క్యాన్సర్‌ – చికిత్సలు 

21 Feb, 2019 00:41 IST|Sakshi

క్యాన్సర్‌ చికిత్సలు అన్నవి వయసు, క్యాన్సర్‌ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి కూడా ఈ చికిత్స విధానాలు మారుతూ ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్‌ టార్గెటెడ్‌ థెరపీ, ఫొటోడైనమిక్, లేజర్‌ థెరపీ, మాలిక్యులార్‌ టార్గెటెడ్‌ థెరపీ వంటి అనేక కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికి ఇవి ఖరీదైనవే అయినా మున్ముందు  కొంతవరకు తగ్గవచ్చు.  క్యాన్సర్‌ చికిత్స తీసుకునేవారికి గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు సరిగా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్‌ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ మందుల ప్రభావం మిగతా అవయవాల మీద కూడా ఉంటుంది కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు, నిర్ణీత కాల వ్యవధిలో బ్లడ్‌ టెస్ట్‌ వంటి పరీక్షలతో పాటు, ఆయా అవయవాల పనితీరును తెలుసుకునేందుకు అవసరమైన ఇతర పరీక్షలూ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే క్యాన్సర్‌ చికిత్సతో గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని, అవి ఫెయిల్యూర్‌ స్థితికి వెళ్లి, ఒక్కోసారి రోగి మరణించడం కూడా జరగవచ్చు. అందుకే క్యాన్సర్‌ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై వీటి దుష్ప్రభావం ఉండకుండా చూసేందుకు, వీలైనంతగా తగ్గించేందుకు ఇప్పుడు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్‌ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్‌ టార్గెటెడ్‌ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్‌ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్‌ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్‌ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. 

శస్త్రచికిత్స : రక్తానికి సంబంధించిన క్యాన్సర్‌ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను ముందే తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా చేయగలుగుతున్నారు. 

ఆ సందర్భాలివే... 
ప్రివెంటివ్‌ సర్జరీ : పెద్దపేగు చివరిభాగం (కోలన్‌)లో పాలిప్‌ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్‌ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 వంటి జీన్‌ మ్యుటేషన్‌ పరీక్షలతో క్యాన్సర్‌ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్‌ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. ఇవన్నీ ముందే అనుమానించి జాగ్రత్తపడటానికి చేసే శస్త్రచికిత్సలు. 

క్యూరేటివ్‌ సర్జరీ : క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో థెరపీ లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి.  
పాలియేటివ్‌ సర్జరీ : క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. ఒక్కోసారి ఇతర చికిత్సలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేలా కూడా, ఈ తరహా సర్జరీలను...  సపోర్టివ్‌ సర్జరీలుగా కూడా చేస్తారు. 
రిస్టోరేటివ్‌ (రీకన్‌స్ట్రక్టివ్‌) సర్జరీ: క్యాన్సర్‌ సర్జరీలలో క్యాన్సర్‌ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్‌నోడ్స్‌నీ, ఇతర కణజాలాన్నీ తొలగించడం జరుగుతుంది. కానీ బయటకు కనిపించే అవయవాలైన రొమ్ము, హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, ఆయా అవయవాల పనితీరు మెరుగుపడటానికీ, దాంతోపాటు రోగుల్లో ఆత్మన్యూనతా భావం రాకుండా ఉండటానికి శరీరంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్నీ, ఎముకలనూ సేకరించి, అలాగే వాటికి ఇతర మెటల్, ప్లాస్టిక్స్‌తో చేసిన ప్రోస్థటిక్స్‌ను ఉపయోగించి, ఈ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీలను చేస్తారు. వీటిని వెంటనే చేయవచ్చు లేదా చికిత్స పూర్తయ్యాక కూడా చేయవచ్చు. 
కీమోథెరపీ : క్యాన్సర్‌ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, గొంతు రంగుమారడం, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో థెరపీ అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ తాత్కాలికమే. ఒక్కోసారి చికిత్స పూర్తయ్యాక పూర్తిగా ఇంతకు ముందులాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఈ థెరపీని 1950వ సంవత్సరం నుంచి చేస్తున్నారు. దాదాపు వందరకాలకు పైగా ఉన్న ఈ క్యాన్సర్‌ మందులను పిల్స్, లిక్విడ్స్, రక్తనాళంలోకి ఇచ్చే మందులు (ఐవీ), ఇంజెక్షన్స్, చర్మంపైన రుద్దేమందులు, వెన్నులోకి, పొట్టలోకి ఇచ్చే ఇంజెక్షన్లు... ఇలా అనేక రకాలుగా ఇస్తుంటారు. క్యాన్సర్‌ కణాలను చంపడానికి, మళ్లీ మళ్లీ అది తిరగబెట్టకుండా ఉండటానికి ఈ మందులను రకరకాల కాంబినేషన్లలో కూడా ఇస్తారు. ఇటీవలి కొత్త టార్గెటెడ్‌ థెరపీలతో కొంతవరకు సైడ్‌ఎఫెక్ట్స్‌ తగ్గినా ఈ చికిత్సలు అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. 

రేడియేషన్‌ థెరపీ : వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్‌ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒక్కో క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్సల వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. పై చికిత్సలే గాక... స్టెమ్‌సెల్‌ థెరపీలో, సర్జరీలలో లేజర్‌ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్‌ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్‌ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనోథెరపీలు, మాలిక్యులార్‌ టార్గెటెడ్‌ థెరపీలు క్యాన్సర్‌ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. 
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001

మరిన్ని వార్తలు