‘ఆహార భద్రత’ ఇలాగేనా?!

15 Nov, 2014 00:34 IST|Sakshi

మూడు నెలలక్రితం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో ఏర్పడిన వివాదం సమసిపోయింది. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(టీఎఫ్‌ఏ) విషయంలో ఎడ మొహం, పెడమొహంగా ఉన్న భారత్, అమెరికాల మధ్య గురువారం రాజీ కుదిరింది. టీఎఫ్‌ఏపై సంతకం చేయాలంటే... ఆహారభద్రతపై ఎలాంటి ఆంక్షలూ విధించరాదని జెనీవాలో మూడు నెలలక్రితం జరిగిన డబ్ల్యూటీఓ సాధారణ మండలి సమావేశంలో పట్టుబట్టిన మన దేశం వాదనకు అమెరికా పాక్షికంగా అంగీకరించింది. దాని ప్రకారం టీఎఫ్‌ఏపై భారత్ సంతకం చేస్తుంది. అందుకు ప్రతిగా మన ఆహార భద్రత కు సంబంధించిన అంశాలపై తుది పరిష్కారం లభించేవరకూ అగ్రరాజ్యాలు ఆంక్షలకు పట్టుబట్టవు.

2017 వరకూ ఆహారభద్రత జోలికి అగ్రరాజ్యాలు రాకుండా ఉంటే టీఎఫ్‌ఏపై సంతకం చేస్తామని నిరుడు బాలి సదస్సులో మన దేశం అంగీకరించింది. అదే సమయంలో టీఎఫ్‌ఏపై మరిన్ని తదుపరి చర్చలు అవసరమని చెప్పింది. అయితే, బాలి సదస్సు తర్వాత టీఎఫ్‌ఏ విషయంలోగానీ, మన ఆహారభద్రత విషయంలోగానీ అగ్రరాజ్యాలు కిమ్మనలేదు. చర్చలకు చొరవ తీసుకోలేదు. తీరా జెనీవా సమావేశం నాటికి తొలుత అంగీకరిం చినట్టు టీఎఫ్‌ఏపై సంతకం చేయాలని కోరాయి. దీన్ని మన దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. పర్యవసానంగా అది కాస్తా ప్రతిష్టంభనతో ముగిసింది.  

టీఎఫ్‌ఏ విషయంలో ఇలా మన దేశం ఆఖరి నిమిషంలో అడ్డం తిరిగినందువల్ల ప్రపంచం లోనే ఏకాకులమయ్యామని ప్రముఖ ఆర్థికవేత్తలు నొచ్చుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో లక్ష కోట్ల డాలర్ల మేరకు విస్తరించే బంగారంలాంటి అవకాశాన్ని కాలరాస్తున్నామని విమర్శించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత బాలి సదస్సు చరిత్రాత్మకమైన అంగీకారానికొస్తే మన దేశం జెనీవాలో దాన్ని కాస్తా నీరుగార్చిం దన్నారు. అసలు సంబంధమే లేని టీఎఫ్‌ఏ అంశంతో ఆహారభద్రతను ముడిపెట్ట డం తప్పని వాదించారు. అలాంటివారంతా ప్రస్తుత రాజీపై హర్షామోదాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది మనకు దౌత్యపరమైన విజయమని అభివర్ణిస్తున్నారు.
 
దేశ ప్రయోజనాల విషయంలో ఎన్డీయే సర్కారు రాజీపడని ధోరణిని ప్రదర్శించినందుకు మెచ్చుకున్నవారూ చాలామందే ఉన్నారు. టీఎఫ్‌ఏ వల్ల అగ్రరాజ్యాలు చెబుతున్నట్టు అంతర్జాతీయ వాణిజ్యం మరో లక్ష కోట్ల డాలర్ల మేర పెరగవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులు, ఇతర సరుకులు స్వేచ్ఛగా ఒక చోటునుంచి మరో చోటుకు కదులుతాయి. వాటిపై నిర్దిష్టమైన పరిమితులకు మించి సుంకాలు విధించడం దేశాలకు సాధ్యంకాదు. ఇదంతా ప్రధానంగా పారిశ్రామిక దేశాలకు ఉపయోగపడుతుంది.

అంతేకాదు...వర్థమాన దేశాలు, బడుగు దేశాలు అమెరికా, యూరోప్ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని భారీ మొత్తాల్లో పెట్టుబడులను సమీకరించుకోక తప్పదు. మళ్లీ అందుకు అవసరమైన సాంకేతికతను అగ్రరాజ్యాలనుంచే కొనుగోలు చేయాలి. అంటే టీఎఫ్‌ఏ వల్ల అన్నివిధాలా బాగుపడేది అగ్రరాజ్యాలే.  పైగా టీఎఫ్‌ఏలోని ఒక క్లాజు మొత్తం వ్యవసాయోత్పత్తుల విలువలో సబ్సిడీల శాతం 10 శాతానికి మించరాదని చెబుతున్నది.

దీన్ని ఉల్లంఘించిన దేశంపై ఇతర దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే టీఎఫ్‌ఏ వర్థమాన దేశాలపాలిట యమపాశమవుతుంది. వర్థమాన దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడతాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వ్యవ సాయంతో ముడిపడి ఉంటాయి. అందువల్లే రైతులకు సబ్సిడీ ధరలపై ఎరువులు అందించాల్సి ఉంటుంది.

అదే సమయంలో నిరుపేద వర్గాలవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ధరలకు తిండిగింజలు అందించాల్సి ఉంటుంది. అందు కోసమని ఎఫ్‌సీఐ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ చేయాలి. వ్యవసాయ రంగానికి వర్థమాన దేశాలిచ్చే ఇలాంటి రక్షణల వల్ల స్వేచ్ఛా వాణిజ్య స్ఫూర్తి దెబ్బతిం టుందని అగ్రరాజ్యాలు వాదిస్తున్నాయి. వాస్తవానికి ఈ రక్షణలు లేకపోతే అటు వ్యవసాయరంగమూ దెబ్బతింటుంది...ఇటు నిరుపేదలకు తిండిగింజలు అందు బాటులో ఉండవు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడుతుంది.
 
టీఎఫ్‌ఏ విషయంలో గట్టిగా నిలబడినందుకు మోదీ సర్కారును అభినందించాల్సిందే. అయితే అదే సమయంలో దేశీయంగా తీసుకున్న కొన్ని చర్యలు వ్యవసాయరంగానికి తోడ్పడేవి కాదు.  ఉదాహరణకు పంటలకిచ్చే కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) విషయంలో ఈసారి కేంద్రం ఉదారంగా వ్యవహరించ లేదు. అటు వరికైనా, ఇటు గోధుమకైనా నిరుటితో పోలిస్తే క్వింటాల్‌కు పెంచిన ధర రూ. 50 మాత్రమే. అంతేకాదు...తాను ప్రకటించే ఎంఎస్‌పీపై రాష్ట్రాలు బోనస్ ఇచ్చే విధానాన్ని నిరుత్సాహపరచాలని మొన్నటి జూన్‌లో నిర్ణయించింది.

ఇలాంటి నిర్ణయాలు పరోక్షంగా మన ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ వేదికలపై ఆహారభద్రతను సంరక్షించుకోవడానికి పోరాడుతూనే దాన్ని దెబ్బతీసే విధానాలను మనమే అమలు చేయబూనడం న్యాయం అనిపించుకోదు. ఇప్పటికే వ్యవసాయానికి చేసే వ్యయం భారీగా పెరిగిపోతుండగా, అందుకు అనుగుణంగా తన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక రైతాంగం విలవిల్లాడుతున్నది.

రైతులు ఎక్కువగా వినియోగించే డీఏపీ అయినా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలైనా ఈ రెండు మూడేళ్లలోనే ఎంతగా పెరిగాయో అందరికీ తెలుసు. అదునుకు వర్షాలు కురవక, అనువుగాని సమయంలో కుంభవృష్టి కురిసి అన్నివిధాలా నష్టపోతున్న రైతును ప్రభుత్వ విధానాలు కూడా చావుదెబ్బ తీయడం సరికాదు. డబ్ల్యూటీఓ వంటి అంతర్జాతీయ వేదికలపై పోరాడిన స్ఫూర్తినే ఇక్కడి విధానాల రూపకల్పనలో కూడా చూపి ఆహార భద్రత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి.
 

మరిన్ని వార్తలు