ఇంటిని శుభ్రం చేయడం ఆరోగ్యానికి హానికరం

17 Feb, 2018 00:27 IST|Sakshi

అధ్యయనం 

‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ప్రభుత్వాలు చట్టబద్ధంగా హెచ్చరికలు జారీ చేసే ప్రభుత్వాలు ఇకపై ‘ఇంటిని శుభ్రం చేయడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికలను జారీ చేయాల్సి ఉంటుందేమో! ఇంటిని తుడవడం, గచ్చు మీద మురికిని తడిగుడ్డతో లేదా మాప్‌తో తుడవటం, గచ్చు మీద మొండి మరకలను తొలగించడానికి యాసిడ్, డిటర్జెంట్లు వంటివి వేసి రుద్దడం వంటి పనులు సైతం ఊపిరితిత్తులపై పొగతాగడంతో సమానమైన హాని కలిగిస్తాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

రోజూ ఇరవై సిగరెట్లు తగలేసే పొగరాయుళ్ల ఊపిరితిత్తులు ఏ స్థాయిలో పాడైపోతాయో, రోజూ ఇంటిని శుభ్రం చేసే మహిళల ఊపిరితిత్తులు కూడా అదే స్థాయిలో దెబ్బతింటాయని నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బెర్జెన్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వారు తమ పరిశోధనలో భాగంగా 6,235 మంది మహిళలపై అధ్యయనం జరిపారు. వారిలో రోజూ ఇంటిని శుభ్రం చేసే అలవాటు ఉన్న మహిళలు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే మహిళలపై వైద్య పరీక్షలు నిర్వహించగా, వారి ఊపిరితిత్తులు దాదాపు పొగతాగే వారి ఊపిరితిత్తుల మాదిరిగానే తయారైనట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు