సుస్థిరతకు జపాన్ ఓటు!

24 Jul, 2013 01:05 IST|Sakshi
అస్థిర ప్రభుత్వాలతో, ఆర్ధిక ఒడిదుడుకులతో, ప్రకృతి విపత్తులతో కుదేలవుతున్న జపాన్‌కు చాన్నాళ్ల తర్వాత చల్లని కబురందింది. అక్కడి ఎగువ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని షింజే అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) ఘన విజయం సాధించింది. గత డిసెంబర్‌లో పార్లమెంటు దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ లభించగా, ఇప్పుడు ఎగువ సభలోనూ అదే పునరావృతమైంది. 242 స్థానాలున్న సభలో ఎల్‌డీపీ, దాని సహచర బుద్ధిస్ట్ పార్టీ న్యూ కొమిటోలకు 135 స్థానాలు లభించాయి. జపాన్ ఎగువ సభ ఎన్నికల ఫలితాలు అనేక విధాల నిర్ణయాత్మకమైనవి. ఈ ఎన్నికల్లో ప్రధాని అబే రెండు కీలకమైన వాగ్దానాలు చేశారు. కుంగిపోయివున్న ఆర్ధిక వ్యవస్థకు నూతన ఆర్ధిక సంస్కరణలతో జవసత్వాలందించడం ఒకటైతే, జపాన్ కోల్పోయిన సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించడానికి సైన్యాన్ని పటిష్టం చేయడం మరొకటి. ఎంచుకున్న ఈ రెండు లక్ష్యాలూ అత్యంత క్లిష్టమైనవి. 
 
వాటి అమలు వాగ్దానాలు చేసినంత తేలిక కాదు. జపాన్ ఒకప్పుడు అతి సంపన్నవంతమైన దేశం. అమెరికాకు దీటుగా నిలబడటమే కాదు... దాన్ని రేపో మాపో అధిగమించగలదన్న విశ్వాసం అందరిలోనూ కల్పించిన దేశం. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన ఆ దేశం 80వ దశకం నుంచి క్రమేపీ వెనక్కు వెనక్కు నడిచింది. ఒకప్పటి తన వలస దేశంగా ఉన్న చైనా దూకుడును అది తట్టుకోలేక పోయింది. తన స్థానాన్ని కైవసం చేసుకుని ఇంకా మునుముందుకు పోయేందుకు చైనా ఉబలాటపడుతున్నవేళ జపాన్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఆర్ధిక క్లేశాలు చుట్టుముట్టగా ఆ స్థానమైనా మిగులుతుందో, లేదోనన్న దిగులు దానిని ఆవరించింది. ఇలాంటి సమయంలో సుస్థిరతకు చోటిస్తే తప్ప పరిస్థితి చక్కబడదని అక్కడి ఓటర్లు సరిగానే గ్రహించారు. 
 
 అబే అధికార పగ్గాలు చేపట్టాక ఈ ఆరేడు నెలల్లో జపాన్ ఆర్ధిక వ్యవస్థ చక్కబడిన సూచనలు కనిపించాయి. దాన్ని చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం తగ్గినట్టే అనిపించింది. అయితే, ఇదంతా జపాన్ సెంట్రల్ బ్యాంకు అనుసరించిన ద్రవ్య విధానం, దాని ప్రభావంతో పుంజుకున్న మార్కెట్‌ల మహిమేనని నిపుణులంతా అన్నారు. అబేకు కూడా ఈ విషయంలో పెద్దగా భ్రమలేమీ లేవు. జపాన్ రుణ భారం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకు రెండింతలుగా ఉంది. అబే వచ్చి చేసిందల్లా దాన్ని మరికొంత పెంచడమే. సేవా రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తే తప్ప ఆర్ధిక వ్యవస్థ పట్టాలెక్కడం సాధ్యంకాదని ఆయన భావిస్తున్నారు. అలాగే, అమ్మకం పన్నును 5 నుంచి 8 శాతానికి పెంచాలనుకుంటున్నారు. 
 
 తర్వాత సంగతి ఎలావున్నా ఇలాంటి విధానాలన్నీ దేశ ప్రజలపై నిరుద్యోగాన్ని, అధిక ధరలను రుద్దుతాయి. 2008లో ఆర్ధిక మాంద్యం తర్వాత జపాన్‌లో సామాజిక ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఉపాధి కోల్పోయి, పూట గడవటం ఇబ్బందిగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాక నేరాలూ ప్రబలుతున్నాయి. ఇప్పుడు తీసుకురానున్న సంస్కరణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. నిజానికి అబే తీసుకురాదలచిన సంస్కరణలకు ఈ ఎన్నికలు గుత్తగా ఆమోదం తెలిపాయని చెప్పడం కూడా సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. 
 
అబేకు మద్దతునిస్తూనే ఆయన తీసుకురాదలచిన సంస్కరణలను మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారని వారు అంటున్నారు. గత ఏడేళ్లుగా సంస్కరణల ఊసెత్తడానికి ఏ ప్రభుత్వమూ సాహసించలేదు. ఇంచుమించు ఏడాదికో ప్రధాని మారిన చోట అది సాధ్యంకూడా కాదు. పైగా, పార్లమెంటు ఉభయసభల్లోనూ మెజారిటీ లభించిన పార్టీ ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఒక సభ తీసుకున్న నిర్ణయం మరో సభలో ఓటమిపాలవడం అక్కడ సర్వసాధారణమైంది. బహుశా ఇలాంటి పరిస్థితులవల్ల జపాన్ నానాటికీ దిగజారుతున్నదని ఓటర్లు భావించడంవల్ల కావొచ్చు...ఈసారి ఎల్‌డీపీకి ఎగువ సభలోనూ మెజారిటీ కట్టబెట్టారు.
 
రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి చవిచూశాక అమెరికా నిర్దేశకత్వంలో రూపొందిన దేశ రాజ్యాంగాన్ని తిరగరాయాలన్నది అబే రెండో లక్ష్యం. సర్వస్వతంత్ర దేశంగా జపాన్ నిలదొక్కుకోవడానికి ఈ రాజ్యాంగం అవరోధంగా ఉన్నదని ఆయన అనుకుంటున్నారు.
 
నిజానికి అబే సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించినట్టు కనబడినా ఆయన ప్రధాన లక్ష్యం ఇదేనని పరిశీలకుల భావన. ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో జపాన్ అనుసరించిన అత్యంత క్రూర విధానాలు చరిత్రలో రికార్డయి ఉన్నాయి. ఆ యుద్ధ నేరాలకు ఎన్నో వందలమంది జపాన్ సైనికులు శిక్షలు అనుభవించారు. తమ సైన్యం లక్షలాదిమంది మహిళలపై సాగించిన అకృత్యాలకు గతంలో జపాన్ క్షమాపణ కూడా చెప్పింది. అయితే, దీన్నంతటినీ తిరగరాయాలన్నది అబే ఆలోచనగా కనబడుతోంది. రక్షణ బడ్జెట్‌ను రెట్టింపుచేసి, సైన్యం సంఖ్యను పెంచి, రాజ్యాంగాన్ని మారిస్తే జపాన్ మళ్లీ గత వైభవాన్ని సొంతం చేసుకోగలదని ఆయన అనుకుంటున్నారు. అయితే, రాజ్యాంగాన్ని మార్చాలంటే అందుకు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఆమోదం తెలపాలి. దీనికితోడు రిఫరెండంలో ప్రజలు అనుకూల తీర్పునివ్వాలి. ఇవన్నీ ఎంతవరకూ సాధ్యమవుతాయో చెప్పలేంగానీ... సాధ్యమైతే మాత్రం ఇరుగుపొరుగుతో ఇప్పటికే ఉన్న పొరపొచ్చాలు మరింత పెరగడం ఖాయం. 
 
 ఇప్పటికే దీవుల విషయంలో చైనాతోనూ, దక్షిణ కొరియాతోనూ జపాన్‌కు ఉన్న వివాదాలు ఈ పరిణామాలతో ఏ మలుపు తిరుగుతాయోనన్న భయం అందరిలోనూ ఉంది. అయితే, చైనాతో ప్రస్తుతం ఉన్న వాణిజ్య బంధాన్ని తగ్గించుకుని భారత్‌తో చేయి కలపాలని, స్నేహసంబంధాలను మరింత పటిష్టపర్చుకోవాలని అబే భావించడం మనకు శుభసూచకం. జపాన్‌లో ఇప్పుడు ఏర్పడిన రాజకీయ సుస్థిరత ఆర్ధిక సుస్థిరతకు దారితీస్తే అది భారత్‌కు బహు ముఖంగా ఉపయోగపడుతుంది. 
మరిన్ని వార్తలు