మెగా చరణం

21 Aug, 2016 02:58 IST|Sakshi
మెగా చరణం

రేపు చిరంజీవి పుట్టినరోజు


శరణం నీ దివ్య చరణం..
నీ నామమెంతో మధురం..
చిరంజీవి నామంలో ఉన్న మాధుర్యాన్ని చరణ్ తలుచుకున్నారు. పాటలో పల్లవి తర్వాత వచ్చేది చరణం  మెగా తర్వాత వచ్చే చరణమే చెర్రీ (రామ్‌చరణ్) తండ్రి చరణ ధూళిని నుదుటన దిద్దుకున్న ఒక కొడుకు అనుభవాల పరిమళాలు మీకోసం... మెగాస్టార్ 61వ జన్మదినం సందర్భంగా ‘సాక్షి ఫ్యామిలీ’ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఈ ఇంటర్వ్యూని మీతో పాటు ఫస్ట్ టైమ్  చిరంజీవి కూడా చదవబోతున్నారు...  ఇది తండ్రికి కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్.

 

చిరంజీవిగారు యాజ్ ఎ ఫాదర్.. సన్‌గా మీరేం చెబుతారు?
రామ్‌చరణ్: బెస్ట్ డాడ్ అని సింపుల్‌గా చెప్పలేను. ఎందుకంటే మా నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. ఇంట్లో ఆయన మాకు పెద్ద పెద్ద రోల్స్‌లో కనిపిస్తారు. ఆయన్ని గమనిస్తే చాలు... చాలా విషయాలు నేర్చేసుకోవచ్చు. ఇంతకంటే బెస్ట్ పర్సన్‌ని డాడ్‌గా కోరుకోలేం.

     
మీ చిన్నప్పుడు చిరంజీవిగారు ఫుల్ బిజీగా ఉండేవారు కదా... మిస్సయిన ఫీలింగ్ ఉండి ఉంటుందేమో?
బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా మిస్సయ్యేవాళ్లం. మేం నిద్ర లేచేసరికే డాడీ షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. అప్పట్లో చెన్నైలో ఉండేవాళ్లం. లోకల్‌లో షూటింగ్ అంటే నాన్నగారు లంచ్‌కి ఇంటికే వచ్చేవాళ్లు. మేం స్కూల్‌కి వెళ్లేవాళ్లం కాబట్టి, కలసి డిన్నర్ చేసేవాళ్లం. చాలా సరదాగా కబుర్లు చెబుతారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు టేబుల్ ఏదో వెలితిగా అనిపించేది. అందరం కలసి రోజుకి ఒక్క ‘మీల్’ అయినా చేయాల్సిందే. అప్పట్నుంచీ ఇప్పటి  వరకూ ఆ విషయంలో మార్పు రాలేదు.

     
పిల్లలు తప్పు చేసినప్పుడు మీ నాన్నగారు ఖండించే విధానం ఎలా ఉండేది.. మీరెప్పుడైనా దెబ్బలు తిన్నారా?
(నవ్వుతూ). పెద్దగా కొట్టేవారు కాదు. ఒకే ఒక్కసారి మాత్రం కొట్టారు. ఎందుకు కొట్టారని మాత్రం అడక్కండి. మామూలుగా ఎవరు తప్పు చేసినా పిల్లలు ముగ్గుర్నీ కూర్చోబెట్టి మాట్లాడేవారు. తప్పు ఎందుకు చేయకూడదో చెప్పేవారు. ఆ మాటలు మైండ్‌కి బాగా ఎక్కేసేవి.

     
మీరు స్కూల్‌కి బాగానే వెళ్లేవారా.. మారాం చేస్తే అమ్మానాన్న తిట్టి పంపించేవాళ్లా?
(గట్టిగా నవ్వుతూ)... సండే అంతా చాలా బాగుండేది. మండే అనగానే ఏదో తెలియని వికారం. మొహంలో కళే ఉండేది కాదు. ‘ఐ వాజ్ నాట్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్’. స్కూల్ ఎలా ఎగ్గొట్టాలా? అని ఆలోచించేవాణ్ణి. అమ్మా నాన్నా తిడతారనే భయంతో వెళ్లేవాణ్ణి. డాడీ ఉదయం ఐదున్నరకే షూటింగ్‌కి వెళ్లిపోయారు. నేను స్కూల్‌కి రెడీ అయ్యే సమయానికి ఆయన షూటింగ్ లొకేషన్లో రెండు, మూడు షాట్స్ ముగించేసేవారేమో. ఆయనతో మార్నింగ్ ఇంటరాక్షన్ అనేది దాదాపు మిస్సయ్యేవాళ్లం.

     
మీ నాన్నగారు ఎలాంటి ఫుడ్ తీసుకునేవారు.. పిల్లలు ఎలాంటివి తినాలి? అని చెప్పే తీరిక ఆయనకు ఉండేది కాదేమో?
అప్పట్లో పెద్ద పెద్ద డైటీషియన్లు ఉండేవారు కాదు. పర్సనల్ ట్రైనర్స్ కూడా ఉండేవారు కాదు. అందుకని ఏది మంచో చెడో స్వయంగా తెలుసుకుని అదే తినేవారు. ఇప్పట్లో మాకున్నంత ఎక్స్‌పోజర్ అప్పుడు ఎక్కడ ఉంది? ఇంట్లో ఏం వండినా అది హెల్దీ అనేవారు. ఆల్‌మోస్ట్ హోమ్‌ఫుడ్ తినేవారు. మేమూ అంతే.

     
హోటల్స్‌కి తీసుకు వెళ్లేవారా?

అలాంటి విషయాల్లో అస్సలు తక్కువ చేసేవారు కాదు. చెన్నైలో చోళా షెరటన్ అని హోటల్ ఉండేది. ఎక్కువగా అక్కడికి వెళ్లేవాళ్లం. ఖాళీ దొరికినప్పుడు బయటికి తీసుకెళ్లేవారు. డాడ్ మంచి ఫ్యామిలీ మ్యాన్.

     
చిరంజీవిగారు అప్పుడప్పుడు కిచెన్‌లో గరిటె కూడా తిప్పుతుంటారట.. ఆయన చేసేవాటిలో టేస్టీ ఐటమ్ ఏదైనా?

కుకింగ్ అంటే నాన్నకి చాలా ఇష్టం. అదో రిలాక్సేషన్ అంటారు. ఏదైనా తింటున్నప్పుడు ఎంత ఉప్పు వేశారు? ఎంత కారం వేశారు? అని విడమర్చి మరీ చెబుతారు. నాన్నగారు చేసే వాటిలో టిఫిన్స్‌లో ‘ఉప్మా’ బెస్ట్. రొయ్యలు-వంకాయ, వంకాయ కూర అదరగొడతారు. అప్పుడెప్పుడో మైసూర్ వెళ్లినప్పుడు ఓ దోసె తిన్నారు. అది నచ్చి, హోటల్‌వాళ్లని రెసిపీ అడిగితే, చెప్పనన్నారట. అలాంటి దోసెలు తయారు చేయాలని ఇంట్లో చాలాసార్లు ట్రై చేశారు. చివరికి సక్సెస్ అయ్యారు.

     
బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ అయ్యారు.. ఆయన పడిన కష్టాలు మీకు గుర్తుండే ఉంటాయేమో?
నాన్నగారి కష్టాలు తెలుసు. ఆయనతో పోల్చుకుంటే కష్టంలో ‘క’ అనే అక్షరాన్ని కూడా మేమింకా పూర్తి చేయలేదనిపిస్తోంది. ‘క’ నుంచి ‘ఱ’ వరకూ నాన్నగారు మొత్తం పూర్తి చేసేసి, మళ్లీ నటుడిగా ‘క’ మొదలుపెట్టారు. నాన్నగారు తీరిక లేకుండా షూటింగ్స్ చేయడం చూసి, మనం కూడా ఇంత కష్టపడాలి అనుకునేవాణ్ణి. నాకు తెలిసి ఆయన కష్టాన్ని రీ-క్రియేట్ చేయడం కష్టం. కొంత చేసినా చాలు. నాన్నగారు ఫుల్ ఎనర్జిటిక్. అంత ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతామా? అనే డౌట్ కలుగుతుంటుంది.

     
మీ డాడీలా మీరూ బాగా డ్యాన్స్ చేస్తారు.. అయితే ఫార్టీ ప్లస్ ఏజ్‌లో చేసిన సినిమాల్లోనూ ఆయన బాగా డ్యాన్స్ చేయడం విశేషం...
డాడీతో నన్ను నేనెప్పుడూ పోల్చుకోను. డ్యాన్సుల గురించి మాట్లాడుతోంటే నాకో విషయం గుర్తొస్తోంది. పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఠాగూర్’ సినిమాని అంత సులువుగా మర్చిపోలేం. ఆ సినిమా కోసం ‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి..’ పాట తీస్తున్నప్పుడు నేను కూడా లొకేషన్లో ఉన్నాను. నాన్న డ్యాన్స్ చేస్తుంటే.. మోకాలి దగ్గర ఏదో సౌండ్ వచ్చింది. నేను, వినాయక్‌గారు, మిగతావాళ్లు కంగారుపడ్డాం. ‘డాడీ’ అని దగ్గరకు వెళ్లి, పట్టుకున్నాను. బాగానే నొప్పి అనిపించినట్లుంది. బయటకు చెప్పలేదు. వెంటనే ఐస్ ప్యాక్ పెట్టాం. పది నిమిషాల తర్వాత మామూలుగా డ్యాన్స్ చేశారు. అది చూసి, నాకు ఏడుపొచ్చింది. వినాయక్‌గారి కళ్లు కూడా చెమర్చాయి. ఆ తర్వాత మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఆ విషయం చాలామందికి తెలియదు. నాన్నగారు చేసిన డ్యాన్సుల్లో కూడా తేడా ఏం కనిపించలేదు. అంత బాగా చేశారు. ఒక ఆపరేషన్ జరిగి, 50 ఏళ్లకు దగ్గరైన సమయంలో అలా డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు. అందుకే అంటున్నా.. నాన్నగారిని చూసి చాలా నేర్చుకోవాలని.

     
బహుశా మీ రోల్ మోడల్ మీ నాన్నగారేనేమో?
యస్... నాన్నగారే. పిల్లలందర్నీ చాలా ప్రేమగా చూసుకుంటారు. వైఫ్‌తో ఫ్రెండ్లీగా ఉంటారు. అమ్మానాన్న ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే... మనం కూడా ఇలా ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడైతే ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి ఉంటారో అప్పుడు ఆ ఇంట్లో ఉండేవాళ్ల లైఫ్ ఈజీ అవుతుంది. ఆ పర్సన్‌ని చూసి, చాలా విషయాల మీద అవగాహన వచ్చేస్తుంది.

     

8 ఏళ్ల తర్వాత చిరంజీవిగారు హీరోగా మళ్లీ మేకప్ వేసుకున్నారు కాబట్టి, ఈ బర్త్‌డే మీ ఇంటిల్లిపాదికీ స్పెషల్ కదా?
కచ్చితంగా అండి. ఇక వరుసగా సినిమాలు చేస్తారు. అది వేరే విషయం. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆయన హీరోగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా, ఎమోషనల్‌గా అనిపించింది. ‘పాత చిరంజీవిగారు’ కనిపించారు. నాన్నగారి నవ్వు చూసినప్పుడు లోపల నుంచి చాలా ఆనందంగా నవ్వినట్లనిపించింది. ఏదో బలవంతంగా ఇన్నేళ్లూ ఆయన్ను వేరే దాంట్లోకి తీసుకెళ్లినట్లు అనిపించింది. ‘హీ ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్ ఎగైన్’.

     
షూటింగ్ స్పాట్‌కి మీరు వెళుతున్నారా?

ఇప్పటికి నాలుగైదుసార్లు వెళ్లాను. డెరైక్టర్ రెడీ అనగానే కెమెరా ముందుకెళ్లిపోతారు. ఈ మధ్య చాలామంది యాక్టర్స్ రెడీ అన్న పది నిమిషాలకు వస్తారు. కానీ, వంద సినిమాలకు పైగా చేసి, 150వ సినిమా కూడా చేస్తూ ఇంకా మొదటి సినిమాలా డాడీ ఎగ్జైట్ కావడం చూసి, ఆయనెందుకు ఈ స్థాయికి వచ్చారో అర్థమైంది.

     
ఫైనల్లీ... బర్త్‌డేకి మీరేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు?

నాన్నగారి కోసం పెయింటింగ్ వేయించాను. అది ఆయనకు తెలియదు. ఆ పెయింటింగ్ ఏంటో ఇప్పుడు చెప్పలేను. నాన్నగారికి ఇచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌లో పెడతాను. ‘లక్కీ టు హావ్ ఎ ఫాదర్ లైక్ హిమ్’. నాన్నగారికి పర్సనల్‌గా బర్త్‌డే విషెస్ ఎలానూ చెబుతాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రూపంలో ఒకరోజు ముందే చెబుతున్నా.


మై డాడ్... మై హీరో
కష్టపడి పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలని ప్రతి పిల్లలకీ ఉంటుంది. ఏమిచ్చినా కన్నవాళ్ల రుణం తీర్చుకోలేం. అయినా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నేనే పని చేయాలనుకున్నా మా నాన్నగారు నాకు అండగా నిలుస్తారు. అలాంటి ఆయన కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఆయన 150వ సినిమా నిర్మించడం. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ఆరంభించడం, నాన్నగారి సినిమాతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది.  ‘డాడీ యు ఆర్ మై హీరో.. మై రోల్ మోడల్. మన కుటుంబం కోసం మీరు చేసిన అన్నింటికీ థ్యాంక్స్ అనేది చిన్న పదం. లవ్ యు డాడ్’.    


- డి.జి. భవాని

మరిన్ని వార్తలు