ట్రావెల్‌ బస్సులో తరలిస్తున్న నగదు స్వాధీనం

25 Dec, 2023 09:27 IST|Sakshi
పట్టుబడ్డ నగదు వివరాలు వెల్లడిస్తున్నడీఈఎస్పీ, సీఐలు

గూడూరు రూరల్‌: హైదరాబాద్‌ నుంచి చైన్నెకి వెళుతున్న ఓ ట్రావెల్‌ బస్సులో ఎలాంటి రశీదులు లేకుండా తరలిస్తున్న నగదును గూడూరు రూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి గూడూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌ నుంచి చైన్నెకి శనివారం రాత్రి బయలు దేరిన ట్రావెల్‌ బస్సు గూడూరు రూరల్‌ పరిధిలోని పోటుపాళెం సర్కిల్‌ వద్దకు ఆదివారం వేకువజామున చేరింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి దగ్గర ఉన్న కొంత బంగారు కనిపించక పోవడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో గూడూరు రూరల్‌ సీఐ దశరథరామారావు సిబ్బందితో కలిసి బస్సులో తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో బస్సులో ఇద్దరు ప్రయాణికులైన సత్తెనపల్లికి చెందిన శ్రీనివాసులు, మల్లేశ్వరావు అనే వారు చైన్నెకి వెళ్ళేందుకు పిడుగురాళ్ళ వద్ద బస్సు ఎక్కారు. వీరి వద్ద ఎలాటి పత్రాలు, రశీదులు లేని సుమారు రూ.55,87,080 నగదును ఎనిమిది ప్యాకెట్లలో భద్రపరిచి తాము నిద్రించే సీట్ల కింద ఉంచుకుని ప్రయాణిస్తున్నారు.

తనిఖీ చేస్తున్న సీఐ పరిశీలించగా వారి వద్ద ఉన్న నగదుకు సంబంధించిన వివరాలు లేవు. దీంతో నగదును సీజ్‌ చేసినట్లు తెలిపారు. నగదు విషయంమై ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంటుకు కూడా సమాచారం ఇస్తున్నామన్నారు. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. నగదుతో ప్రయాణిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, ఐడీ పార్టి హెడ్‌ కానిస్టేబుల్‌ ఐవీరాజు, కానిస్టేబుల్‌, విష్ణుకుమార్‌, శ్రీనివాసులు, సురేష్‌, మిటాత్మకూరు వీఆర్‌ఓ కే పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు