ధర్మానికి లోబడడమే ధైర్యం

13 May, 2019 00:51 IST|Sakshi

 రంజాన్‌ స్పెషల్‌

ధైర్యవంతులే జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. కాని ధైర్యంగా కార్యాలు తలపెట్టడమంటే ప్రమాదాలను ఆహ్వానించడమే! అయినప్పటికీ వెరపకుండా ధర్మానికి లోబడి ముందుకు వెళుతూ ఉంటే విజయం వెన్నంటి నడుస్తుంది.

ఒక ఊరిలో ఓ నిరుపేద కూలీ ఉండేవాడు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అనేక ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎన్నోకష్టాలు భరించాడు. అయినా ఏనాడూ కుంగిపోలేదు. ఎప్పుడూ సంతోషంగా, హాయిగా, నవ్వుతూ ఉండేవాడు. చూసేవాళ్లకు చాలా ఆశ్చర్యం వేసేది. ఇన్నిన్ని బాధలు భరిస్తూ కూడా ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నావూ.. అని అతడిని అడిగేవారు. దానికతను ‘‘అల్లాహ్‌ ఏ ప్రాణి పైనా దాని శక్తికి మించిన బాధ్యత మోపడు. మనం వద్దని అనుకున్నంత మాత్రాన రానున్నవి రాకమానతాయా? ఇదొక్కటి తెలుసుకుంటే చాలు’’ అని చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు.అందుకే, కష్టాల కరవాలం దూసుకొస్తున్నప్పుడు ధైర్యంగా, ఒడుపుగా దాని పిడిని పట్టుకోవాలంటారు పెద్దలు.

అలా కాకుండా భయపడుతూ, బెదురుతూ పట్టుకోబోతే పిడివైపుకు బదులు మరో భాగం చేతికి దొరికి గాయాలు కావచ్చు. ప్రమాదం ఏర్పడవచ్చు. ధైర్యసాహసాలు కూడా సరైన విధంగా, యుక్తిగా ప్రయోగిస్తేనే చక్కని సాధనంగా ఉపకరిస్తాయి. కష్టాలకు, కన్నీళ్లకు బెదిరిపోకుండా నిలకడను, శక్తిని ప్రసాదిస్తాయి. భయం, పిరికితనం అన్నవి మనిషిని జీవచ్ఛవంగా మారుస్తాయి. ఉత్సాహం నీరుగారి పోతుంది. ధైర్యసాహసాలంటే మరేమిటోకాదు. మనిషి ధర్మానికి కట్టుబడి జీవించడం. తన విధి, బాధ్యతలను విలువైనవిగా గుర్తించడం. ఏదీ సాధించలేకపోవడానికి, ఏదో ఒకటి సాధించడానికి మధ్యన ఉన్న బేధమే ధైర్యం. మనిషికి అటువంటి తర్ఫీదునిచ్చి ధర్మానికి బద్ధునిగా చేస్తుంది రమజాన్‌
 – మదీహా 

మరిన్ని వార్తలు