నేడు తుది పోరు

11 Apr, 2014 05:55 IST|Sakshi
నేడు తుది పోరు

 ప్రాదేశిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
 

నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రాదేశిక ఎన్నికల తుదివిడత పోరు శుక్రవారం జరగనుంది. నల్లగొండ, భువనగిరి డివిజన్ల పరిధిలోని 26మండలాల్లో గల 358 ఎంపీటీసీ, 26 జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 8,85,559 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 362 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 358 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తారు.  పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు ఉన్న బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. ఈ ఎన్నికలకు 2,454 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. 696 ప్రాంతాల్లో 1,185 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భువనగిరి సమీపంలోని అనాజిపురం వద్ద ఉన్న దివ్యబాల విద్యాలయానికి నల్లగొండ డివిజన్‌కు చెందిన బ్యాలెట్ బాక్సులను శ్రీరామానందతీర్థ ఇంజినీరింగ్ కాలేజీకి తరలిస్తారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను కంటికి రెప్పలా కాపాడేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

 ఎన్నికలకు భారీ బందోబస్తు
 ఎన్నికలు పూర్తయిన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్‌ల పోలీస్ సిబ్బందిని మలి విడత ఎన్నికలకు బందోబస్తుకు మళ్లించారు. డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలుపుకుని సుమారు 3వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.

వీరితో పాటు బయటి జిల్లాల నుంచి కూడా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను రప్పించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక స్ట్రెకింగ్ ఫోర్స్, మొబైల్ టీములను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ సర ళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 105 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఈ గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా పోలింగ్ సరళిని రికార్డు చేస్తారు.

మరిన్ని వార్తలు