బ్లాక్ బాక్స్ కనిపించింది | Sakshi
Sakshi News home page

బ్లాక్ బాక్స్ కనిపించింది

Published Mon, Jan 12 2015 2:12 AM

బ్లాక్ బాక్స్ కనిపించింది

 జకార్తా/సింగపూర్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఆసియా విమానం బ్లాక్ బాక్స్‌ను ఎట్టకేలకు గుర్తించారు. సముద్రంలో 30 నుంచి 32 మీటర్ల దిగువన విమాన శకలాల మధ్య ఉన్న దీన్ని ఆదివారం డైవర్లు కనుగొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి వీలు కల్పించే ఈ కీలక పరికరాన్ని సోమవారం వెలికి తీయనున్నారు. ఇండోనేసియా నేవీ నౌకకు చెందిన డైవర్లు దీన్ని గుర్తించారని సముద్ర రవాణా డెరైక్టరేట్ జనరల్ సమన్వయకర్త టోనీ బుదియోనో తెలిపారు. శకలాల మధ్య చిక్కుకున్న బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణం వల్ల వెలికితీయలేకపోయారని, సోమవారం శకలాలను పక్కకు తొలగించి దాన్ని బయటకు తీస్తారని తెలిపారు.
 
 శక్తిమంతమైన సంకేతాలు(పింగ్స్) వచ్చిన అనంతరం బ్లాక్ బాక్స్‌ను గుర్తించారు. విమానం తోకభాగాన్ని వెలికి తీసిన ప్రాంతంలో విమానం మధ్య భాగంగా భావిస్తున్న పెద్ద శకలాన్ని కూడా గుర్తించారు. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్‌లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం రికార్డు అవుతాయి కనుక ప్రమాద వివరాలు త్వరలోనే వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ఎయిర్ ఆసియాకు చెందిన ఎయిర్‌బస్ క్యూజెడ్ 8501 విమానం గత నెల 28న 162 మందితో ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ కూలిపోవడం, ఇంతవరకు 48 మృతదేహాలను వెలికి తీయడం తెలిసిందే.
 

Advertisement
Advertisement