అమ్మ వదిలేస్తే..!

21 Mar, 2019 01:40 IST|Sakshi

తల్లిదండ్రుల మధ్య ఉండే బంధాలు కొన్ని బాగుంటాయి. కొన్ని చాలా బాగుంటాయి. చాలా అరుదుగా మాత్రమే ‘లాగుతూ’ ఉంటాయి. లాగే బంధాలు..లాగే కొద్దీ తెగిపోతాయేమోనని పిల్లలకు భయంగా ఉంటుంది. ఆందోళనగా ఉంటుంది. మారిపోతారు. ఆ మార్పును చూసి..పిల్లలు పాడైపోతున్నారని అనుకునే బదులుతెగేవరకూ లాగ కూడదని పేరెంట్స్‌ అనుకోవాలి కదా!

అబ్బాయి రోజూ కాలేజ్‌కు వెళుతున్నాడు. సాయంత్రం కాలేజ్‌ నుంచి వస్తున్నాడు. జుట్టు బాగా పొడవుగా పెంచాడు. ఏంట్రా’ అంటే ఫ్యాషన్‌ అన్నాడు.గడ్డం కూడా పెంచుతున్నాడు. అదీ ఫ్యాషనే అట.కాని గోళ్లు పెంచడం, గోళ్లలో మట్టి ఉండటం ఫ్యాషన్‌ కాకపోవచ్చు.ఏదో సమస్య ఉన్నట్టే. స్నానం చేయకపోవడం కూడా ఫ్యాషన్‌ కాకపోవచ్చు. ఏదో సమస్య ఉండే ఉంటుంది.మురికిగా ఉండటం, అన్నం సరిగ్గా తినకపోవడం, కళ్లు గుంటలు పడటం, చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం, అరవడం ఫ్యాషనా?కానే కాకపోవచ్చు. ఏదో సమస్య ఉందిఇంజనీరింగ్‌ కాలేజ్‌ నుంచి ఇంటికి రిజిస్టర్డ్‌ లెటర్‌ వచ్చింది. ప్రిన్సిపాల్‌ నుంచి.‘మీ అబ్బాయి 8 నెలలుగా కాలేజ్‌కు రావడం లేదు. మేము మీ అబ్బాయి సీటును తొలగిస్తున్నాం’ అని.తల్లి హతాశురాలైంది. తండ్రికి ఇవేమీ పట్టవు.చడామడా తిట్టి తన పనిలో తాను వెళ్లిపోయాడు.

తల్లి మాత్రం తాపత్రయ పడుతూ ‘ఎందుకు నాన్నా?’ అని అడిగింది అనునయంగా.‘నీ వల్లే’ అన్నాడు.‘నా వల్ల?’‘అవును. నీ వల్లే. ఐ హేట్‌ యూ. ఐ హేట్‌ యూ ఫ్రమ్‌ ద కోర్‌. ఐ వాంట్‌ టు కిల్‌ మైసెల్ఫ్‌’ అని లేచి వెళ్లిపోయాడు.రెండు వారాలు గడిచాయి.అబ్బాయి లింగంపల్లి రైల్వేస్టేషన్‌ దగ్గర ఒంటరిగా కనిపించడాడని ఎవరో తెలిసినామె తల్లికి ఫోన్‌ చేసింది.తల్లి పరిగెత్తుకొని వెళ్లింది.వెళ్లకపోతే రైలు కింద పడి ఉండేవాడేమో.రూమ్‌ అంతా వెతికితే స్లీపింగ్‌ పిల్స్‌ కనిపించాయి. చాలా తెచ్చిపెట్టుకొని ఉన్నాడు. స్క్రిబ్లింగ్‌ ప్యాడ్‌ మీద అర్థం కాని రాతలు ఉన్నాయి. సూసైడ్‌ నోట్‌కి రిహార్సల్స్‌ ఏమో. అయ్యో... దేవుడా.పెళ్లి చేసేటప్పుడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడమన్నారు పెద్దలు. కాదు... ఇటు ఏడు లోతుల అమ్మాయి మనసు అటు ఏడు లోతుల అబ్బాయి మనసు చూడాలి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకునేలా చేయాలి.

ఇద్దరూ ఒకరినొకరు నిజంగా ఇష్టపడ్డారా... వీరికి ఒకటో రెండో సమానమైన అభిరుచులు ఉన్నాయా... జంట మరీ గొప్పగా లేకపోయినా పక్కపక్కన నిలుచుంటే భార్యాభర్తలు అనిపిస్తున్నారా... ఇవన్నీ చూసి చేయాలి.కాని అబ్బాయి తల్లి గురించి ఆమె తల్లిదం డ్రులు ఇవన్నీ ఆలోచించలేదు. ఆమెను చేసుకున్న అతని తల్లిదండ్రులకు అదంతా అవసరం లేదు. లోకంలో సవాలక్ష పెళ్లిళ్లు ఇలాగే జరుగుతాయి. కట్నకానుకలు మాట్లాడుకుంటారుగానీ అమ్మాయి మనసులో ఏముందో మాట్లాడుకుంటారా?సీనియర్‌ ఇంటర్‌ చదువుతుండగా ఆమెకు పెళ్లి చేసేశారు. పల్లెల్లో అదే పెద్దవయసని చెప్పారు. చదువుకుంటానంటే కాపురమే పెద్ద కాలేజ్‌ అని అన్నారు.

చేసుకున్నవాడు ఆఫీసరు. గవర్నమెంట్‌ ఆఫీసర్‌ అంటే బిజీగా ఉండేవాడు. అతడికి బాగా ఖర్చు చేయడం ఇష్టం. కనుక బాగా సంపాదించేందుకు రోజూ ఎవరెవరితోనో తిరుగుతుండేవాడు. ఎవరెవరో అతని దగ్గరకు వచ్చేలా చేసుకునేవాడు. వాళ్లిద్దరి మధ్య అన్యోన్యత అసలు లేదు. ఆమె అతణ్ణి ఎప్పుడూ తనవాణ్ణని అనుకోలేదు. కొడుకు మాత్రం పుట్టాడు. అస్సలు బొత్తిగా మాట్లాడుకోని తల్లిదండ్రుల్నీ తనను ఒళ్లో కూచోబెట్టుకొని నవ్వుతూ ఉండే తల్లిదండ్రులని ఆడించే తల్లిదండ్రుల్ని చూడకుండా ఆ అబ్బాయి పెరిగాడు. ఇంకొకరు పుడితే ఎలా ఉండేదో కాని ఇతనితో ఈ ఒక్కడు చాల్లే అని తల్లి అనుకుంది. అబ్బాయి ఒంటరి. తల్లికి నిస్పృహ. తండ్రి బిజీ.ఇలా కూడా ఉండటానికి అబ్బాయి ప్రయత్నించాడు. ఆ ఇంటిని అలాగే స్వీకరించడానికి ప్రయత్నించాడు. కాని– కాని–ఆ రోజు...ఎనిమిది నెలల క్రితం.

అబ్బాయి ఆంటీ ఇంటికి వెళ్లాడు. ఆంటీ వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ఆంటీ, ఆంటీ హజ్బెండ్‌ అబ్బాయి తల్లికి చిన్నప్పటి స్నేహితులు. అందుకని ఇరు కుటుంబాల వాళ్లు రాకపోకలు సాగిస్తుంటారు. అబ్బాయి తల్లి అప్పుడప్పుడు ఒక్కత్తే వాళ్ల ఇంటికి వెళుతుంటుంది. అబ్బాయి కూడా ఒక్కడే బోర్‌ కొట్టినప్పుడు వెళుతుంటాడు. ఆంటీ ఆ రోజు ఒక్కతే ఉంది. ఏదో విషయానికి అప్‌సెట్‌ అయినట్టుగా కనిపిస్తోంది. అబ్బాయిని చూస్తూనే పెద్దగా కంటతడి పెడుతూ బాల్కనీలోకి తీసుకెళ్లింది.‘నీకో విషయం చెప్పాలి’ అంది అబ్బాయితో.‘చెప్పండి ఆంటీ’‘మీ అమ్మకు మీ నాన్నంటే ఇష్టం లేదు’‘తెలుసు’‘కాని మీ అమ్మ ఇన్నాళ్లు ఏ మానసిక తోడు లేకుండా ఎలా ఉండగలదు?’అబ్బాయి చూస్తున్నాడు.

‘మీ అమ్మకు ఒక ఆత్మీయుడు ఉన్నాడు. ఎవరో కాదు. నా భర్త’అబ్బాయి షాక్‌ అయ్యాడు.‘మీ అమ్మంటే నాకు చాలా ఇష్టం. పెళ్లిలో ఎప్పుడూ సంతోషం లేదని సానుభూతి ఉండేది. నా భర్త కూడా అలాగే చూసేవాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకుంటుంటే నేనే ఎంకరేజ్‌ చేశారు. వారు ఇంకా క్లోజ్‌ అయినా చూసి చూడనట్టు ఊరుకున్నాను. మీ అమ్మ కూడా ఎంత హద్దులో ఉండాలో అంతలోనే ఉండేది. కాని ఇప్పుడు వాళ్లిదరూ ఒకరినొకరు వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చారు. మీ అమ్మ డైవోర్స్‌ తీసుకొని నా భర్తతో వెళ్లిపోతానని అంటోంది. నా భర్త కూడా డైవోర్స్‌ అంటూ ఉన్నాడు. ఇంట్లో గొడవ అవుతోంది’.‘మరి నా సంగతి?’ అబ్బాయి అడిగాడు.

ఏమో. నిన్ను మీ నాన్న దగ్గర వదిలి వెళ్లిపోతుందేమో’అబ్బాయి కుంగిపోయాడు. ఎందుకు బతుకుతున్నట్టు? తండ్రికి పట్టక, తల్లికి పట్టక. కోపం, నిస్సహాయత, అసహనం...ఇంటికొచ్చి తల్లితో పెద్ద గొడవ పెట్టుకున్నాడు.‘వెళ్లిపోతావా... నన్ను వదిలి వెళ్లిపోతావా?’ వస్తువులు విసిరి కొట్టాడు.సడన్‌గా కొడుకు నిలదీసేసరికి ఆమెకు తలకెక్కిన మత్తు దిగిపోయింది. ఆ బంధం కంటే కూడా కొడుకుతో బంధమే ముఖ్యమని అర్థమైంది.‘లేదు నాన్నా.. వెళ్లను... నిన్ను వదిలి వెళ్లను’ గట్టిగా చెప్పింది.కాని అబ్బాయి మనసులో అభద్రత దారుణంగా పేరుకుపోయింది.ఇంట్లో వాళ్లకు తెలిసి రెండుసార్లు, తెలియక నాలుగుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.చివరకు సైకియాట్రీ కౌన్సిలింగ్‌కు వచ్చాడు.ప్రస్తుతం ఆ అబ్బాయికి సైకియాట్రీ ట్రీట్‌మెంట్‌ జరుగుతోంది.

తన మీద తనకు నమ్మకమే కాదు కుటుంబ బంధాల మీద కూడా నమ్మకం కలిగేలా పదే పదే కౌన్సెలింగ్‌ ఇవ్వబడుతోంది.తండ్రికి అసలు సంగతి చెప్పవద్దని తల్లి కొడుకు దగ్గర మాట తీసుకుంది.తల్లి కోసం కొడుకు మాట ఇచ్చాడు.ఆమె తన కొడుకు కోసం భర్తను కూడా స్వీకరించడం మెల్లమెల్లగా ఫ్రారంభించింది. తల్లితండ్రి కలిసి కారులో తనను క్లినిక్‌కు తీసుకురావడం అబ్బాయికి పెద్ద ఓదార్పుగా ఉంది.త్వరలోనే అతడు జుట్టు కత్తిరించుకుని కొత్త బట్టల్లో స్టయిల్‌గా ఉత్సాహంగా కాలేజ్‌కు వెళ్తాడని అందరిలోనూ ఆశ.

 కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు