రాత్రికి రాత్రి.. రాయి రత్నమై పోతుందా?

1 Jul, 2018 02:26 IST|Sakshi

అక్కరలేని వస్తువును దగ్గర పెట్టుకోవడం ప్రమాద హేతువు. అంతంత ఖరీదైన సెల్‌ఫోన్లు, మోటారు సైకిళ్లు, కార్లు మీకెందుకు? మీరు నా చేతికి ఒక దుడ్డు కర్ర ఇచ్చారనుకోండి. నేను దాన్ని తీసుకుని పక్కనబెట్టుకుని ఊరుకోను. కొంతసేపైన తరువాత... ఒకసారి దాన్ని పట్టుకుని తిప్పాలనిపిస్తుంది, దేన్నైనా గుచ్చాలనిపిస్తుంది, ఏదో పురుగు దానిమానాన అదిపోతుంటే దాన్ని కొట్టి, అది గిలాగిలా కొట్టుకొంటుంటే  చూడాలనిపిస్తుంది. అంటే హింసా బుద్ధిని ప్రేరేపిస్తుంటుంది. మనిషిని ఆకర్షించి పాడుచేసే వాటిపట్ల నిగ్రహంతో ఉండాలి.

అత్యవసర పని మీద, అవసరం మేరకు కారులో వెళ్లడం, వేగంగా చేరుకోవడం అవసరమే. కానీ అవసరమైనప్పుడు వేగాన్ని పెంచగలిగే యాక్సిలరేటర్‌ కారుకు ఎంత అవసరమో, అత్యవసరంగా ఆపవలసి వచ్చినప్పుడు దానిని ఆపడానికి బ్రేకులు కూడా అంతే అవసరం. యాక్సిలరేటర్, బ్రేకు రెండూ సవ్యంగా పనిచేస్తేనే కారువల్ల, మన ప్రయాణంవల్ల మన ప్రయోజనం నెరవేరుతుంది. కానీ ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడం నాకు చేతకాదు అన్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఆ వేగమే అతని వృద్ధికి ప్రమాద కారణమవుతుంది. అందువల్ల అక్కరలేని వాటి జోలికి వెళ్లకండి. మీ తల్లిదండ్రులు మీ చదువుకోసం, మీ ఫీజులకోసం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి కూడబెట్టిన ధనాన్ని దుర్వినియోగం చేయకుండా నిగ్రహించుకోవడం మీకు తెలిసి ఉండాలి.

అబ్దుల్‌ కలాం... అంతెందుకు మీ యువత ఎక్కువగా అభిమానించే సచిన్‌ టెండుల్కర్‌లాంటి వాళ్లను గౌరవించడం మంచిదే. ప్రేమించడం, అభిమానించడం మంచిదే. కానీ వారు అలా గొప్పవాళ్లు కావడానికి ఏం చేసారో తెలుసుకుని ఆ మార్గంలో వెళ్లకపోవడం మాత్రం నేరం. సచిన్‌ టెండుల్కర్‌ భారతరత్న రాత్రికి రాత్రి అయిపోలేదు. తనకి బంతి వేసేవాడు లేకపోతే పైన కమ్మీకి తాడేసి బట్టలో బంతిచుట్టి అది ఊగుతూ ఉంటే ఒక్కో దిశలో ఒక్కో రకంగా వస్తున్న బంతిని ఎన్ని రకాలుగా ఆడవచ్చో ఏకాగ్రతతో అభ్యాసం చేశాడు. చుట్టూ 50మంది బౌలర్లను నిలిపి, వాళ్ల గురువు గంటలకొద్దీ బంతులు వేయిస్తుంటే అదే శ్రద్ధతో, అదే నిష్ఠతో రోజులకొద్దీ ఆడేవాడు.

కిక్కిరిసిన బస్సుల్లో అందరూ విసుక్కుంటున్నా, తిడుతున్నా సహిస్తూ కిట్‌ భుజాన మోసుకుంటూ దూరాభారాలు లెక్కచేయకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన గమ్యాన్ని ఎప్పటికో చేరుకున్నాడు. ఆటలో నైపుణ్యంతో పాటు జీవితంలో అత్యుత్తమమైన సంస్కారాన్ని కూడా దానితోపాటు అలవర్చుకోబట్టే వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. తను ఇల్లు కట్టుకునే సందర్భంలో ఆ వీధిలో ఇరుగుపొరుగువాళ్లకు జరిగే అసౌకర్యానికి బాధపడుతూ ‘నేను మీలో ఒకడిగా ఉండటానికి మీ వీధికి వచ్చి, నిర్మాణం తాలూకు శబ్దాలు, ఇతరత్రా పనులతో ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి.

అలాగే మీరు సహృదయంతో అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతల’ంటూ ఇంటింటికీ వెళ్లి ఒక ఉత్తరం ఇచ్చాడు. అత్యున్నత స్థానాలకు చేరుకుని కూడా జీవితపు మూలాలను, మానవత్వపు విలువలను మరవకపోవడం అంటే ఇదే. అటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవడం వేరు. వారి నుండి స్ఫూర్తి పొంది, అదే నిబద్ధతతో జీవితంలో నిలదొక్కుకోవడం వేరు. నిర్ధిష్ట లక్ష్యంతో, దృఢ సంకల్పంతో, కఠోర శ్రమతో ముందుకు అడుగేస్తే,... మీ మాతాపితలే కాదు, మీ మాతృదేశం కూడా మీలాంటి రత్నాలను చూసుకుని మురిసిపోతుంది.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు