పురుషాహంకారంపై శూలం

13 May, 2019 00:41 IST|Sakshi

అమ్మతల్లులు ఊరినే కాదు స్త్రీలను కూడా కాపాడతారు.అమ్మ తల్లులు స్త్రీని శక్తిమంతం చేసేందుకు గ్రామాలలో వెలుస్తారు.అమ్మతల్లుల్లో అంతులేని దయ ఉంటుంది.కాని – దుష్టశక్తులపై అంతే తిరుగుబాటు ఉంటుంది.స్త్రీ తిరగబడితే మగవాడి పెత్తనం..అంతరిస్తుందని చెప్పే అంతరార్థమూ గంగజాతరలో ఉంది.

తిరుపతి కొండంత కొండ, శ్రీ వేంకటేశ్వరుడంత దేవుడు, పేరూరు బండంత బండ, అవిలాల చెరువంత చెరువు, గంగమ్మ జాతరంత జాతర ఉండవని తిరుపతి చుట్టుపక్కల జనశృతి. కొండ మీద బృహ్మోత్సవాలు వేంకటేశ్వరుడి వేడుకైతే కొండ కింది గంగ జాతర గంగమ్మ ఉత్సవం. భక్తులకు అది ఎంత ఆనందకరమో ఇదీ అంత భక్తి తుల్యం. గ్రామదేవతల పట్ల ప్రజలకు ఉండే మక్కువకు, అనాది భక్తికి సంకేతం గంగ జాతర. 

మనిషే దేవత దేవతే మనిషి
గ్రామాల పొలిమేరలను అమ్మతల్లులు కాపు కాచి ఉండటం భారతీయ సంప్రదాయంలో ఆచారం. వందల వేలాది గ్రామదేవతలు భారతదేశంలో గ్రామ పొలిమేరల్లో, గ్రామాల్లో కొలువై తమను చల్లగా చూస్తుంటారని ప్రజల విశ్వాసం. తిరుపతిలో అనాదిగా ఎందరో గ్రామదేవతలు కొలువై ఉన్నారు. వీరిలో గంగమ్మది ప్రథమ స్థానం. ఈమె తిరుపతికి మూడు కిలోమీటర్ల దూరంలో అవిలాలలో పుట్టిందని ప్రజల విశ్వాసం. ఆమె గుడి తిరుపతి ఆర్టీసి బస్టాండ్‌ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతం చెరువుగా ఉండేది. తాళ్లపాక అన్నమాచార్యులు తిరుపతి వచ్చి శ్రీవేంకటేశ్వరుడిని సేవించాక ఆయనకు ఇనాముగా ఈ చెరువు, భూమి దక్కాయి.

అందువల్ల అప్పటికే అక్కడ వెలిసి ఉన్న గంగమ్మ చెరువు గట్టు గంగమ్మగా కాలక్రమంలో తాళ్లపాక గంగమ్మగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ గంగమ్మ సోదరి అయిన చిన్న గంగమ్మ గుడి నేటి తిరుపతి తుడా కార్యాలయం దగ్గర ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో తాతయ్య గుంట అనే నీటి గుంట ఉండటం వల్ల ఈమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం గంగ జాతర అవిలాల గ్రామంతో మొదలయ్యి ఈ తాతయ్య గుంట గంగమ్మ గుడి కేంద్రంగానే సాగుతోంది. 

ఎండల్లో పండగ
గంగ జాతర ఎప్పుడూ మే ఎండల్లో ఉంటుంది. దీనికి కారణం గంగమ్మ జన్మదినమైన చైత్ర మాసం (చిత్ర నెల) చివరి వారంలో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ కావడమే. ఈ జాతర జరిగే రెండు వారాలకు ముందే అవిలాల గ్రామంలో గంగమ్మ గద్దె మీద సద్ది మొదలవుతుంది. తిరుపతిలో జాతర మొదలయ్యే ముందురోజు రాత్రి అవిలాల గ్రామస్తులు, పెద్దలు గంగమ్మ సారె తీసుకొచ్చి ఊరి పొలిమేరలో చిన గంగమ్మ గుడి నుంచి ఎదురొచ్చిన పెద్దలకు ఆ సారె అప్పగించి జాతర బాధ్యత అప్పజెబుతారు. అక్కడి నుంచి చిన గంగమ్మ ఆలయ నిర్వాహకులు జాతర మొదలుపెడతారు. ‘గంగమ్మ జాతర మొదలయ్యిందహో’ అని ఊరి నాలుగు దిక్కులా చాటింపు వేయడంతో జాతర  మొదలవుతుంది. జాతర జరిగినన్నాళ్లు ఇక ఊరివాళ్లు పొలిమేరలు దాటరు.

వేషాలు నిండిన ఊరు
చిత్తూరు జిల్లా అంతటా గంగ జాతర రెండు, లేదా మూడు రోజులు జరిగితే  తిరుపతిలో మాత్రం వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. గంగమ్మ గుడి తరపున వంశ పారంపర్యంగా కైకాల కులస్తులు, (కైకాల రెడ్లు), చాకలి కులస్తులు మిరాశీదారులుగా నిలిచి వేషాలు ధరించి ఉత్సవాలలో భాగస్వాములవుతారు. వారితో పాటు భక్తులు కూడా అమ్మవారు వేసిన వేషాలు వేసుకొని తిరుగుతారు. పురుషులు స్త్రీ వేషం కడతారు. అమ్మవారి వేషం వేస్తానని మొక్కుకోవడం వేషం వేసి ఆ మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో  ఆరంభమయ్యే గంగజాతర మరుసటి మంగళవారం అర్థరాత్రి అమ్మవారి విశ్వరూపంలోని చెంప నరకడంతో ముగుస్తుంది.

అమ్మవారి చెంప మన్ను కోసం భక్తులు పోటీలు పడతారు. ఆ మన్ను మహిమాన్వితమైన కొన్ని రేణువులైనా నీటిలో కలుపుకొని తాగితే సర్వరోగాలు నివారణ అవుతాయని నమ్మిక. తెలుగువారు తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు చాలా చేస్తుంటారు. కాని తెలుగునాట జరిగే ఈ గంగజాతర ఒకసారైన దర్శించదగ్గది. ఆధ్యాత్మికత కోసమే కాదు, సాంస్కృతిక భిన్నత్వం తెలియడానికి కూడా ఈ ఘనమైన వేడుకను దర్శించాలి. గంగ జాతర రేపటితో ముగుస్తోంది.
పాటూరు సుబ్రమణ్యం, సాక్షి, తిరుపతి కల్చరల్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’