కనీవినీ ఎరుగని నష్టం

13 Oct, 2014 23:48 IST|Sakshi

తుపాను వచ్చివెళ్లాక ఉత్తరాంధ్ర ప్రాంతం, మరీ ముఖ్యంగా విశాఖ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. హుదూద్ చేసిన విధ్వంసం విస్తృతి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఈ తుపానువల్ల కోలుకోలేని నష్టం సంభవించింది. విశాఖ పేరు చెబితే గుర్తొచ్చే బీచ్ రోడ్డు, నిత్యం ఎంతో సందడితో కళకళలాడే జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, సీతమ్మధార వంటివన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. వేలాదిమంది మత్స్యకార కుటుంబాలకు ఆలంబనగా ఉండే ఫిషింగ్ హార్బర్‌లో పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఎటు చూసినా ధ్వంసమైన ఇళ్లు, భవనాలు, కూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లు కనబడుతున్నాయి. ఆర్మీ, నేవీ, జాతీయ విపత్తు ఉపశమన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్)వంటివి రంగంలోకి దిగి చాలామంది ప్రాణాలను కాపాడ గలిగాయి. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

మృతుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండటం వెనక వీరి కృషి ఉంది. అయితే, నిన్నటి రోజంతా ప్రాణాలు అరచేతబట్టుకుని మంచినీరూ, ఆహారం లేక అలమటించిపోయిన ప్రజలకు సోమవారం రాత్రి వరకూ ఎలాంటి సాయమూ అందలేదని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనడానికి విస్తృత చర్యలు తీసుకున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పిన మాటలను వాస్తవం వెక్కిరిస్తున్నది. అలాంటి చర్యలే ఉన్నట్టయితే విశాఖలోని చాలా ప్రాంతాల్లో జనం ఆకలిదప్పులతో అలమటించాల్సిన దుస్థితి ఎదురయ్యేది కాదు. తుపాను వెలిశాక ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అంచనా లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి రుజువు. కొందరు వ్యాపారులు అరచేయి ప్రమాణంలేని దోసె రూ. 70, డజను అరటిపళ్లు రూ. 150, ప్యాకెట్ పాలు రూ. 100 వరకూ విక్రయించారంటే... రోజంతా పస్తుండి, ఏదో ఒకటి దొరక్కపోతుందా కడుపాకలి తీరకపోతుందా అని రోడ్లపైకి వచ్చిన సామాన్యులు నిస్సహాయంగా వెనుదిరగాల్సివచ్చిందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో అంచనావేసుకోవచ్చు. నిన్నంతా కృషిచేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచిగానీ, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంనుంచిగానీ తెల్లారేసరికల్లా నిత్యావసరాలను బాధిత ప్రాంతాలకు తరలించివుంటే ఈ పరిస్థితిని నివారించడం సాధ్యమయ్యేది. కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లను అందించినా ప్రజలు ఆనందించేవారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ప్రధాని మోదీతోనూ, కేంద్రంలోని ఇతర ముఖ్యులతోనూ మాట్లాడి అందరినీ కదిలించారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే అధికార యంత్రాంగం హుదూద్ తాకిడి సమయంలోనూ, అటు తర్వాతా చేష్టలుడిగి ఉండిపోయిందని అర్ధమవుతుంది.

 ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా పసిగట్టి, అది సృష్టించగల విధ్వంసాన్ని అంచనావేసి ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దాన్ని నివారించడం ఎవరికీ సాధ్యంకాదు. ఉన్నంతలో మనం చేయగలిగేదల్లా ప్రజలు ఆపదబారిన పడకుండా కాపాడటానికి ప్రయత్నించడమే. అది నిష్ర్కమించాక సహాయ చర్యలను సమర్ధవంతంగా చేపట్టడమే. సాంకేతిక విజ్ఞానం ఎంతగానో అభివృద్ధిచెందిన ప్రస్తుత సమయంలో దాన్ని సంపూర్ణంగా వినియోగించగలిగిన సామర్థ్యం ఉండాలి. సమాచారం అందిన వెంటనే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి ముందుకు దూసుకుపోగలిగిన సుశిక్షితులైన, మెరికల్లాంటి మనుషులుండాలి. వీరందరిమధ్యా సరైన సమన్వయాన్ని సాధించగలిగే వారుండాలి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అలాంటి సమన్వయ సాధనలో తలమునకలై ఉండాలి. కానీ, చంద్రబాబు విశాఖ నగరం వెళ్లి సమీక్షించాక ఈ విషయంలో ఎన్ని లోటుపాట్లున్నాయో బయటపడ్డాయి. విశాఖ నగరవాసులే సహాయ చర్యల విషయంలో ఫిర్యాదు చేస్తున్నారంటే ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఏపాటి సాయం అందిందో ఊహించడం కష్టమేమీ కాదు.
 హుదూద్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. దీనికితోడు విశాఖ హార్బర్‌లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దవడంతో రబీ అవసరాలను తీర్చడం అసాధ్యం కావొచ్చునని, పర్యవసానంగా తుపాను నష్టం పెద్దగా లేని ఇతర జిల్లాల్లో పంటలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తుపాను ప్రాంతాల పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వ్యవసాయరంగానికి వచ్చిపడిన ఈ ముప్పును ప్రత్యేకించి తెలియజెప్పి తగిన సహాయసహకారాలను పొందాలి. ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి మనకు లేకున్నా మనం తీసుకునే కొన్ని ముందు జాగ్రత్తలతో అవి మహోగ్రరూపం దాల్చకుండా చేయవచ్చు. అభివృద్ధి పేరిట సాగుతున్న కార్యకలాపాలు సముద్ర తీరాన్ని కాలుష్యమయం చేసి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలన్నీ సముద్రంలోనే కలుస్తున్నాయి. దాదాపు వేయి కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతం దెబ్బతినకుండా చూసేందుకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జడ్) నిబంధనలున్నా వాటి అమలును పట్టించుకుంటున్నవారు లేరు.

పర్యావరణ విధ్వంసం ఫలితంగానే తుపానులు, వాయుగుండాలు, భారీ వర్షాలు క్రమేపీ పెరుగుతున్నాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు సంభవించిన విపత్తునుండి కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కార్యకలాపాలను అదుపుచేయడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. తమ విధానాల్లోని లోపాలను సవరించుకోవాలి. జనావాసాలను ముంచి లక్షలాదిమంది ప్రాణాలకు ముప్పు తీసుకురావడంతోపాటు ఆహారపంటలను దెబ్బతీస్తున్న ఇలాంటి వైపరీత్యాలను అరికట్టడానికి ఇది తప్పనిసరి. హుదూద్ తుపాను సృష్టించిన విలయంలో అంతర్లీనంగా ఉన్న హెచ్చరిక ఇదే.
 
 

మరిన్ని వార్తలు