రాజకీయ ప్రక్షాళనకు మార్గం!

12 Jul, 2013 02:47 IST|Sakshi
రాజకీయ ప్రక్షాళనకు మార్గం!
రాజకీయాలు నేరమయం కాకుండా, చట్టసభలు నేరస్తుల అడ్డాగా మారకుండా చర్యలు తీసుకోవాలని దశాబ్దాలుగా ప్రజాస్వామికవాదులు పోరాడుతున్నారు. ఓటర్లను ఆకర్షించడానికీ, చట్టసభల్లో ఆధిక్యత సాధించడానికీ అన్ని పార్టీలూ శక్తివంచన లేకుండా కృషిచేస్తాయి. అందులో తప్పేమీ లేదు. దేశంలో దారిద్య్ర నిర్మూలనకుగానీ, ఇతర సమస్యలపైగానీ తమ దృక్ఫథమేమిటో...సుపరిపాలన అందించేందుకు తమకున్న ఆలోచనలేమిటో ఓటర్ల ముందుంచి వారి మెప్పు పొందితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఎన్నికలు రాను రాను పెడదోవపడుతున్నాయి. 
 
 ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు రాజకీయ పక్షాలు ధనబలాన్ని, కండబలాన్ని నమ్ముకోవడం పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేరగాళ్లు చట్టసభల్లో ప్రవేశించకుండా కట్టడిచేయడానికి వీలుకల్పిస్తుంది. అదే సమయంలో ఆ తీర్పు ఎన్నెన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన ప్రజాప్రతినిధులు అప్పీల్‌కు వెళ్లి తీర్పు అమలుకాకుండా స్టే తెచ్చుకున్నపక్షంలో... వారికి అనర్హత వర్తించదని చెబుతున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయ స్థానాలు శిక్ష విధించిన రోజునుంచే వారి సభ్యత్వం రద్దవుతుందని స్పష్టంచేసింది. అయితే, కింది కోర్టు తీర్పు లోపభూయిష్టంగా ఉందని అప్పిలేట్ కోర్టు భావిస్తే తుది తీర్పు వెలువరించేంత వరకూ ఆ ప్రజాప్రతినిధి సభ్యత్వాన్ని కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.  క్రిమినల్ కేసుల్లో రెండేళ్లు తక్కువకాకుండా శిక్షపడిన వ్యక్తి పోటీకి అనర్హుడని, ఆ అనర్హత విడుదలైననాటినుంచి ఆరేళ్లవరకూ కొనసాగుతుందని సెక్షన్ 8(3) నిర్దేశిస్తోంది. 
 
 సాధారణ వ్యక్తికి ఇలాంటి నిబంధన ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధికి మాత్రం వెసులుబాటు ఇవ్వడమేమిటన్నది సుప్రీంకోర్టు ప్రశ్న. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రానికి విఘాతం కలిగిస్తున్న సెక్షన్ 8(4) రాజ్యాంగవిరుద్ధమని స్పష్టంచేసింది. నిజమే... ఉద్యోగులపై క్రిమినల్ కేసులుండి, అందులో శిక్షపడినప్పుడు వెనువెంటనే వారికి ఉద్యోగంనుంచి ఉద్వాసన పలుకుతారు. అదే సూత్రం ప్రజా ప్రతినిధులకు ఎందుకు వర్తించరాదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఉద్యోగి అప్పీల్‌కు వెళ్లి నిర్దోషిగా రుజువైనప్పుడు తిరిగి ఉద్యోగం పొందగలుగుతాడు. కానీ, ప్రజాప్రతినిధి అలా కాదు. కింది కోర్టులో శిక్షపడి, పై కోర్టులో ఆ కేసు కొట్టేస్తే అతని రాజకీయ భవితవ్యం ఏమవుతుందనే సందేహం తలెత్తుతుంది. ఒక ఉద్యోగికి తిరిగి ఉద్యోగం వచ్చినంత సులభంగా ఆ ప్రజా ప్రతినిధి మళ్లీ ఎన్నిక కాలేడన్నది సత్యం.
 
  మన రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుడొకరికి కింది కోర్టు ఒక హత్య కేసులో యావజ్జీవశిక్ష విధించగా ఆ తర్వాత ఆయన హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లినప్పుడు నిర్దోషిగా విడుదలయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమైతే, కింది కోర్టు శిక్ష విధించిన వెంటనే ప్రజా ప్రతినిధిగా ఆయన అనర్హత పొందడం, ఆ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగడం అయిపోతుంది. అప్పీల్‌లో నిర్దోషిగా తేలినా ఆయన రాజకీయ భవితవ్యం అగమ్యగోచరమవుతుంది. అలాగే, కింది కోర్టులో ఒక ప్రజా ప్రతినిధి నిర్దోషి అని తేలిన సందర్భంలో ప్రభుత్వం అప్పీల్‌కి వెళ్లే అవకాశం ఎటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అతని పదవి ఉండాలా? పోవాలా? అప్పీల్ చేసుకోవడానికి చట్టపరంగా అన్ని అవకాశాలూ ఉన్నంతకాలమూ కింది కోర్టు తీర్పునే తుది తీర్పుగా భావించలేము. కానీ, సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యక్తంచేసిన అభిప్రాయం దానికే దారితీస్తోంది.
 లోక్‌సభలోనూ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధులు తక్కువేమీ కాదు. 
 
 దాదాపు 31శాతంమందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  ఈ క్రిమినల్ కేసుల్లో అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీవంటివి ఉన్నాయి. పప్పూ యాదవ్, షహబుద్దీన్ వంటి వారికి హత్య కేసుల్లో యావజ్జీవ శిక్షలుపడ్డాయి. వారు ఆ శిక్షలపై అప్పీల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుని ఇప్పటికీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. సెక్షన్ 8(4) ఇలాంటివారికి ఉపకరణంగా వినియోగపడుతోందని, నేరమయ రాజకీయాల విస్తరణకు తోడ్పడుతున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు అయిదేళ్లు శిక్షపడగల కేసుల్లో ఇరుక్కున్నవారిని ఎన్నికల్లో పోటీచేయనీయరాదని అడుగుతున్నవారూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలూ తమ తమ పరిధుల్లో సక్రమంగా పనిచేస్తున్న ఆదర్శనీయమైన పరిస్థితులున్నచోట ఇవన్నీ అమలు చేస్తామంటే స్వాగతించనివారంటూ ఉండరు. కానీ, చిక్కు ఎక్కడ వస్తుంద ంటే...తమకు నచ్చని రాజకీయాభిప్రాయాలు ఉన్నవారిపైనా, తమకు అనుకూలంగా మెలగని వారిపైనా అక్రమంగా కేసులు పెట్టి వేధించే సంస్కృతి దేశంలో పెరుగుతోంది. రాజకీయాలు నేరమయమై, నేరమే అధికారమై ఉరేగుతున్నచోట ఇలాంటి సంస్కృతి పుట్టి విస్తరించడం సహజమే. 
 
 ఈ పరిస్థితులున్నప్పుడు నిజంగా నేరం చేసినవారెవరో, అందులో అన్యాయంగా ఇరుక్కున్నవారెవరో తెలియని అయోమయం నెలకొంటుంది. అందువల్లే ప్రజా ప్రతినిధులపై కేవలం క్రిమినల్ కేసులుండటాన్నే గీటురాయిగా తీసుకోవడం సరికాదు. తమపై ఉన్న కేసులు తేలకుండా ఏదో ఒక నెపంతో విచారణను సాగదీసే నిందితులున్నట్టే... నేరారోపణ ఎదుర్కొంటున్నవారిపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముగించకుండా చూసేందుకు, వాయిదాలు కోరేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించే ప్రభుత్వాలున్నాయి. ఇలాంటివారి ఆటలు సాగకుండా నిర్ణీత కాలవ్యవధిలో దర్యాప్తు పూర్తిచేసేలా దర్యాప్తు సంస్థలకు నిర్దేశిస్తే... విచారణ త్వరితగతిన పూర్తిచేసేలా న్యాయస్థానాలు వ్యవహరిస్తే నిర్దోషులకు న్యాయం జరుగుతుంది. అదే సమయంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన సాధ్యపడుతుంది.
>
మరిన్ని వార్తలు