ ఇద్దరు సభ్యుల్లో ఒకరైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరాబెనర్జీ ఇచ్చిన తీర్పుతో తాజాగా జస్టిస్‌ సత్యనారాయణన్‌ ఏకీభవించడంతో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పలేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి ఈ తీర్పు తాత్కాలికంగా ఊరట కలిగించింది. దానికితోడు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలంతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని శుక్రవారం నిర్ణయించడం కూడా ఒకరకంగా ఆయ నకు అనుకూల పరిణామమే. అందుకు భిన్నంగా వారు అనర్హతకు సిద్ధపడి ఉప ఎన్నికలవైపే మొగ్గు చూపితే పళనిస్వామి ఇబ్బందుల్లో పడేవారు.

అనర్హులైన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిం చిన 18 స్థానాలతోపాటు  డీఎంకే అగ్రనేత కరుణానిధి, అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఏకే బోస్‌ల మరణాలతో ఖాళీ అయిన మరో రెండు సీట్లకు ఉప ఎన్నికలొస్తే అవి ఆయనకు అగ్నిపరీక్షగా మారేవి. ఆయనా, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంల సత్తా ఏమిటో తేలిపోయేది. అన్నాడీఎంకే విజయం సాధించలేకపోతే వారి శిబిరం ఖాళీ అయి, ప్రభుత్వం కుప్పకూలేది. నిరుడు అన్నాడీ ఎంకేలోని పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు విలీనమయ్యాక జయలలిత సన్నిహితురాలు శశికళనూ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు.

అయితే పార్టీలోని 19మంది ఎమ్మెల్యేలు దినకరన్‌తోనే ఉండిపోయారు. వారు నిరుడు సెప్టెంబర్‌లో అప్పటి గవర్నర్‌ విద్యాసాగరరావును కలిసి పళని ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారిలో ఒకరు వెనక్కి తగ్గారు. మిగిలినవారిపై స్పీకర్‌ ధన్‌పాల్‌ అనర్హత వేటు వేశారు. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో డీఎంకేకు 88, ఆ పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్‌కి 8, ఐయూ ఎంఎల్‌కు ఒక స్థానం ఉన్నాయి.   

అయితే తమిళనాడు రాజకీయ దృశ్యం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఎవరి ప్రభుత్వాలున్నా అవి దూకుడుగా వ్యవహరించేవి. కేంద్రంలో ఎవరున్నా కావలసినవి సాధించుకునేవి. పళని సర్కారు అందుకు భిన్నం. పేరుకు ప్రభుత్వం ఉన్నా ఏ విష యంలోనూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నదన్న అభిప్రాయం కలగదు. ‘తల లేని మొండెం’ తరహాలోనే వ్యవహరిస్తోంది.  అది బీజేపీ పెద్దల ఆదేశాలతో నడుస్తున్నదని విపక్షాలు తరచు విమర్శిస్తుంటాయి.  

జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్‌కే నగర్‌  ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్‌ భారీ మెజారిటీతోనే నెగ్గినా ఆయన పార్టీ అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు జనంలో ఏమేరకు ఆదరణ ఉందో ఇంకా తెలియదు. ఆ విషయంలో ఆయనకే స్పష్టత లేదు. కను కనే అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కనబడు తోంది. ఆయన పార్టీకి కార్యకర్తల బలం లేదు. ఈ స్థితిలో ఉప ఎన్నికలకు సిద్ధపడి, పరాజయం పాలైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయన శిబిరంలో ఎవరూ మిగలరు.

కానీ విపక్ష డీఎంకేకు ఇకపై తాము మాత్రమే ప్రధాన ప్రత్యర్థులమని దినకరన్‌ తరచు చెబుతుంటారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కార్యకర్తలతో పటిష్టంగా ఉన్నవి రెండే రెండు పార్టీలు–డీఎంకే, అన్నాడీఎంకే. అధి కారంలో ఉంది గనుక అన్నాడీఎంకేకు కార్యకర్తల బలం ఇంకా దండిగానే ఉంది. సినీ నటుడు కమల్‌హాసన్‌ పేరుకు పార్టీ ప్రారంభించినా అదింకా అడుగులేయడం ప్రారంభించలేదు. మరో నటుడు రజనీకాంత్‌ పార్టీ ఇంకా పురుడు పోసుకోలేదు. పళని ప్రభుత్వాన్ని నడిపించేది బీజేపీ యేనని అందరూ అనుకుంటున్నా ఆ పార్టీ అందుకు తగ్గట్టు చురుగ్గా పనిచేస్తున్న దాఖలాలు లేవు.

బీజేపీ కర్ణాటకలో అట్టడుగు స్థాయి వరకూ పార్టీ శ్రేణుల్ని పటిష్టపరుచుకుని అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటగలిగింది. కేరళలో సైతం రాజకీయంగా పనికొచ్చే ఏ అంశాన్నీ వదలకుండా పనిచేస్తోంది. కానీ తమిళనాడులో ఇందుకు భిన్నం. ప్రధాన నాయకులు హెచ్‌. రాజా, తమిళసై సౌందర్‌రాజన్‌లిద్దరూ తాము చేసే కార్యక్రమాల కన్నా, తరచు చేసే అపసవ్య వ్యాఖ్యల ద్వారా వార్తల్లోకెక్కుతూ ఉంటారు. నోరుజారి ఏదో వివాదంలో చిక్కుకుని ఇబ్బందుల్లో పడతారు.

డీఎంకే మాత్రం అన్నివిధాలా పటిష్టంగా ఉంది. అయినా రజనీకాంత్‌ను అది తక్కువ అంచనా వేయడం లేదు. ఆయన్ను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగించడం... సొంత పార్టీ ఏర్పాటుకే రజనీ మొగ్గు చూపితే ఆయనపై బీజేపీ ముద్రేసి ప్రభావం తగ్గించే ప్రయత్నం చేయడం డీఎంకే వ్యూహం.  అయితే ఒక్క తమిళనాడు ఉదంతంపైన మాత్రమేకాక మొత్తంగా స్పీకర్లకున్న అధికారాలను సుప్రీంకోర్టు సమీక్షించడం తక్షణావసరం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్‌ స్థానం ఉన్నతమైనది. ఆ స్థానంలో ఉన్నవారు తటస్థంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాలని రాజ్యాంగం భావిస్తుండగా, ఆచరణలో అదంతా తలకిందులవుతోంది.

పాలక పక్షాల కనుసన్నల్లో మెలగుతూ నిర్ణయాలు తీసుకోవడం లేదా నిర్ణయరాహిత్యంతో గడిపేయడం స్పీకర్‌లకు అల వాటైపోయింది. తాము అన్నిటికీ అతీతులమని, తమ జోలికెవరూ రాలేరని వారు భావిస్తున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల అప్పీల్‌ విచారణ సందర్భంగానైనా చట్టసభల హక్కులు, స్పీకర్ల అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం వెలువరిస్తే ప్రస్తుత అరాచక ధోరణికి అడ్డుకట్ట పడుతుంది.
 

మరిన్ని వార్తలు