మన ‘మెస్సీ’ల కోసం... | Sakshi
Sakshi News home page

మన ‘మెస్సీ’ల కోసం...

Published Fri, Jul 11 2014 11:20 PM

మన ‘మెస్సీ’ల కోసం... - Sakshi

నెల రోజులుగా ఉదయాన్నే ఏ పేపర్ తీసినా... ఏ టీవీ ఆన్ చేసినా ఫుట్‌బాల్... ఫుట్‌బాల్... ఇదొక్కటే మంత్రం. ఆటలోని మజాను ఆస్వాదిస్తున్న అనేక మంది చిన్నారులు... తామూ మెస్సీలా మెరవాలని తపిస్తున్నారు. అనేకమంది తల్లిదండ్రులు తమ బిడ్డను నెయ్‌మార్‌ను చేసేదెలా అని ఆలోచిస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడుతున్న దేశాలతో పోలిస్తే ఆటలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్ ఉంటుందా అనే భయం కూడా ఉంది. ఫుట్‌బాల్ ఆడాలనే ఆసక్తి ఉన్నా... ఎక్కడ ఎలా ఆడాలో తెలియని వాళ్లు అనేక మంది. వాళ్లందరి కోసం ఈ కథనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న అవకాశాలపై కథనం.
- మొహమ్మద్ అబ్దుల్ హాది
 
ఫుట్‌బాల్‌కు గతంలో పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్‌తో పాటు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లోనూ ఈ ఆట పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దశాబ్ద కాలానికి పైగా కొనసాగుతున్న కోర్టు వివాదాలు సంఘం కార్యకలాపాలకు అడ్డంకిగా మారాయి. ఫలితంగా టోర్నీలు లేక, ఆటగాళ్లు వెలుగులోకి రాక ఫుట్‌బాల్‌ను చరిత్రలోనే చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఇప్పుడు ఆ కారు చీకట్లు తప్పుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత ఇటీవలే ఆంధ్రప్రదేశ్ (సమైక్య) జట్టు జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పాల్గొంది. గత వారం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసమే అంటూ రిక్రూట్‌మెంట్ ప్రకటన ఇచ్చి ఆటను ప్రోత్సహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని ఉద్దేశాన్ని చాటి చెప్పింది. ఇవన్నీ ఆటకు సంబంధించి ఇరు రాష్ట్రాల్లో కలిగిన శుభపరిణామాలు. విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో సంఘాలు ప్రత్యేకంగా పని చేయబోతున్న కారణంగా కాస్త మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఫుట్‌బాల్ ఆటకు పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. చాలా తక్కువ చోట్ల మాత్రమే ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. ఇప్పుడు ఏ మాత్రం శిక్షణ కొనసాగుతున్నా...టోర్నీలు నిర్వహిస్తున్నా అదంతా ఏపీ ఫుట్‌బాల్ సంఘం కార్యకలాపాల్లో భాగంగానే జరుగుతున్నాయి. వివిధ జిల్లా సంఘాలు చొరవ చూపించి ఆటను నడిపించుకుంటున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ట,  పరిచయాలతో క్లబ్ లీగ్, స్కూల్ లీగ్ టోర్నీలు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయా ఆటగాళ్లకు గుర్తింపు లభించకపోయినా ఆటపై ఆసక్తితో చాలా మంది ఈ టోర్నీల్లో పాల్గొంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెలక్షన్స్ ద్వారా పూర్తి స్థాయి రాష్ట్ర జట్లను నిర్మించుకునేందుకు అవకాశం ఉంది.
 
ఆంధ్ర ప్రాంతంలో

ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నంలో  ఫుట్‌బాల్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఎ డివిజన్ స్థాయిలో 27 క్లబ్‌లు, బి డివిజన్ స్థాయిలో 11 క్లబ్‌లు ఉన్నాయి. అండర్-14 మొదలు సీనియర్ స్థాయి వరకు క్యాంప్‌లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే, మున్సిపల్ గ్రౌండ్‌లలో శిక్షణ లభిస్తుంది. మహిళా ఫుట్‌బాల్ జట్టు కూడా ఇక్కడ ఉంది. విజయవాడలో 12 జట్ల మధ్య రెగ్యులర్‌గా టోర్నీల నిర్వహణ జరుగుతుంది. శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 9 జట్ల మధ్య క్లబ్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఇక గుంటూరు జిల్లా కూడా చురుగ్గానే ఉంది. ఇక్కడ కూడా రెగ్యులర్‌గా లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మాత్రం శాప్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. దాదాపు 200 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండటం విశేషం. వీరిలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కూడా ఉండటం విశేషం.  జిల్లాలో 16 జట్లతో రెగ్యులర్‌గా టోర్నీలు జరుగుతున్నాయి.
 
ఇతర చోట్ల చూస్తే తూర్పు, పశ్చిమ గోదావరిల్లో మాత్రం పెద్దగా ఫుట్‌బాల్ కనిపించడం లేదు. ఏలూరు, కాకినాడల్లో కొంత మంది ఆటపై ఆసక్తి చూపిస్తున్నా...ఒక క్రమపద్ధతిలో లేదు. అదే విధంగా ప్రకాశం జిల్లా కూడా ఆటలో వెనుకబడే ఉంది. అయితే ఒంగోలులో మాత్రం స్థానిక చర్చి భాగస్వామ్యంతో ఏటా రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహిస్తున్నారు.
 మరిన్ని వివరాల కోసం...
 విశాఖపట్నం - జగన్నాథరావు     (99121 82717)
 శ్రీకాకుళం - రమణ         (94406 77121)
 విజయనగరం - లక్ష్మణ్ రావు     (99632 37596)
 విజయవాడ - కొండా         (94411 20228)
 తూర్పు గోదావరి - కిషోర్     (98480 41486)
 నెల్లూరు - శాప్ కోచ్ శ్రీనివాస్     (94402 75291)

రాయలసీమలో

ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫుట్‌బాల్ సంస్కృతి ఉంది. ముఖ్యంగా రాయలసీమ ఫుట్‌బాల్ టోర్నీ పేరుతో రెగ్యులర్‌గా టోర్నమెంట్ నిర్వహణ కొనసాగుతోంది. ఇక్కడి రెండు జిల్లాల్లో ప్రభుత్వ పరంగా ఆటకు అవకాశం ఉంటే...మరో జిల్లాలో ప్రైవేట్ ఆధ్వర్యంలోనే అయినా అద్భుతమైన సౌకర్యాలు ఉండటం విశేషం. కర్నూల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాయ్ సెంటర్‌లో ఫుట్‌బాల్ శిక్షణ సాగుతోంది. ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. జిల్లాలో 14 జట్లతో టోర్నీ నిర్వహణ సాగుతోంది. ఇక్కడ రెండు మహిళా జట్లు కూడా ఉన్నాయి. కడప జిల్లాలో 12 జట్లు లీగ్స్‌లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఇటీవల మెరుగైన సౌకర్యాలతో శిక్షణ అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గతంలో మంచి ఆసక్తి ఉన్నా...ఇప్పుడు కొంత తగ్గింది. ప్రస్తుతం ఎనిమిది జట్లు అక్కడ లీగ్‌ల కోసం నమోదై ఉన్నాయి.  అనంతపురం జిల్లాది మాత్రం ఫుట్‌బాల్‌కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. మాంచూ ఫై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణనిస్తున్న వేర్వేరు క్రీడాంశాల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. ఇక్కడే దాదాపు వేయిమంది వరకు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉన్న హాస్టల్‌లో 45 మంది ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఇదే కాకుండా జిల్లాలోని ప్రతీ మండలంలో కనీసం ఒక బాలుర, ఒక బాలికల జట్టు ఉండేలా ప్రణాళికలతో ఫై అకాడమీ ముందుకు సాగుతోంది.  గత కొన్నేళ్లలో రాష్ట్ర స్థాయిలో జరిగినవి కొన్ని టోర్నీలే అయినా ప్రతి చోటా అనంతపురం ఆటగాళ్లే అద్భుతంగా రాణించారు.
 మరిన్ని వివరాల కోసం...
 అనంతపురం - మాంచూ ఫై అకాడమీ,
 భాస్కర్ (98667 14822)
 కర్నూల్ - సాయ్ సెంటర్,
 రాజు (98852 40365)
 కడప - హసన్ (93474 10724)
 చిత్తూరు - జగన్నాథరెడ్డి (91771 42739)
 
తొలి ప్రైవేట్ అకాడమీ...

ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 22 మంది కాంట్రాక్ట్ కోచ్‌లు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రౌండ్‌లు, స్టేడియంలను బట్టి నిర్ణీత సమయం ప్రకారం వారు శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు బేసిక్స్ నేర్చుకునేందుకు ఇది సరిపోతుంది. అయితే ఫుట్‌బాల్‌లో సౌకర్యాలు, శిక్షణకు సంబంధించి ఆయా జిల్లా క్రీడాభివృద్ధి అధికారుల (డీఎస్‌డీఓ) పాత్ర నామమాత్రంగానే ఉంటోంది. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ (కడప), కర్నూల్ సాయ్ హాస్టల్, ఖమ్మం ట్రైబల్ హాస్టల్‌లలో మాత్రమే హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఫుట్‌బాల్‌లో కోచింగ్ లభిస్తోంది. అయితే తొలి సారి నిజామాబాద్‌లో ఒక ప్రైవేట్ ఫుట్‌బాల్ అకాడమీ ఇటీవల ఏర్పాటయింది. హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఈ అకాడమీ ఫుట్‌బాల్‌పైనే ఫోకస్ పెడుతుండటం విశేషం.
 
తెలంగాణలో
 
ఒకప్పుడు ఒలింపిక్ క్రీడాకారులను అందించిన హైదరాబాద్ మహా నగరంలో ఇప్పుడు ఆనాటి కళ లేదు. అయితే గతంతో పోలిక లేకున్నా...ఇప్పటికీ కొన్ని మైదానాల్లో ఫుట్‌బాల్ ప్రాణంగా భావించే ఆటగాళ్లు, కోచ్‌లు ఉన్నారు. ఎల్బీ స్టేడియం, జింఖానా మైదానం, బొల్లారం, తిరుమలగిరి, అల్వాల్, సీసీఓబీ, బార్కస్ తదితర గ్రౌండ్‌లలో పాటు కొన్ని జీహెచ్‌ఎంసీ మైదానాల్లో చురుగ్గా మ్యాచ్‌లు జరుగుతు న్నాయి. ఆసక్తి ఉన్నవారు నేర్చుకునేందుకు, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఆయా చోట్ల మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోని సైనిక్‌పురి భవాన్స్ కాలేజీ మైదానంలో, అల్వాల్ లయోలా కాలేజీలో ఫుట్‌బాల్ కొనసాగుతోంది. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ నుంచి కూడా మంచి ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 15 జట్లు ఉన్నాయి. ఇటీవలే ఇక్కడ అంతర్ జిల్లా టోర్నీ భారీ ఎత్తున జరిగింది. వరంగల్‌లో ఒక మహిళా జట్టు సహా 9 టీమ్‌లు ఉన్నాయి. గతంలో చురుగ్గా ఉన్న మెదక్‌లో ప్రస్తుతం ఆ జోరు మందగించింది. నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో కూడా పెద్దగా ఫుట్‌బాల్ మనుగడలో లేదు. ఖమ్మం జిల్లాలో అసోసియేషన్ తరఫున పెద్దగా ఆట లేదు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన హాస్టల్‌లో ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ కోచ్ ఉన్నారు. నిజామాబాద్‌లో 11 జట్లతో లీగ్ కొనసాగుతోంది.
 మరిన్ని వివరాల కోసం...
 రంగారెడ్డి - జాన్ విక్టర్ (77025 36075)
 ఆదిలాబాద్ - రఘునాథ్ (98494 44744)
 నిజామాబాద్ - నాగరాజు (98855 17151)
 వరంగల్ - సురేందర్ (98858 75082)
 కరీంనగర్ - గణేశ్ (99088 39896)
 మెదక్ - నాగరాజు (93473 44440)
 నల్లగొండ - కుమార్ (99129 75877)
 మహబూబ్‌నగర్ -వెంకట్ (9440075365)
 
 హైదరాబాద్
 ఎల్బీ స్టేడియం:హరి (90000 90701)
 జింఖానా మైదానం: అలీముద్దీన్ (99893 35840)
 తిరుమలగిరి: టోనీ (94927 28100)  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement