సాగిలపడిన ‘బాబు’ రాజకీయం 

22 Oct, 2019 00:23 IST|Sakshi

అభిప్రాయం

మెర్జర్లు, ఎక్విజిషన్లు అన్నవి ఒకప్పుడు ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం. ఇప్పుడు విలీనాలు, ఎక్విజిషన్లు, టేకోవర్లు అన్నవి రాజ కీయ రంగంలో ఎక్కువయ్యాయి. సిద్ధాంతాల ప్రాతిపదికన, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇవి జరిగితే ఎవరూ తప్పు పట్టరు. అయితే, ఒక కంపెనీ మెజార్టీ వాటాలను మరో కంపెనీ దక్కించుకొని అంతి మంగా సదరు కంపెనీని తమలో కలిపేసుకునేవిధంగా.. పార్టీ కీలక నేతల్ని లాక్కొని చిట్టచివరకు గంపగుత్తగా ఆ పార్టీ మొత్తాన్ని తనలో విలీనం చేసుకొనే ప్రక్రియకు భారతీయ జనతాపార్టీ (బీజేపీ) శ్రీకారం చుట్టి చాలాకాలం అయింది. బీజేపీ దూకుడుకు నేడు అనేక రాజకీయ పార్టీలు కకావికలం అవుతున్న దృశ్యం దేశవ్యాప్తంగా గోచరిస్తున్నది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బలహీనతలను ఆధారం చేసుకొని దానిని తమలో విలీనం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు తెలుగుదేశం అధినేత సంపూర్ణంగా సహకరిస్తున్నారని చెప్పడానికి నిర్ధిష్టమైన ఆధారాలు,  ఆనవాళ్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 

2009 తర్వాత తెలుగుదేశం పార్టీకి సర్వం తామే అన్నట్లు వ్యవహరించిన మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, గరికపాటి మోహన్‌ రావులు మరో తెలుగుదేశం ఎంపీ అయిన టి.జి. వెంకటేష్‌లు బలమైన కారణాలతోనే బీజేపీలోకి చేరారు. తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించిన అంశంపై తెలుగుదేశం స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీనిలో ఏదో గూడుపుఠాణీ ఉన్నదని అప్పుడే అనుమానం కలిగింది.  టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో మరికొంతమంది బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలొస్తున్నా.. చంద్రబాబు తనకేమీ పట్టనట్లు నిర్వికారంగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలంగాణలో అయితే ఒకరిద్దరు నాయకులు మినహా టీడీపీ దాదాపుగా బీజేపీలో విలీనం అయినట్లుగానే జరిగిపోయింది. 

ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు చేసిన హడావుడిని గుర్తుచేసుకోవాల్సి ఉంది. తమిళనాడు వెళ్లి ఏప్రిల్‌ 16, 2019న చెన్నైలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘‘నా పోరాటం ఏపీలో గెలుపు కోసం కాదు.. దేశం కోసం. అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆయన పాలనకు ముగింపు పలికే వరకు విశ్రమించను. ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈసీ తీరు, ఈవీఎం అవకతవకలపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం’’ అని ప్రకటించారు. వెళ్లిన ప్రతిచోటా దాదాపుగా ఈ విధంగానే మాట్లాడారు. నరేంద్రమోదీ దేశానికి పట్టిన అరి ష్టంగా అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు మోదీ లున్నారంటూ.. వైఎస్‌ జగన్, కేసీఆర్, నరేంద్ర మోదీలను నీచంగా తిట్టారు. అయితే, ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీఏ గెలుపును, ఏపీలో వైఎస్సార్‌సీపీ ఘన విజయాన్ని చూసిన చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఆ విమర్శలు ఎంతదూరం వెళ్లాయంటే.. ఓటర్లకు పంచేందుకు నరేంద్ర మోదీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోనే డబ్బు తీసుకువెళుతున్నారని ఆరోపించారు. ‘నమో టీవీ’ పేరుతో సొంత చానెల్‌ పెట్టుకొన్నారని, ఐబీ, ఐటీ, ఈడీ వంటి సంస్థలతో నరేంద్ర మోదీ ప్రత్యర్థుల్ని అణచివేస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. తెలుగునాట చంద్రబాబుకు అనుకూలమైన ఓ దినపత్రిక ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపర్చేవిధంగా ‘‘నరేంద్ర మోదీకి సెంటిమెంట్లు లేవు, కుటుంబం లేదు, సొంత భార్యను వదిలి వేసినవాడికి ప్రజలంటే ఏమి అభిమానం ఉంటుంది?’’ అంటూ వికృత రాతలకు పాల్పడింది. రఫేల్‌ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్‌ వేసిందని, పాక్‌లో ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్‌ దాడుల్లో 300 మంది చనిపోవడం.. హాలీవుడ్‌ సినిమా కథలో మాదిరిగా ఉందంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.  

తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ఈ 5 నెలల్లో ఏ ఒక్క జాతీయ అంశంపైన కూడా నోరు విప్పలేదు. అస్సాంలో అమలు చేసిన ‘జాతీయ పౌర పట్టిక’ అంశం మొదలుకొని ఆర్థిక మాంద్యం వరకూ అనేక వివాదాస్పద అంశాలలో బీజేపీని తప్పుపట్టే అవకాశం ఉన్నా.. చంద్రబాబుకు మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో బీజేపీ కోరకపోయినా.. తెలుగుదేశం మద్దతు పలకడం గమనార్హం. చివరకు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగితే జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబునాయుడు స్పందించలేదు. ఎన్ని కల సమయంలో చంద్రబాబునాయుడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాతో ఏపీలో ఎన్నికల ప్రచారం చేయించారు. కాగా, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఫరూక్‌ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచింది. ఆయనను పరామర్శించడానికి రాహుల్‌గాంధీ, సీతారాం ఏచూరి, డి.రాజా వంటి కాంగ్రెస్, వామపక్ష నేతలు చొరవచూపించారు. ఆయన హౌస్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. కానీ.. చంద్రబాబు చిన్న ప్రకటన చేయలేదు. బీజేపీకి, ప్రధాని మోదీకి చంద్రబాబు భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ వేరొకటి ఉంటుందా? 100 మంది మోదీలు వచ్చినా తననేమీ చేయలేరని హూంకరించిన చంద్రబాబుకు నేడు నరేంద్రమోదీ పేరు ఎత్తితే నిద్రలేని పరిస్థితి ఏర్పడింది. 

చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ అస్థిత్వం కంటే ప్రస్తుత పరిస్థితుల్లో తన అస్థిత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఐదేళ్ల తన పరిపాలనలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణాలు బయటపడితే.. తను జైలుకు వెళ్లడం త«థ్యం అని ఆయనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీకి దగ్గర కావాలని తహతహలాడుతున్నారు. చంద్రబాబునాయుడు మనుషులతో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ప్రస్తుతం ఓ ‘‘ట్రోజన్‌ హార్స్‌’’గా తయారైంది. బీజేపీని మొదట్నుంచీ నమ్ముకున్న నాయకుల్ని బయటకు పంపి బీజేపీపై పట్టు సాధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలి గించాలన్నది చంద్రబాబునాయుడి దురాలోచనగా కనిపిస్తున్నది. నాలుగు దశాబ్దాల రాజకీయం తన సొంతం అని చెప్పుకొనే చంద్రబాబునాయుడు రాజకీయంగా అత్యంత హీన స్థితికి చేరారు. అయితే, చంద్రబాబును బీజేపీ చేరదీస్తుందా? చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలిలో చేరి తెలం గాణ కాంగ్రెస్‌ కోలుకోలేనంత తీవ్రంగా నష్టపోయింది. ఏపీ బీజేపీ చంద్రబాబు ఎత్తుగడలు, టక్కుటమార విద్యలకు బలికాకుండా జాగ్రత్త పడుతుందా?


సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ ఎంపీ,
అధికార ప్రతినిధి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా