జమ్మూ-కశ్మీర్ చిక్కుముడి

12 Jan, 2015 02:00 IST|Sakshi
జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఓటు వేయడానికి బారులు తీరిన ఓటర్లు

 ఉగ్రవాదుల బెదిరింపులను, వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును బేఖాతరుచేసి జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నవారందరినీ నిరాశపరిచేలా ఆ రాష్ట్రం గవర్నర్ పాలనలోకి జారుకుంది. ఎన్నికలు ఫలితాలు వెలువడి రెండు వారాలు కావస్తున్నా ప్రధాన రాజకీయ పక్షాలమధ్య కుదరని అవగాహన...ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనని ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా కు స్పష్టంచేయడం పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. 87 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి 28, బీజేపీకి 25 రాగా...అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)కి 15, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 12 లభించాయి. ఓటర్లు ఏ పార్టీకీ విస్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంవల్ల ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చోటుచేసుకుంది. లోయలో హురియత్ పిలుపును ధిక్కరించి ఓటేయడానికొచ్చిన వారిలో అధిక సంఖ్యాకులు పీడీపీనే ప్రధానంగా ఎంచుకుంటే...జమ్మూలోని ఓటర్లు ప్రధానంగా బీజేపీపైనే విశ్వాసం ఉంచారు. ఇలా రెండు వేర్వేరుచోట్ల బలమైన పక్షాలుగా ముందుకొచ్చిన రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఆ రాష్ట్ర ప్రజల అభీష్టం కొంతమేరకైనా ప్రతిబింబిస్తుంది. దాన్ని గుర్తించడంవల్ల కావొచ్చు... పీడీపీ, బీజేపీలు ప్రభుత్వం ఏర్పాటుపై రెండు వారాలుగా చర్చలు జరుపుతు న్నాయి. బీజేపీకి కశ్మీర్‌లోయలోగానీ, లడఖ్‌లోగానీ ఒక్క స్థానం కూడా లభించ లేదు. మరోపక్క పీడీపీ జమ్మూ ప్రాంతంలో మూడు సీట్లు గెలుచుకున్నా లడఖ్ ప్రాంతంలో ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయింది. ఇంతవరకూ అధికారం చెలాయించిన ఎన్‌సీ, కాంగ్రెస్‌లు మొత్తంగా తిరస్కరణకు గురయ్యాయన్నది సుస్పష్టం. కనుక ఆ పార్టీలు ఇస్తామన్న బేషరతు మద్దతును స్వీకరించరాదన్న విషయంలో పీడీపీ నిర్ణయం సరైనదనే చెప్పాలి. అయితే పీడీపీ, బీజేపీలు సుదీర్ఘంగా మంతనాలు సాగించినా ప్రభుత్వం ఏర్పాటుపై ఒక అవగాహనకు రావడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వానికి ఏ పక్షం సారథ్యంవహించాలి...ఉప ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే అంశం మొదలుకొని సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కొనసాగింపు వరకూ ఎన్నో విషయాల్లో ఆ రెండు పార్టీలమధ్యా విభేదాలున్నాయి. వీటికితోడు కశ్మీర్‌లోయ గట్టిగా తిరస్కరించిన మతతత్వ బీజేపీతో అధికారం పంచుకుంటున్నదని పీడీపీపై హురియత్‌వంటి సంస్థలు విరుచుకుపడే అవకాశం లేకపోలేదు. అలాగే, సరిహద్దుల్లో ప్రశాంతత ఏర్పడటానికి పాకిస్థాన్‌తోనూ, అంతర్గతంగా పరిస్థితులు చక్కబడటానికి వేర్పాటువాదులతోనూ చర్చలు అవసరమని పీడీపీ భావిస్తున్నది. వేర్పాటు వాదులు నేరుగా పాకిస్థాన్ నాయకత్వంతో మాట్లాడటంపై బీజేపీకి తీవ్ర అభ్యంతరం ఉండగా...ఆ విషయంలో తన వైఖరిని పీడీపీ ఇంతవరకూ బహి రంగంగా చెప్పలేదు. ఇక జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణంపైనా, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కొనసాగింపుపైనా బీజేపీకి ఉన్న దృఢమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం రెండు పార్టీలకూ కష్టమేననడంలో సందేహమేమీ లేదు. అయితే అది అసాధ్యం మాత్రం కాదు.

 జమ్మూ-కశ్మీర్ నిరంతరం అల్లకల్లోలంగా ఉండే పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉంది. సరిహద్దుకు అటైనా, ఇటైనా జరిగే ఏ చిన్న ఘటననైనా ఆసరా చేసుకుని వీధులకెక్కడానికి హురియత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరేళ్లపాటు రాష్ట్రంలో ప్రశాంతత ఏర్పడటం కోసం రెండు పార్టీలూ తమ తమ ఎజెండాలను పక్కనబెట్టి కొంత రాజీకి సిద్ధపడితే తప్ప ప్రభుత్వం ఏర్పాటు సాకారమయ్యే అవకాశం లేదు. రెండు పార్టీలమధ్యా ఇంతవరకూ ఏఏ అంశాల్లో ప్రతిష్టంభన ఏర్పడిందో ఇద్దరూ వెల్లడించటం లేదు.  ఎన్నికలకు ముందునుంచీ పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఎన్డీయేను ప్రశంసిస్తున్నారు. కశ్మీర్ సమస్యను అవగాహన చేసుకోవడంలోఎన్డీయే ప్రభుత్వం...ప్రత్యేకించి వాజపేయి మెరుగ్గా వ్యవహరించారని ఆయన అనేక సందర్భాల్లో అన్నారు. ఇటు బీజేపీ కూడా ఫలితాలు వెలువడిన రోజునుంచీ పీడీపీతోనే కలిసి అడుగులేయాలని నిర్ణయించు కున్నది. నిబంధనల ప్రకారం ఈనెల 19లోగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం ఉంటుంది. లేనట్టయితే గవర్నర్ పాలన పెట్టడం తప్పని సరవుతుంది. అయితే రెండు పార్టీలమధ్యా ఇప్పటికే అవగాహన ఏర్పడిందనీ, ప్రస్తుతం ‘మంచిరోజులు’ కాకపోవడంవల్ల సంక్రాంతి వెళ్లేవరకూ ఆగాలని భావిం చారని కొందరు చెబుతున్న మాట. దీన్ని పసిగట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఒమర్ నిరాకరించారని వారంటున్నారు. ఒమర్ చర్య బాధ్యతా రహితమని పీడీపీ...ఆరేళ్లపాటు సీఎం సీటు కావాలని బేరమాడుతూ పీడీపీయే ఈ స్థితి ఏర్పడేందుకు కారణమైందని ఒమర్ పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిం చిన సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను అన్ని పక్షాలూ గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వాన్ని కలిగి ఉండే హక్కు ఉన్నదని... దాన్ని నిరాకరించడం అప్రజాస్వామికమని సర్వోన్నత న్యాయస్థానం అన్నది. రాజకీయ పక్షాలమధ్య తలెత్తే విభేదాలతో జమ్మూ-కశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం లేని స్థితి ఏర్పడకూడదు. జమ్మూ-కశ్మీర్‌లో పరిష్కారం కావలసిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. గత అక్టోబర్‌లో వచ్చిన వరద బీభత్సం నుంచి చాలా ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. కరెంటు కష్టాలు అలాగే ఉన్నాయి. నిరుద్యోగం సరేసరి. వీటన్నిటిపైనా దృష్టి పెట్టడానికి ప్రజా ప్రభుత్వం అవసరం. ప్రస్తుతం విధించిన గవర్నర్ పాలన సాధ్యమైనంత త్వరగా ముగిసి ఆ దిశగా మార్గం సుగమమవుతుందని ఆశించాలి.

>
మరిన్ని వార్తలు