బాబు కాలం ఆ రోజులొద్దు

3 May, 2014 02:17 IST|Sakshi

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు నరకం చూపించిన చంద్రబాబును తలుచుకుంటేనే గుండె వేగం పెరుగుతోందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటి రోజుల్లో పంటలు పండక.. తినడానికి తిండిలేక వలసలు పోతుంటే ఆపలేకపోయిన చేతకాని నేత చంద్రబాబును ముమ్మాటికీ మళ్లీ అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ రోజు ఆయనకు తప్పు అనిపించినవి.. నేడు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనాన్ని చూసి మాట మార్చడం తగదని, ఇలాంటి ఊసరవెల్లి డ్రామాలు ఇక సాగవంటున్నారు. నాటి రోజులు తలుచుకుంటే భయమేస్తోందంటున్న రైతుల అభిప్రాయాలివి..  
 
 వడ్డీకి అప్పు తెచ్చి బిల్లు చెల్లించాం
 చంద్రబాబు పాలనలో విపరీతమైన విద్యుత్ కోతల కారణంగా పంటలు సరిగ్గా పండ క కరెంటు బిల్లు చెల్లించే స్తోమత కూడా ఉండేది కాదు. దీంతో రూ.15 వేల వరకు బకాయి పేరుకుపోయింది. పంట రాగానే చెల్లిస్తామని చెప్పినా నెలకోసారి విద్యుత్ అధికారులు వచ్చి స్టార్టర్ తీసుకెళ్లి అవమానానికి గురిచేశారు. రూ. 5 వడ్డీకి అప్పులు తెచ్చి కొంత మొత్తం చెల్లించి స్టార్టర్ తెచ్చుకునే వాళ్లం. ఇంటి వద్ద బల్బు వేసుకుని ఉంటే విద్యుత్ చౌర్యం కేసు బనాయించి అపరాధ రుసుం వసూళ్లు చేయించిన ఘనుడు చంద్రబాబు. మళ్లీ అలాంటి రోజులు వద్దని దేవుడిని ప్రార్థిస్తున్నాం.
 - ఇంద్రసేనారెడ్డి, రైతు, ఆర్ కొత్తపల్లి, గుమ్మఘట్ట మండలం
 
 ఉచిత విద్యుత్
 అప్పుడెందుకు గుర్తుకు రాలేదు?
 చంద్రబాబునాయుడు పాలనలో విద్యుత్ సమస్యతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల ఇబ్బందులను గమనించిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంతో పోరాడాడు. ఆయన ఉచిత విద్యుత్తు ఇస్తానని ప్రకటిస్తుంటే, బాబు మాత్రం విద్యుత్ చార్జీలు పెంచుతూ రైతుల నడ్డి విరిచారు. అధికారం కోల్పోయిన తరువాత తాను కూడా ఉచితంగా విద్యుత్తు ఇస్తానంటూ హామీ ఇస్తున్నారు. అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగిస్తారా? మీ హామీలు నమ్మేదెవరు? రైతులు పాత సంఘటనలు ఎలా మరిచిపోతారు. బాబుకు బుద్ధి చెప్పాల్సిందే.
 - సంజీవరెడ్డి, రైతు, తంబాపురం, బత్తలపల్లి మండలం
 
 తలుచుకుంటే గుండె ఆగుతుంది
 చంద్రబాబు పాలన తలచుకుంటే గుండె ఆగిపోతుంది. కరెంటు బిల్లు కట్టలేదని 2003 డిసెంబర్ 23న నా వ్యవసాయ మోటరు సర్వీస్ నంబర్ 70ను అధికారులు తొలగించి స్టార్టరు తీసుకెళ్లారు. దీంతో 4 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దాంతో మరింతగా అప్పులు అధికమై ఇబ్బందులు పడ్డాం. అప్పు చేసి పంటను సాగుచేస్తే చంద్రబాబు నాయుడు పుణ్యం వల్ల చేతికందకుండా పోయి కన్నీరు మిగిలింది. ఇక ఆత్మహత్యలే శరణ్యమనుకున్న సమయంలో తోటి మిత్రులు ఆదుకోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నా. మహా నేత రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు రూ.82 వేలు, బ్యాంక్ రుణాలు రూ,70వేలు మాఫీ కావడంతో గట్టెక్కాను.                     
 -రుద్రన్న, రైతు, బచ్చేహళ్లి, కళ్యాణదుర్గం మండలం
 
 ఆయన  పెట్టిన బాధలతోనే తనువు చాలించాడు..  
 కరెంటు బిల్లు రూ. 3వేలు చెల్లించలేదని 2003-04లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నరకయాతన నుంచి కోలుకోలేక మా చిన్నాన్న తిప్పారెడ్డి ఎట్టకేలకు మానసిక వేదనతో మరణించాడు. విద్యుత్ బకాయి చెల్లించలేదని విద్యుత్ మోటారును తీసుకువెళ్లారు. అంతటితో ఆగక కేసు నమోదు చేసారు. వారానికి రెండు రోజులు వారెంట్‌తో పోలీసులు జీపుతో ఇంటి వద్దకు వచ్చేవారు. పోలీసుల రాకను పసిగట్టి మా చిన్నాన్న ఇంటి నుంచి పరార్ కావాల్సిన పరిస్థితి అప్పట్లో ఎదుర్కొన్నాం. ఒక వైపు కరువు మరోవైపు పంటలు పండక  తీవ్ర దుర్భిక్షం. ఈ పరిస్థితిలో కరెంటె బిల్లు వసూలు కోసం చంద్రబాబు  చేసిన నానా యాగీతో ఆఖరుతో మానసిక వేదనతో మంచాన పడి మరణించాడు. ఆరోజులు ఇప్పటి కీ మరువలేము. ఆ రోజులు మళ్లీ రాకూడదు.
 - సోమశేఖరరెడ్డి, గోనిపేట, పెనుకొండ మండలం
 
 లాఠీలతో కొట్టించాడు
 చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంట్ బిల్లు చెల్లించకపోతే స్టార్టర్లను తీసుకెళ్ళి రైతులను పోలీసుల చేత లాఠీలతో కొట్టించాడు. ఒకపక్క సకాలంలో వర్షాలు కురవలేదు. మరోపక్క బోరుబావిలో అరకొర నీటితో పంటలు సాగుచేశాం. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుతాండవించడంతో పాటు రైతులకు కష్టాలు తప్పవు.                        
 - సిద్దప్ప, రైతు, రొళ్ల  
 
 అన్నీ కన్నీటి కష్టాలే
 చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితి. నాకున్న ఐదు ఎకరాల భూమిలో పంట పండక అప్పులపాలయ్యాను. కరెంట్ బిల్లు  కట్టలేదని పొలంలోవున్న రెండు వ్యవసాయమోటర్లు అధికారులు తీసుకెళ్లారు. ఎంతబతిమాలినా అధికారులు వినలేదు. ఆ రోజులు ఇప్పటికీ మరచిపోలేదు. ఆయన పాలనలో అన్నీ క న్నీటి కష్టాలే. కరెంటు చార్జీలు పెంచి మోయలేని భారం మోపాడు.
 - పిల్లల రామాంజనేయులు, రైతు, కల్లూరు, గార్లదిన్నె మండలం
 
 చాలా ఇబ్బంది పెట్టారు
 చంద్రబాబునాయుడి హయాంలో కరెంటోళ్లు రైతులను చాలా ఇబ్బందులు పెట్టారు. కరెంట్ బిల్లు చెల్లించలేదంటూ నా పొలంలో విద్యుత్ స్టార్టర్ ఎత్తుకెళ్లారు. పోలీస్ కేసు కూడా పెట్టారు. నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఎంతో వ్యయప్రయాసలకు గురయ్యాను. ఆ రోజులు తలచుకుంటేనే భయమేస్తోంది. అందుకే చంద్రబాబు తిరిగి సీఎం కావాలని ఏరైతూ కోరుకోవడం లేదు.
 -రవినాయక్, గుడ్డంపల్లి తండా, ముదిగుబ్బ
 
 తలుచుకుంటే బాధేస్తోంది
 తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో విపరీతంగా కరెంటు చార్జీలు పెరిగిపోయాయి. నెల వారీ బిల్లులు చెల్లించేందుకు అనేక ఇబ్బందులు పడేవాళ్లం. బిల్లు చెల్లించడం ఆలస్యమైతే చాలు కరెంటోళ్లు బావుల వద్దకు వచ్చి వైర్లు, స్టార్టర్లు తీసుకుపోవడం తలచుకుంటే నేటికి బాధేస్తోంది. పంట ఉందయ్యా.. ఓ వారంలో చెల్లిస్తామని వేడుకున్నా పట్టించుకునేవారు కాదు. అడ్డు తగిలితే పోలీసు కేసులు పెడతామని బెదిరించేవాళ్లు. 3,500 చెల్లించాల్సి ఉంటే రెండు సార్లు స్టార్టర్ తీసుకెళ్లారు. వడ్డీకి అప్పు తెచ్చి బిల్లు చెల్లించాను. మళ్లీ అలాంటి చీకటి పాలన వద్దేవద్దు.
 - ఈశ్వరరెడ్డి, రైతు, ఆర్ కొత్తపల్లి, గుమ్మఘట్ట మండలం.
 
 బిల్లు కట్టలేదని పంట ఎండబెట్టారు
 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సక్రమంగా వర్షాలు లేవు. బోరుబావుల కింద పంటలు పండలేదు. ఉన్న బోర్లలో అరకొరగా వస్తున్న నీటితో పంటలు పండక కష్టాల్లో ఉన్న మాకు కరెంట్ బిల్లు కట్టాలని ఒత్తిడి తెచ్చారు. బిల్లులు కట్టలేక పోవడంతో తన స్టార్టర్ తీసుకు వెళ్లారు. దీంతో పంట కూడా ఎండి పొయింది.
 - నరసింహులు, రైతు కంచిసముద్రం, రొద్దం మండలం
 
 రైతులను ముప్పుతిప్పలు పెట్టాడు
 రైతు వ్యతిరేక విధానాలతో ముప్పుతిప్పలు పెట్టిన ఘనత చంద్రబాబుదే. ఇల్లాలి ఒంటిమీద బంగారు నగలు తాకట్టుపెట్టి మూడు ఎకరాలలో వరి పంట సాగు చేశాను. విద్యుత్ బిల్లు రూ.6 వేలు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేక బిల్లు చెల్లించలేక పోయాను. దీంతో అధికారులు కేసులు నమోదు చేసి స్టార్టర్ పెట్టె, కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు. పంట పండేదాకా ఆగండని బతిమాలినా కనికరించలేదు.              
 - వడ్డి రామలింగారెడ్డి, రైతు, కునుకుంట్ల, తాడిమర్రి
 

>
మరిన్ని వార్తలు