ఆప్ఘనిస్తాన్‌ ఆశాజ్యోతులు

22 Apr, 2020 07:05 IST|Sakshi
సొమయ ఫారుకీతోపాటు వెంటిలేటర్‌ తయారీలో నిమగ్నమైన విద్యార్థినులు

1990లలో ఆఫ్ఘనిస్తాన్‌ అంటే తాలిబన్‌ల ఇష్టారాజ్యం. ఆడపిల్లల పాలిట అనేక నిర్బంధాలు ఉన్న నరకం. కాని ఆ తర్వాత పరిస్థితి మారింది. ఆ దేశంపై అమెరికా దాడి తర్వాత ఆడపిల్లలకు విద్యాబుద్ధులు అందుతున్నాయి. వారిలో మెరికల్లాంటి విద్యార్థినులు కూడా వస్తున్నారు. అటువంటి వారిలో 17 ఏళ్ల సొమయ ఫారుకీ ఒకరు. ఈ అమ్మాయి ప్రస్తుతం వార్తల్లో ఉంది. దానికి కారణం తనలాంటి మరో ముగ్గురు నలుగురు చురుకైన విద్యార్థులను తోడు తీసుకొని కారు స్పేర్‌పార్ట్‌లతో, తక్కువ ఖర్చులో తయారయ్యేలా ఒక వెంటిలేటర్‌ను ఆవిష్కరించే పనిలో ఉంది. ప్రపంచ దేశాలన్నింటి లాగా ఆఫ్ఘనిస్తాన్‌ కోవిడ్‌ కోరల్లో ఉంది. ప్రస్తుతం అక్కడ దాదాపు 900 కేసులు పాజిటివ్‌ వచ్చాయి.

సొమయ ఫారుకీ 

‘అయితే టెస్టింగ్‌ సరిగ్గా చేస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది’ అని సొమయ అంది. కోవిడ్‌ వైద్యంలో వెంటిలేటర్ల అవసరం కీలకం అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడున్నర కోట్ల ఆఫ్ఘనిస్తాన్‌ జనాభాకు కేవలం 400 వెంటిలేటర్లే అందుబాటులో ఉన్నాయి. ‘అందువల్ల మేము జూన్‌ నాటికి ప్రొటొటైప్‌ను తయారు చేసే తొందరలో ఉన్నాం’ అని సొమయ చెప్పింది. సొమయ ‘హెరత్‌’ పట్టణంలో ఉంటుంది. ఇది ఇరాన్‌కు సరిహద్దు పట్టణం కనుక అక్కడ కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది.

‘ఎవరో వచ్చి సహాయం చేసే లోపు మాకు మేము సహాయం చేసుకోగలగాలి’ అని సొమయ చెప్పింది. చదువులో ప్రదర్శించే తెలివితేటల వల్ల సొమయ 2017లో అమెరికాలో జరిగిన ‘రొబో ఒలింపియాడ్‌’లో పాల్గొని వచ్చింది. తండ్రి ప్రోత్సాహం సంపూర్ణంగా ఉండటం వల్ల పోలీసుల చెక్‌ పాయింట్‌లను అడ్డదార్ల గుండా దాటి మరి తన వర్క్‌షాప్‌ లో ఈ ఆవిష్కరణ కోసం ఆవిశ్రాంతంగా పని చేస్తోంది. ఇటువంటి చీకటిరోజుల్లో ఇలాంటివే ఆశ రేపే వార్తలు.

మరిన్ని వార్తలు