వన్యప్రాణులు గజ గజ!

6 Jun, 2020 01:35 IST|Sakshi

తెలివికి, దృఢత్వానికి, శక్తికి ఏనుగు ప్రతీక. హిందూ, బౌద్ధ సంస్కృతుల్లో దానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అది ‘పరిరక్షించి తీరాల్సిన విలువైన జాతీయ సంపద’ని పదేళ్లకిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మెదడు పెద్దగా వుండి, తెలివున్న జంతువుల్లో ఏనుగు మూడోది. అది ఎన్నో అనుభ వాలను నిక్షిప్తం చేసుకోగలదంటారు. ఎంతదూరం వెళ్లినా తాను సంచరించే దారుల్ని పక్కాగా గుర్తుంచుకుని మళ్లీ అదే దారిలో వెనక్కివెళ్లగలగడం దాని ప్రత్యేకత.  అంతటి ప్రాముఖ్యత వున్న ఏనుగుల్ని ‘దేవుడి స్వస్థలం’గా పిలుచుకునే కేరళలో దుండగులు వెంటాడి హతమారుస్తున్నారని వస్తున్న వార్తలు దేశం మొత్తాన్ని కదిలించాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని పాలక్కడ్‌ జిల్లాలో తటస్థ ప్రాంతంగా ప్రకటించినచోట  ఒక ఆడ ఏనుగును పైనాపిల్‌ ఫలంలో బాంబు పెట్టి ప్రాణం తీసిన తీరు అందరినీ కలచివేసింది. ఈ ఏనుగు గర్భిణి కూడా కావడంతో వన్యప్రాణి సంరక్షణ రంగంలో పనిచేసేవారితోపాటు ఇతరులు కూడా స్పందించారు. ఇది ఈమధ్యకాలంలో జరిగిన మొదటి ఘటన కూడా కాదు. మొన్న ఏప్రిల్‌ నెలలో కొల్లాం జిల్లాలో మరో ఆడ ఏనుగును గుర్తుతెలియని వ్యక్తులు ఇలాగే మట్టుబెట్టారు. వన్యప్రాణులకు అక్కడ రక్షణ లేకుండా పోతున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో అనేకులు విరుచుకుపడ్డారు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటనా లేక ఉద్దేశపూర్వకంగా చేసిందా అనేది ఇంకా తేలాల్సివుంది. కేరళకు అనేకవిధాల ప్రాముఖ్యత వున్నది. అక్కడున్న దట్టమైన అడవులు, కొండలు, నదులు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. అది ఎప్పుడో అర్ధ శతాబ్దంకిందటే వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. అలాంటిచోట వన్య ప్రాణుల సంరక్షణ ఆందోళనకరంగా మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పార్కులు, అడవులు వున్నచోటకు సమీపంగా జనావాసా లున్నప్పుడు సహజంగానే మనిషికి, మృగానికీ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంటుంది. ఏనుగులు గుంపులుగా వచ్చి తమ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని, తమ ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని జనం ఆరోపిస్తుంటారు. అలాగే వేసవికాలం వచ్చేసరికి పులులు వేట కోసం, నీటి కోసం జనావాసాలవైపు వస్తుంటాయి.  కేరళలో వన్యప్రాణులపై దాడి ఘటనలు బాగా పెరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016 ఆగస్టు మొదలుకొని ఇంతవరకూ 23,182 ఉదంతాలు జరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పంటలు ధ్వంసం చేయడం, మనుషులను, పశువులను చంపడం వంటి కారణాలతో ఈ దాడులు జరిగాయి. ఇందులో 2015–2019 మధ్య 543మంది పౌరులు మరణించారు. 23 వన్యమృగాలు చనిపోయాయి. జనావాసాల్లోకొచ్చే వన్యప్రాణుల్ని గుర్తించి వాటిని మళ్లీ లోపలికి పంపడం కోసం అనేకచోట్ల జనజాగ్రత సమితులు ఏర్పాటు చేయడం, కొన్ని బృందాలను ఏర్పాటు చేయడంలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే ఇవి సరిపోవడం లేదని, వన్యప్రాణులపై దాడులు ఆగడం లేదని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి.

కేరళలో వన్యప్రాణులపై దాడులు జరగడానికి సంబంధించి భిన్న రకాల వాదనలున్నాయి. పంటపొలాలను నాశనం చేసే అడవి పందుల్ని నిలువరించడానికి రైతులు బాంబులు అమర్చిన పైనాపిల్‌ ఫలాలను పొలాల్లో అక్కడక్కడ వుంచుతారు. అడవి పందుల్ని చంపడానికి వాటిని వాడొచ్చని ప్రభుత్వం కూడా చెప్పింది.  1972నాటి వన్యప్రాణి పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 62 ప్రకారం ఉపద్రవంగా మారిన జంతువుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, వాటి జాబితాను పంపితే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతించొచ్చు. ఇప్పుడు ఏనుగు మరణానికి దారితీసిన పైనాపిల్‌ బాంబు కూడా అడవిపందుల్ని చంపడానికి ఉద్దేశించిందేనని కొందరు చెబుతున్న మాట. అనుకోకుండా దానివల్ల ఏనుగు బలైపోయివుండొచ్చని వారు వాదిస్తున్నారు. దీనికి భిన్నమైన వాదన మరొకటుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చుట్టూ కొంత ప్రాంతాన్ని తటస్థ ప్రాంతంగా గుర్తించి, అక్కడికి సాధారణ పౌరులెవరూ వెళ్లకూడదని ప్రభుత్వాలు ఆంక్షలు పెడతాయి.

కొందరు దళారులు తయారై ఈ తటస్థ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా భూముల్ని చవగ్గా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని, ఎవరూ సంచరించని ప్రాంతం గనుక అధికార యంత్రాంగం పర్యవేక్షణ కూడా తక్కువగా ఉండటంతో అక్కడ భూమి కొన్నవారు పంటలు పండించుకోవడం వంటివి చేస్తున్నారన్నది మరికొందరి ఆరోపణ. ఏనుగులు విస్తారమైన ప్రాంతంలో సంచరించడానికి చూస్తాయి గనుక, సహజంగానే అవి వన్యప్రాణి కేంద్రాన్ని దాటి అప్పుడప్పుడు తటస్థ ప్రాంతానికొస్తాయని, వాటినుంచి పంటను కాపాడుకోవడానికి ఇలా మారణకాండకు పాల్ప డుతున్నారని అంటున్నారు. లోతుగా విచారిస్తే ఇప్పుడు జరుగుతున్న ఉదంతాల వెనకున్న కారణాలు వెల్లడవుతాయి. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటానికి వృక్ష, జంతుజాలాలను పరిరక్షించడం చాలా అవసరం. లేకుంటే అవి క్రమేపీ అంతరించిపోతాయి. ఒకప్పుడు లక్ష దాటివున్న పులుల సంఖ్య ఒక దశలో 1,500కు పడిపోయింది. ప్రభుత్వాలు తీసుకున్న అనేక చర్యల ఫలితంగా వాటి సంతతి క్రమేపీ పెరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ లెక్క ప్రకారం దేశంలో ప్రస్తుతం 20,000 ఏనుగులు మాత్రమే మిగిలాయి. కారణం ఏదైనా వాటిని చంపుకుంటూ పోతే అవి కనుమరుగు కావడానికి ఎన్నో రోజులు పట్టదు. మగ ఏనుగుల్ని దంతాల కోసం, వాటి చర్మాల కోసం చంపడం రివాజుగా మారింది. ఇలా పంటల్ని రక్షించుకునే పేరిట ఉద్దేశపూర్వకంగా కానీ, అనుకోకుండా కానీ గజ సంహారం కొనసాగడం సరేసరి. కొన్నేళ్లక్రితంక్రితం ఏనుగుల పరిరక్షణకోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ విలువైన సూచనలు చేసింది. వాటి అమలు ఎలావుందో మరోసారి పరిశీలించి, మరింత మెరుగైన కార్యాచరణకు ఉపక్ర మించడం తక్షణావసరం.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా