కాంగ్రెస్‌పై విభజన ఎఫెక్ట్

18 May, 2014 04:20 IST|Sakshi
కాంగ్రెస్‌పై విభజన ఎఫెక్ట్
  •    అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో  ఓటు బ్యాంకు గల్లంతు
  •      అత్యధిక స్థానాల్లో రెండువేల ఓట్ల లోపే
  •      కేవలం 1.67 శాతం ఓట్లతోనే కాంగ్రెస్ సరి
  •      జేఎస్పీకి  3.28 శాతం ఓట్లు
  •      నోటాకు కూడా 10 వేల ఓట్లు
  •      మాజీ ఎంపీ చింతాకు షాక్
  •  సాక్షి, చిత్తూరు: జిల్లాలో విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిస్థాయిలో మట్టికరిపించారు. సీమాంధ్రను విడదీసి అన్యాయం చేశారనే కోపాన్ని ఓటనే అస్త్రంతో కాంగ్రెస్‌కు రుచిచూపించారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎక్కడా కనీసం రెండవ స్థానం కూడా దక్కలేదు.

    ఎన్నికల ముందే కాంగ్రెస్ మునిగిపోయే నావ అని తెలుసుకుని మంత్రులుగా పనిచేసినవారు, ఎమ్మేల్యేలు దాటుకోవడంతో కాంగ్రెస్‌పార్టీకి దిక్కులేకుండా పోయింది. దొరికినవారిని అభ్యర్థులుగా పెట్టిన కాంగ్రెస్ పూర్తిగా చేతులు కాల్చుకుంది. జిల్లా అధ్యక్షుడిగా మండల నాయకుడిగా ఉన్న వేణుగోపాల్‌రెడ్డిని తెచ్చి పెట్టారు. ఆయన చంద్రగిరి అభ్యర్థిగా బరిలో ఉండడం, జిల్లా అంతా కాంగ్రెస్‌ను పట్టిష్టం చేసి నడిపించే శక్తి లేకపోవడంతో ఈ ప్రయోగం రవ్వంత కూడా ఫలించలేదు.

    ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినవారు ఒకసారి తాము కూడా జాతీయ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేశాం అని అనిపించుకునేందుకు ఎన్నికల్లో నిలబడ్డారు. జిల్లాలో 24 లక్షల 10వేల 228 ఓట్లు పోలయ్యాయి.

    ఇందులో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 40228. ఇవి కేవలం 1.67 శాతం మాత్రమే. పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కన్నా జైసమైక్యాంధ్ర పోటీ గట్టిపోటీ ఇచ్చి రెండవ స్థానం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ తరపున మదనపల్లి నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా 7357 ఓట్లతో నాల్గో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 1000-2000 మధ్య ఓట్లే వచ్చాయి. ఇంత దారుణమైన పరిస్థితి చిత్తూరు జిల్లాలో 1952 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌కు ఎప్పుడు ఎదురుకాలేదు. రాష్ట్ర విభజనతో పూర్తిగా ప్రజలు కాంగ్రెస్‌ను మట్టి కరిపించారు.
     
    చింతాకు డిపాజిట్ గల్లంతు
     
    రాజకీయ చాణుక్యుడిగా తెరవెనుక వ్యూహాలతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తారని పేరున్న తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌కు ఓటర్లు మంగళం పాడారు. ఆయనకు డిపాజిట్ కూడా దక్కనంత ఘోరంగా ఓడించారు. కాంగ్రెస్ నుంచి 25 ఏళ్లుగా రాజకీయల్లో చక్రం తిప్పుతూ ఐదుసార్లు ఎంపీగా పని చేసిన చింతామోహన్ ఈసారి కాంగ్రెస్ విభజన వ్యవహారంతో బోర్లాపడ్డారు. ఆయన డ్వాక్రా మహిళలకు ఇల్లు ఇస్తానన్నా, రుణాలు ఇప్పిస్తానన్నా, లక్షాధికారులను చేస్తానన్నా, తిరుపతిని రాజధాని చేస్తామని చెప్పినా జనం నమ్మలేదు.

    ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎరుగునంతటి ఘోర ఓటమిని రుచిచూపించారు. తిరుపతి పార్లమెంట్‌కు పోటీ పడిన వారిలో వరప్రసాద్‌కు 5.8 లక్షల ఓట్లు రాగా,బీజేపీ అభ్యర్థి జయరామ్‌కు 5.4 లక్షల ఓట్లు వచ్చా యి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌కు కేవలం 33333 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ గుర్తు చూసి జనం ఓట్లేస్తారు.. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ బీజేపీ కూటమి ఓట్లు ఎంపీకి తనకు పడతాయనుకున్న చింతా ఆశలు అడియాశలయ్యాయి.

    వైఎస్సార్‌సీపీకి టీడీపీకి స్వల్ప తేడా
     
    జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్సార్‌సీపీ తెలుగుదేశం మధ్య స్వల్ప తేడా నెలకొంది. తెలుగుదేశం పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు 11 లక్షలా 7వేలా 145. ఇది 45.94శాతం. వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లు 10 లక్షలా 86వేలా 79, శాతంలో చూస్తే ఇది 45.10. ఇదే పరిస్థితి చిత్తూరు, తిరుపతి లోక్‌సభల ఓట్లలోనూ నెలకొంది.
     
    జేఎస్పీకి అదే పరిస్థితి

    తాజ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీ పరిస్థితి కూడా ఇదే. జిల్లాలో పీలేరు మినహా ఇంకెక్కడా ఆ పార్టీ రెండవ స్థానంలోకి కూడా రాలేదు. అంతా 1500-2000 మధ్యలో ఓట్లతోనే  ఆ పార్టీ అభ్యర్థులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్డుషోలు నిర్వహించినా, సమైక్యాంధ్ర నినాదంతో ప్రచారం చేసినా జనం చివరి వరకు విభజనకు సహకరించిన వ్యక్తిగానే కిరణ్‌కుమార్‌రెడ్డిని చూశారు.  

    కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు కేవలం 500 లోపు ఓట్లు వచ్చాయి. చంద్రగిరిలో జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి మమతకు కేవలం 553 ఓట్లు వచ్చాయి. తంబళ్లపల్లెలో 455 ఓట్లే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా పార్టీకి వచ్చిన ఓట్లు 79026 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో  3.25 శాతం. పీలేరులో కిరణ్ సోదరుడు కిశోర్‌కుమార్ రెడ్డికి మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి.
     
    నోటాకు 10వేల ఓట్లు
     
    జిల్లాలో 24 లక్షల ఓట్లు  పోల్ కాగా, ఇందులో అభ్యర్థులు ఎవరు ఇష్టం లేదని, తిరస్కరించిన ఓట్లు 14 నియోజకవర్గాల్లో 10వేలకు పైగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో నోటా బటన్ ఉపయోగించి ఓటు చేసిన వారు ఉండడం గమనార్హం. ఇది మొత్తం ఓట్లలో 0.43శాతంగా ఉంది.
     

>
మరిన్ని వార్తలు