అందుకే నేను ఇలా ఉన్నాను మరి!

14 Aug, 2018 00:12 IST|Sakshi

చెట్టు నీడ

మూడురోజులుగా తిండి లేని ఒక యాచకుడు ఆ దారిన వెళ్లే ఒక కారును ఆపి ‘‘కాస్త ధర్మం చెయ్యండి బాబూ’’అన్నాడు. యాచకుడి కట్టూబొట్టూ చూసి అతనేదో మంచి కుటుంబం నుండి వచ్చిన వాడై ఉంటాడని, అతని మాట తీరు చూస్తే కాస్త చదువుకున్నవాడని అనిపించింది కారులోని వ్యక్తికి. పైగా, అతను తనకు అప్పుడే ప్రమోషన్‌ వచ్చిందన్న సంతోషంలో ఉన్నాడు. దాంతో అతను జేబులో నుంచి వందరూపాయల నోటు తీసి యాచకుడికి ఇవ్వబోయాడు. ఆ వంద రూపాయల నోటుకేసి చూస్తూ పక్కనే కూర్చున్న స్నేహితుడు పెద్దగా నవ్వాడు.‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అన్నాడు అతను.

‘‘అతి త్వరలో నువ్వు కూడా నా స్థానంలో ఉండాల్సి వస్తుందనిపించి నవ్వొచ్చింది. కనిపించిన ప్రతివాడికీ ఇలా దానం చేస్తూ పోతే చివరికి ఏమీ మిగలదు. నేనందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలే నాకు రావలసిన ప్రమోషన్‌ కూడా మిస్సయింది’’ అన్నాడు స్నేహితుడు. దానికతను నవ్వుతూ, ‘‘బహుశా అందుకేనేమో నాకు ప్రమోషన్‌ వచ్చింది. కారు కూడా కొనుక్కోగలిగాను. నువ్వేమో అలాగే ఉన్నావు ఎదుగూబొదుగూ లేకుండా’’ నవ్వుతూనే అంటించాడు. మీరు ఇస్తూ పోతే మీ దగ్గర ఉన్నదంతా అయిపోతుందనేది సాధారణ ఆర్థిక సూత్రాలకు సంబంధించినది. అదే ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారమైతే మీరు ఏమీ ఇవ్వకుండా ఉన్నట్లైతే మీ దగ్గర ఏదీ మిగలదు. అదే మీరు ఇస్తూ పోతే మీ దగ్గర చాలా చాలా ఉంటుంది.  బాహ్య, అంతర్గత ప్రపంచాల చట్టాలు పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. ముందు మీరు అంతర్గతంగా చక్రవర్తి స్థాయికి ఎదగండి. అప్పుడే పంచేందుకు మీ దగ్గర చాలా ఉంటుంది.
– ఓషో భరత్‌
 

మరిన్ని వార్తలు