ఓటర్లు ఒకచోట.. పోలింగ్ కేంద్రం మరోచోట | Sakshi
Sakshi News home page

ఓటర్లు ఒకచోట.. పోలింగ్ కేంద్రం మరోచోట

Published Wed, Apr 2 2014 2:07 AM

voters are one place and polling center is another place

తాండూర్, న్యూస్‌లైన్: ఆ ఊరి ప్రజలు ఎవరూ కూడా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయరు. అదేమిటి  అనుకుంటున్నారా? అధికారుల నిర్లక్ష్యపు పనితీరుకు ఎదురైన పరిస్థితి. ఓటర్లు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టిన అధికారుల తీరు వివరాలివీ... తాండూర్ మండలంలోని కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలో 2,422, కొత్తపల్లి-2 ఎంపీటీసీ పరిధిలో 2,426 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు మాదారం-3 ఇంక్లైన్ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

 ఈ పోలింగ్ కేంద్రంలో కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలోకి వచ్చే అబ్బాపూర్, బెజ్జాల, ఆసాలమాడ గ్రామాలకు చెందిన గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకోవల్సి ఉంది. మాదారం-3 ఇంక్లైన్ గ్రామానికి చెందిన ఓటర్లు మాత్రం మాదారం టౌన్‌షిప్‌కు వచ్చి కొత్తపల్లి-2 ఎంపీటీసీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన వింత పరిస్థితి ఉంది. గిరిజన గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉన్న నర్సాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సుమారు 650 మంది ఓటర్లు ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేవారు. ప్రస్తుతం నిర్దేశించిన ఎంపీటీసీ పరిధిలో లేని గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో గిరిజనులు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఎనిమిది కిలోమీటర్ల దూరం వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవల్సి ఉంది.

 మాదారం-3 ఇంక్లైన్ గ్రామానికి చెందిన 450 మంది మాదారం టౌన్‌షిప్‌కు వచ్చి ఓటు వేయాలి. మాదారం, మాదారం-3 ఇంక్లైన్ గ్రామాల్లో కొత్తపల్లి-2 ఎంపీటీసీ పరిధిలోకి రాగా మిగతా గ్రామాలు కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలోకి వెళ్తాయి. కొత్తపల్లి-1 ఎంపీటీసీ పరిధిలో లేని పోలింగ్‌స్టేషన్1(మాదారం-3 ఇంక్లైన్)లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారి సౌలభ్యం కోసమే ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
Advertisement