ఇక్కడ తకరారు

2 Apr, 2014 02:07 IST|Sakshi
ఇక్కడ తకరారు

సాక్షి, హైదరాబాద్: టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పొత్తు లేకపోతే నష్టపోతావున్న భావనతో బీజేపీ అడిగినన్ని సీట్లను ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధపడినప్పటికీ ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఎలాగైనా సరే కమలనాథులతో జట్టు కట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో మంతనాలు జరుపుతున్నా ఇరు పార్టీల మధ్య బంధం పటిష్టం కావడంలేదు. ఇప్పటికీ బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రకరకాల సందేహాలను, పొత్తుంటే ఎదురయ్యే చిక్కులను కేంద్ర నాయుకత్వం ఎదుట ఏకరువు పెడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఈ పొత్తును బలంగా వ్యతిరేకిస్తుండటంతో పార్టీ హైకవూండ్ సైతం పునరాలోచన చేయక తప్పడం లేదు.

 

తెలంగాణలో 8 పార్లమెంటు, 45 అసెంబ్లీ సీట్లకు బీజేపీ నాయకత్వం సరేనన్నా.. స్థానాల ఖరారుపైనే ప్రతిష్టంభన ఏర్పడుతోంది. ఇటు టీఆర్‌ఎస్ కూడా బీజేపీతో పొత్తు పట్ల ఆసక్తి చూపిస్తుండటంతో కొత్త సమీకరణాలు, లాభనష్టాలను ఆ పార్టీ బేరీజు వేసుకుంటోంది. మరోవైపు పొత్తులు ఖరారు చేసుకోడానికి ఢిల్లీ వచ్చిన సీమాంధ్ర బీజేపీ నేతలు ఉత్తచేతుల్తోనే హైదరాబాద్ తిరిగొచ్చారు. సీమాంధ్రలో ఒంటరి పోటీకే ఆ ప్రాంత నేతలు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా బీజేపీతో ఇరు ప్రాంతాల్లోనూ పొత్తులు ఖరారు చేసుకోవాలని పార్టీ దూతలకు చంద్రబాబు హుకుం జారీ చేశారు. అవసరమైతే బీజేపీకి కొన్ని సీట్లు అదనంగా ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. అలాగే బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఆయన ఫోన్‌లో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ-బీజేపీల మధ్య ఢిల్లీలో రాత్రి పొద్దుపోయే వరకూ పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
 
 ఢిల్లీలో ఏం జరిగిందంటే..
 
 తెలంగాణలో సీట్ల కేటాయింపు, స్థానాల సర్దుబాటుపై చర్చల కొనసాగింపులో భాగంగా మంగళవారం శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ నివాసంలో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో ఇరు పార్టీల నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు సుజనా చౌదరి, ఎర్రబెల్లి దయాకర్, యనమల రామకృష్ణుడు, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నల్గొండ, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ లోక్‌సభ స్థానాలతో పాటు బీజేపీ కోరిన ఒక ఎస్సీ రిజర్వుడ్ స్థానాన్ని ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. మల్కాజిగిరి, చెవెళ్ల లోక్‌సభ స్థానాలను మాత్రం వదులుకోలేమని చెప్పింది. అయితే కిషన్ రెడ్డి వాటి కోసం పట్టుబట్టినట్లు సమాచారం. ఇక రంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌తో పాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, అరుణ్‌జైట్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిరావడంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఇదిలా ఉండగా పొత్తులు దాదాపు ఖరారైనట్టేనని టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. అనంతరం సాయంత్రం కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయలు జైట్లీ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. స్థానాల ఖరారుపై ఇప్పటికీ ఏమీ తేలకపోవడంతో పొత్తు చర్చలు ఇంకా ముగియనట్లే!
 టీఆర్‌ఎస్‌తో పొత్తుకే రాష్ర్ట నేతల మొగ్గు!
 తెలంగాణలో టీడీపీతో పొత్తు చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు లేవని ఆ ప్రాంత బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. మునిగిపోయే టీడీపీ నావలో ఎక్కి.. తమ పార్టీ కూడా మునిగిపోవాలా? అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కువ మంది టీ-బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపుతున్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి వెళితే కలిగే ప్రయోజనాలను అధినాయకత్వానికి వివరించే ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఉనికికోల్పోయిన టీడీపీతో కలిసి వెళ్లడం ద్వారా ఆ పార్టీకి బలాన్ని ఇచ్చినవారమవుతామని నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీతో పొత్తుకు పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు, మరికొందరు పార్టీ సీనియర్లు మొగ్గుచూపుతుండడంతో తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి అగమ్యగోచరమైంది. అయినా టీఆర్‌ఎస్‌తో పొత్తు అవకాశాలపై వారింకా ఆశాభావంతోనే ఉన్నారు. ‘ఎందుకైనా వుంచిదనే టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ద్వారాలు తెరిచే ఉంచుతాం. ఒకవేళ తెలంగాణ బీజేపీ శాఖ ప్రతిపాదనలకు తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచి స్పష్టమైన హామీలు లభించకపోతే.. వారితో పొత్తు బెడిసికొట్టినా ఆశ్చర్యం లేదు’ అని పార్టీ వుుఖ్యుడొకరు ‘సాక్షి’ ప్రతినిధితో అన్నారు.
 
 సీమాంధ్రలో ఒంటరిగానే వెళదాం..!
 
 ఇదిలా ఉండగా సీమాంధ్ర బీజేపీ-టీడీపీల మధ్య పొత్తు వ్యవహారం బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో 25 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలను బీజేపీ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కీలక నేతలతో సీమాంధ్ర జిల్లాల ముఖ్యనాయకులు సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్లకూడదనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ, నరేంద్రమోడీ హవా నడుస్తున్న తరుణంలో టీడీపీని టిక్కెట్లు అడుక్కోవడం తప్పుడు సంకేతాలిస్తుందని నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. సాధ్యమైన మేరకు స్వతంత్రంగానే బరిలోకి దిగితే మంచిదన్న సీమాంధ్ర నేతల వాదనకు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు సానుకూలత వ్యక్తం చేసినట్టు, పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని కూడా సంకేతాలిచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వేళ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళితే.. తాము అడిగినన్ని సీట్లతో పాటు కోరిన స్థానాలను కూడా ఇవ్వాలన్న షరతు విధించాలని సీమాంధ్ర బీజేపీ నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.


 

మరిన్ని వార్తలు