పాత్రికేయ ధీర

7 Sep, 2017 01:29 IST|Sakshi
పాత్రికేయ ధీర

మరో అక్షరం నేలకొరిగింది. ఎంతటివారినైనా నిలదీయడానికి వెనకాడని ఒక ధిక్కార స్వరం మూగబోయింది. మంగళవారం చీకట్లో మాటుగాసిన దుండగులు బెంగళూరు నగరంలో ప్రముఖ మహిళా జర్నలిస్టు ‘గౌరీ లంకేశ్‌’ పత్రిక సంపా దకురాలు అయిన గౌరీ లంకేశ్‌ను పొట్టనబెట్టుకున్న తీరు ఈ దేశంలో వర్తమాన స్థితిగతులకు అద్దం పడుతుంది. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆమె సాహసం ఎంతటిదో, ఆమె ఏ విలువల కోసం దృఢంగా నిలబడతారో, ఎవరి పక్షం వహిస్తారో చెప్పడానికి మరణానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేసిన అభిప్రాయాలు వెల్లడిస్తాయి.

సహచరులు, సన్నిహితులు ఈ విషయంలోనే ఆమెను తరచు హెచ్చరించేవారని, జాగ్రత్తలు పాటించమని సూచించేవారని కుటుంబ సభ్యులంటున్నారు. కానీ అధికార మదంతో చెలరేగే... మతోన్మాదంతో శివాలెత్తే... పౌరులకు పీడగా పరిణ మించే పిపీలకాలను నిలదీయడం, ధిక్కరించడం, హేళన చేయడం ఆమె నైజం. అది ఆమెకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక ఉన్నత సంప్రదాయం. చెప్పాలంటే అసలు కన్నడ నేలలోనే అందుకు బీజాలున్నాయి.

సామాజిక దురన్యాయాలపైనా, మూఢ విశ్వాసాలపైనా, తప్పుడు సంప్రదాయాలపైనా 12వ శతాబ్దిలోనే పోరాడిన బసవన్నకు జన్మనిచ్చిన గడ్డ అది. బసవన్న పరంపర అక్కడి సమాజంపైనా, సాహిత్యంపైనా, తాత్విక రంగంపైనా చూపిన, చూపు తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. పాత్రికేయ రంగం కూడా దీనికి అతీతం కాదు. గౌరీ లంకేశ్, ఆమె తండ్రి పాల్యాడ లంకేశ్‌ మూలాలు అక్కడే ఉన్నాయి. అందుకే ఆయన నిర్వహించిన ‘లంకేశ్‌’ పత్రికైనా, ఆమె ఆధ్వర్యంలో వెలువ డుతున్న ‘గౌరీ లంకేశ్‌’ పత్రిక అయినా ప్రభుత్వాల నుంచిగానీ, ప్రైవేటు సంస్థల నుంచిగానీ ఎలాంటి వాణిజ్య ప్రకటనలనూ స్వీకరించకూడదన్న నియమం పెట్టుకున్నాయి.

కేవలం పాఠకులు చెల్లించే చందాలతో, పత్రిక వెలువరించే వివిధ రకాల గ్రంథాల అమ్మకం ద్వారా లభించే ఆదాయంతోనే ఆ పత్రికలు నడిచాయి. గౌరి లంకేశ్‌ తన పత్రికను ప్రత్యేకించి దళితులకూ, రైతులకూ, ఇతర అణగారిన వర్గాలకూ వేదికగా మలిచారు. అధికారంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్‌ ఉన్నా ఆ ప్రభుత్వాల దుర్నీతిని ఎండగట్టారు. వారి అవినీతి, అక్రమాలను నిలదీశారు. ఈ క్రమంలో వస్తున్న బెదిరింపులనూ, హెచ్చరికలనూ, కించపరుస్తూ చేసే వ్యాఖ్యా నాలనూ ఆమె పట్టించుకోలేదు. ‘మనమే భయపడితే వీటన్నిటినీ బయటపెట్టేదె వర’ని గౌరి ప్రశ్నించేవారు. ఆ సాహసమే నానా రకాల అక్రమార్కులనూ, ఉన్మా దులనూ భయపెట్టింది.  

తమకు నచ్చని భావాలు వ్యక్తం చేస్తున్నారని అసహనంతో రగిలిపోయే శక్తులు ఇప్పుడు దేశమంతటా అలుముకుని ఉన్నాయి. ఈ శక్తులే గతంలో మహారాష్ట్రలో గోవింద్‌ పన్సారే, డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌లను పొట్టనబెట్టుకు న్నాయి. ఇలాంటి శక్తులే రెండేళ్లక్రితం కర్ణాటకలో ప్రముఖ సాహితీవేత్త, హేతువాది డాక్టర్‌ కల్బుర్గిని కాల్చిచంపాయి. ప్రభుత్వాలు చేవచచ్చి శవాకారా లుగా మారినప్పుడు, సమాజం ఒక్కటిగా నిలబడి పోరాడలేనప్పుడు ఉన్మాదం రెచ్చిపోతుంది. నిలదీసే గొంతులను వెంటాడుతుంది. గోవింద్‌ పన్సారే, దభోల్కర్‌ల హత్యలపై విచారణ వేగవంతం చేయాలంటూ గౌరి హత్యకు వారం రోజుల ముందు బొంబాయి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌సీ ధర్మాధికారి విలువైన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ హత్యలు చెదురు మదురుగా జరిగినవి కాదు. సంస్థాగతమైన మద్దతు లేనిదే, ఎప్పటికప్పుడు డబ్బు చేతికందనిదే హంతకులు ఇలాంటి దుండగాలకు పాల్పడటం, దీర్ఘకాలం తప్పించుకు తిరగడం సాధ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు.

ఇది కర్ణాటకలో లోగడ జరిగిన కల్బుర్గి హత్యకైనా, ఇప్పుడు గౌరి హత్యకైనా వర్తిస్తుంది. గౌరి హత్య జరిగినరోజు దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ, సంఘ్‌ పరివార్‌ సంస్థలు కర్ణాటక అంతటా నిరసన ప్రదర్శనలకు దిగాయి. వాటిని అడ్డుకోవడానికి రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పోలీసు బలగాలున్నాయి. అంతటి బందోబస్తు ఉన్నరోజున కూడా బెంగళూరు మహా నగరంలో ఒక బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చి, కాపుగాసి ఆమెను కాల్చిచంపగలిగారంటే ప్రభుత్వాలు ఎంత పనికిమాలిన తీరులో పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. గౌరి హత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆమె సోదరుడు కోరుతున్నారు. డాక్టర్‌ కల్బుర్గి హత్య కేసు దర్యాప్తులో సీఐడీ విఫలమైంది గనుక ఆయన ఆ డిమాండు చేసి ఉండొచ్చు. కానీ మహారాష్ట్రలో దభోల్కర్, గోవింద్‌ పన్సారే హత్య కేసుల్లో ఇంతవరకూ సీబీఐ సాధించింది శూన్యం.

అనుమానితులంటూ ఒకరిద్దర్ని అరెస్టు చేసినా దర్యాప్తు తీరు ఏమాత్రం సరిగా లేదని హైకోర్టు అక్షింతలు వేసింది. పాలకులు చేతగానివారైనా, ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్టు ఉండిపోయినా చివరకు జరిగేది ఇదే. ఆ పరిస్థితుల్లో సీఐడీ, సీబీఐలాంటి సంస్థలు చేయగలిగేది ఉండదు. ఈ ఏడాది ఇంతవరకూ దేశవ్యాప్తంగా ఎనిమిదిమంది పాత్రికేయులను దుండగులు పొట్టబెట్టుకున్నారు. అనేకమందిపై దౌర్జన్యాలు సాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లాంటి రాష్ట్రాల్లో నేరుగా పోలీసు ఉన్నతాధికారులే బెదిరింపులకు దిగు తున్నారు. సమాజం కోసం, సమాజం తరఫున నిస్వార్ధంగా నిలదీసే గొంతుల్ని నులిమేయాలని చూసే శక్తులది ఇప్పుడు పైచేయి అవుతున్నది. దీన్ని ఎక్కడికక్కడ ప్రతిఘటించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అన్యాయా లను, అక్రమాలను నిలదీయడానికి పత్రికలు వినియోగించుకుంటున్న భావప్రక టనాస్వేచ్ఛ వాటి సొంతం కాదు. అది సారాంశంలో ప్రశ్నించడానికి ప్రజలకుండే హక్కు. ఆ హక్కుపై ఉక్కుపాదం మోపడమే పాత్రికేయ ధీర గౌరిని కాల్చిచంప డంలోని ఆంతర్యం. అందుకే ఈ దుండగాన్ని అందరూ ఖండించాలి. హక్కుల పరిరక్షణకు ఒక్కటై నిలవాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాల మెడలు వంచడం సాధ్యపడుతుంది.

 

>
మరిన్ని వార్తలు