పుణ్యాత్ముల ప్రభావం

31 Aug, 2019 07:56 IST|Sakshi

చెట్టు నీడ

ధర్మరాజు శాంత మూర్తి. ధర్మానికి కట్టు బడినవాడు. నెమ్మదితనం ఉన్నవాడు. ఆయన ఉన్న పరిసరాలన్నీ శాంతితో నిండిపోయేవి. మహా భారత యుద్ధానంతరం స్వర్గారోహణం చేస్తూ ధర్మరాజు వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో నరకం పక్కగుండా ఆయన నడుస్తున్నాడు. నరకం చాలా దారుణంగా వుంది. చూడడానికి భయోత్పాతంగా ఉంది. పాపులని చిత్ర హింసలు పెట్టడం, నూనెలో కాల్చడం, మంటల్లో వేయడం వంటి అనేక కఠిన శిక్షలతో నిండి ఉంది. దాంతో నరకంలో భరించలేని వేడి. ధర్మరాజు నరకం పక్కనుండి వెళుతూ ఉంటే ఆయన శరీరంలో నుంచి ఆ చలువదనం ప్రసరించి నరకలోకమంతటా పిల్లగాలి వీచింది. ఆ వాతావరణంలోని ఆహ్లాదాన్ని పాపులందరూ అనుభవించారు. ఎందుకిలా జరిగిందని చూస్తే పక్కగా ధర్మరాజు వెళుతున్నాడు. దాంతో నరక వాసులందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.

‘‘స్వామీ! మీరు అడుగుపెడితేనే మేము ఇంత హాయిని పొందాము. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ పరిసరాలన్నీ నిండిపోయాయి. దయచేసి మీరు కొంతకాలం ఇక్కడ ఉంటే మేము ఎంతో ప్రశాంతతని అనుభవిస్తాము స్వామీ! అనుక్షణం. చిత్రహింసలను అనుభవించే మమ్మల్ని మీరు కరుణించి ఇక్కడ ఉంటే మా పాపాల కు విముక్తి కూడా కలుగుతుంది’’ అని వేడుకొన్నారు. ధర్మరాజు చిరునవ్వుతో వారి ప్రార్థన మన్నించి అక్కడ కొంతకాలం ఉండటానికి అంగీకరించాడు. కానీ ఆయన అలా అక్కడ ఉంటే  ఇంక స్వర్గానికి, నరకానికి తేడా వుండదు. పాపులకు శిక్ష ఉండదు. ధర్మరాజు వల్ల ధర్మమే తల కిందులయ్యే ప్రమాదం ఏర్పడింది. ఎంతకాలానికీ ఆయన రాకపోయేసరికి దేవదూతలు అక్కడకి వచ్చారు. ‘‘ధర్మరాజా! మీరు ఇక బయల్దేరండి, మనం స్వర్గానికి వెళదాం’’ అన్నారు.

అప్పుడు ధర్మరాజు ‘‘నేను ఇక స్వర్గంలో అడుగు పెట్టలేను. నేను చేసిన పుణ్యమంతా ఈ నరకవాసులకి ధారపోశాను కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను’’ అన్నాడు. దేవదూతలు ‘‘ధర్మరాజా! మీరు కడు పుణ్యాత్ములు, ధర్మాత్ములు. మీరెంత పుణ్యం ధారపోసినా అది తరిగేది కాదు. ఇచ్చే కొద్దీ పెరిగేది.  మీ దయవల్ల ఈ నరక వాసులు కొంతకాలం పాటు ప్రశాంతత పొందారు. ఇక చాలు. దయచేసి మీరు బయల్దేరండి’’ అన్నారు. ధర్మరాజు సెలవు తీసుకుని స్వర్గయాత్రకు వెళ్ళాడు. సృష్టికి విరుద్ధంగా ఏ పనీ చెయ్యకూడదు. కానీ కొంత తను చెయ్య గలిగినది చేశాను’’ అని తృప్తి పడ్డాడు ధర్మరాజు.

ఉత్తములు ఎక్కడుంటే అక్కడ ఉల్లాస భరిత వాతావరణం ఉంటుంది. సాధుస్వభావులు ఉన్న చోట శాంతం మూర్తీభవిస్తుంది. ఆ పరిసరాలూ ప్రశాంతంగా వుంటాయి. పూవుల పరిమళం పూలచుట్టూనే వున్నట్లుగా మనిషి తత్వం అతన్ని చుట్టి వుంటుంది. అతనితోబాటే సాగుతుంది. మహానుభావుల పాద ధూళి కూడా పవిత్రమైనదే. కనుక అలాంటివారికోసం ఎదురు చూస్తుండాలి.–డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు