-

45 నిమిషాల ఫార్ములా

11 Jul, 2014 23:19 IST|Sakshi
45 నిమిషాల ఫార్ములా

అనవసరమైనవి కొనొద్దు.. డబ్బు ఆదా చేయాలి అనుకోవడం, పక్కవాళ్లకి సలహాలు ఇవ్వడం సులభమే అయినా అమలు చేయాల్సి వస్తే మాత్రం చాలా కష్టమే. అందుకే బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలని ఎంత ప్రయత్నించినా చాలా సందర్భాల్లో లక్ష్మణ రేఖ దాటేస్తూ ఉంటాం. ఇలా జరగకుండా జాగ్రత్తపడేందుకు ఎవరికి వారు కొంగొత్త ఫార్ములాలు ప్రయత్నిస్తుంటారు.

అలాంటిదే 45 నిమిషాల ఫార్ములా కూడా. మన ఇళ్లలో కుర్చీలు, సోఫాలు, టీవీలు ఇలాంటివన్నీ కూడా రోజులో చాలా ఎక్కువ సేపే వినియోగంలో ఉంటాయి. ఇవి కాకుండా  నిత్యావసరాలు, ఏవో కొన్ని తప్పనిసరివి పక్కన పెడితే మా ఇంట్లోనూ ఉన్నాయని చెప్పుకోవడానికి అలంకారప్రాయంగా కొనే  ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి. హంగూ, ఆర్భాటాల కోసం కావొచ్చు మరేదైనా ఉద్దేశంతో కావొచ్చు ఇలాంటివి కొనేటప్పుడు ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది.

మనం కొనే వాటిని రోజులో కనీసం ఒక 45 నిమిషాలపాటైనా ఉపయోగిస్తామా లేదా అన్నది చూసుకుంటే.. వృథా కొనుగోళ్లను మానుకోవచ్చు. ఆ మాత్రం సమయం ఉపయోగపడితే వాటిని కొన్నందుకు గిట్టుబాటు అయినట్లే. ఎందుకంటే రోజుకు 45 నిమిషాలంటే ఏడాదికి దాదాపు 11 రోజులవుతుంది.

ఈ లెక్కన చూస్తే సదరు వస్తువు ఏడాదిలో కనీసం 2 వారాల పాటైనా ఉపయోగించని పక్షంలో దాన్ని కొనడం వృథానే. ఇందుకోసం 45 నిమిషాల ఫార్ములానే పెట్టుకోవాలని రూలేం లేదు. ఎవరికి వారు తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోనూ వచ్చు.
 

మరిన్ని వార్తలు