పల్మునాలజీ కౌన్సెలింగ్

3 Jul, 2015 23:29 IST|Sakshi
పల్మునాలజీ కౌన్సెలింగ్

బాబుకు ఎప్పుడూ పొడి దగ్గే, ఏం చేయాలి?
 మా అబ్బాయి వయసు 16 ఏళ్లు. వాడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. శ్వాస అందడం లేదు. కొద్దిగా జ్వరం కూడా వస్తోంది. మా డాక్టర్‌ను సంప్రదిస్తే వాడిది ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ అని చెప్పారు. అంటే ఏమిటి?
 - ఖాసీమ్, మహబూబ్‌నగర్

ఆస్తమా వ్యాధులలో అనేక రకాలు ఉంటాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా అనేది ఆస్తమాలోనే ఒక రకం. దీనిలో బాధితుడికి ఎప్పుడూ పొడిదగ్గు వస్తూ ఉంటుంది. అంటే తెమడ పడదన్నమాట. వీళ్లకు పిల్లికూతలు లాంటి సంప్రదాయ ఆస్తమా లక్షణాలు కనపడవు. దీన్నే కొన్నిసార్లు ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలం వచ్చే దగ్గు) అని కూడా అంటారు. అంటే ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల పైగానే కొనసాగుతుంది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దగ్గు వస్తూనే ఉంటుంది. రాత్రివేళ ఎడతెరపి లేని దగ్గు వల్ల నిద్రపట్టదు. ఇలాంటి రోగుల్లో వాళ్లకు సరిపడని దానికి ఎక్స్‌పోజ్ అయితే అది ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు ఘాటైన వాసనలు, దుమ్ము, చల్లగాలి వంటివి. ఈ కాఫ్ వేరియెంట్ ఆస్తమా ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు తర్వాతి దశలో వస్తాయన్నమాట. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని వస్తువులు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలైన దాఖలాలు కొన్ని ఉన్నాయి. అలాగే గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. ఆ డాక్టర్ మీ కుమారుడిని అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకొని, మీ కుటుంబ వ్యాధుల చరిత్రను అధ్యయనం చేసి, శ్వాసించే తీరును విని వ్యాధి నిర్ధారణా, తగిన చికిత్సా చేస్తారు.
 

మరిన్ని వార్తలు