ఆల్జీమర్స్‌పై అప్రమత్తత అవసరం

21 Sep, 2013 00:38 IST|Sakshi
ఆల్జీమర్స్‌పై అప్రమత్తత అవసరం

వరల్డ్ ఆల్జీమర్స్‌ యాక్షన్ డే సందర్భంగా
 

ఇటీవల అల్జైమర్స్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు ఆయుఃప్రమాణాలు పెరగడంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాంతో అల్జైమర్స్ బారిన పడేవారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అల్జైమర్స్ అంటే అదేదో మతిమరపు వ్యాధి మాత్రమేనని చాలామంది అనుకుంటారు. కానీ దీని తీవ్రత అంతకంటే ఎక్కువే. నేడు వరల్డ్ అల్జైమర్స్ యాక్షన్ డే సందర్భంగా అల్జైమర్స్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.
 
 మనందరం ఏదో ఒక విషయాన్ని మరచిపోతుంటాం. ఇలా మరచిపోవడం వల్ల కలిగే నష్టం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా దాని వల్ల మన రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. కాస్త వయసు పైబడ్డ తర్వాత మతిమరపు వచ్చిందనుకోండి. దానివల్ల కొన్ని నష్టాలున్నా జీవితం పెద్దగా అస్తవ్యస్తం కాదు. కానీ అల్జైమర్స్ అలా కాదు. మరపు, మతిమరపునకు తారస్థాయిగా అల్జైమర్స్‌ను పేర్కొనవచ్చు.
 
 అల్జైమర్స్‌కు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అగ్గిపెట్టెను ఉపయోగించి మంటను పుట్టించవచ్చన్న సంగతి తెలిసిందే. మార్కెట్‌నుంచి వచ్చేటప్పుడు అగ్గిపెట్టెను తెమ్మంటే మరచిపోయేవారు చాలామందే ఉంటారు. కానీ అగ్గి అన్నదాన్నే మరచిపోతే...? వంట చేయడానికి అగ్గిపెట్టెను మరచిపోయారనుకోండి. పర్లేదు. కానీ స్టౌ వెలిగించాక అగ్నితో కలిగే ప్రయోజనాలు, నష్టాలు అన్నింటినీ మరచిపోయారనుకోండి. అలాగే జరిగితే ఓ వృద్ధురాలు వంట మొదలయ్యాక మంటను మరచిపోయి... అది ఒంటిని అంటుకున్నా ప్రమాదమే, ఇంటికి అంటుకున్నా ప్రమాదమే! అల్జైమర్స్‌లో జరిగేది ఇదే! తాము రోజూ చేసే పనులనే మరచిపోతుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో విచక్షణ కోల్పోతారు. ప్రవర్తనలో ఎంతగానో మార్పు వస్తుంది. టాయ్‌లెట్‌కు వెళ్లడం, స్నానం చేయడం, అన్నం కలుపుకోవడం, బట్టలు వేసుకోవడం, తాము రోజూ నడిచే దారిని, ఎన్నో దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న తమ సొంత ఇంటినే మరచిపోవచ్చు.
 
 ఎందుకిలా జరుగుతుంది?
 అల్జైమర్స్ రోగుల్లో మెదడు క్రమంగా కుంచించుకుపోతుంటుంది. దాంతో మెదడుకణాలు క్రమంగా నశించిపోతాయి. అయితే ఎందుకిలా జరుగుతుందన్న అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లభ్యమవుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి పర్యావరణ అంశాలతో పాటు, జన్యుపరమైన కారణాలూ ఈ వ్యాధికి దోహదపడుతున్నాయని కొందరు నిపుణుల భావన.
 
 అల్జైమర్స్ మతిమరపుతో కలిగే నష్టాలిలా...?
 ఈరోజు ఏ వారం... అన్నది మరచిపోవడం అందరి విషయంలోనూ సాధారణంగా జరిగే పరిణామమే. కానీ అసలు తేదీలు, వారాలు, నెలలు అన్న భావననే మరచిపోతే...? అల్జైమర్స్ రోగుల్లో జరిగేదిదే. అయితే కొన్నిసార్లు అకస్మాత్తుగా మరచిన విషయాలు గుర్తుకు రావచ్చు కూడా. ఇలా మనం చూసే వృద్ధులే ఒక్కోసారి మామూలుగా మరికొన్నిసార్లు అన్ని విషయాలనూ మరచిపోయినట్లుగా కనిపిస్తుంటారు. తమలో కలుగుతున్న మార్పులతో ఒక్కోసారి వారు చికాకుకు లోనవుతుంటారు. కొందరు భ్రాంతులకూ లోనవుతుంటారు.
 
 అల్జైమర్స్‌ను గుర్తించడం ఎలా?
 చాలా కారణాలు మతిమరపునకు దోహదం చేస్తాయి. ఉదాహరణకు పక్షవాతం, మెదడులో గడ్డలు (ట్యూమర్స్), మెదడులో రక్తస్రావం (హ్యామరేజ్) వంటివి. అయితే రోగికి వచ్చిన మతిమరపు అన్నది అల్జైమర్స్ కారణంగానే అని నిర్ధారణ చేయడం ఒకింత కష్టమైన ప్రక్రియ. దీనికి సీటీ స్కాన్, ఎమ్మారై (బ్రెయిన్) వంటి పరీక్షలు దోహదపడతాయి. ఇందులో మెదడు కుంచించుకుపోయినట్లుగా కనిపించడాన్ని బట్టి అల్జైమర్స్‌ను గుర్తించవచ్చు. అలాగే రోగి చెప్పే లక్షణాలతో, వైద్యపరీక్షల ఫలితాలను సరిపోల్చి దీన్ని నిర్ధారణ చేయవచ్చు.
 
 నివారణ: పక్షవాతాన్ని, డయాబెటిస్‌ను నివారించడానికి అనుసరించే సాధారణ జీవనశైలి సూచనలే అల్జైమర్స్‌నూ నివారిస్తాయి. అంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, పొగతాగడం, మద్యం వంటి  అలవాట్లకు దూరంగా ఉండటం, శరీరానికి అలసట రాని విధంగా తేలికపాటి వ్యాయామం (నడక వంటివి) చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
 
 మధ్యవయసువారిలో సాధారణంగా కలిగే ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం కూడా అల్జైమర్స్ వ్యాధికి మంచి నివారణ.
 
 చికిత్స / మందులు: ప్రస్తుతం అల్జైమర్స్ వ్యాధి వచ్చేందుకు పట్టే సమయాన్ని, ఒకవేళ వస్తే దాని తీవ్రత ముదరడానికి పట్టే సమయాన్ని వీలైనంతగా ఆలస్యం చేసేందుకు మాత్రమే మందులు ఉన్నాయి. అల్జైమర్స్‌ను పూర్తిగా తగ్గించే మందుల కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అల్జైమర్స్ అసలు రాకుండానే నివారించడం కోసం వ్యాక్సిన్‌ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
 రోగుల బంధువులకు సూచనలు
 న్యూరో ఫిజీషియన్లు చెప్పే సూచనలను పూర్తిగా పాటించాలి.  రోగులను ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వకూడదు. వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి.
 
 నిర్వహణ: యాసీన్

 
 డాక్టర్ ముదిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
 సీనియర్ న్యూరో ఫిజీషియన్
 ప్రసాద్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు