ఇంటిపై ఆరోగ్య పంట!

17 Sep, 2019 06:04 IST|Sakshi
డాబాపై అల్లుకున్న కూరగాయ తీగజాతి మొక్కలు

ఇంటి పంట

గ్రామాలు కూడా కాంక్రీట్‌ జంగిళ్లుగా మారిపోతున్న నేపథ్యంలో రసాయనిక పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, ఆకుకూరలను తమ ఇంటిపైన సిమెంటు మడుల్లో పండించుకుంటున్నారు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన బిళ్లా వెంకటేశ్వరరావు(93934 36555), రామతులసి దంపతులు. బీసీ కాలనీలో 3 సెంట్ల స్థలంలో మూడేళ్ల క్రితం వారు రెండంతస్తుల ఇల్లు నిర్మించుకున్నారు. సేంద్రియ ఇంటిపంటల సాగు పద్ధతులు, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పత్రికలు, టీవీ ప్రసారాల ద్వారా తెలుసుకున్న వెంకటేశ్వరరావు ఇంటి పంటల సాగుపై దృష్టి పెట్టారు.

రెండేళ్ల క్రితం డాబాపైన రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు, మూడు–పది అడుగుల పొడవైన సిమెంటు తొట్లు కట్టించారు. వాటి పైన కొంత ఎత్తులో తుప్పుపట్టని తీగతో పందిరి ఏర్పాటు చేయించుకున్నారు. ఎర్రమట్టి, నల్లమట్టి, మాగిన పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని నింపి, అందులో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డాబాపై గోరుచిక్కుడు, టమాట, కాకర, బెండ, వంగ, మిర్చితోపాటు పొట్ల, బీర, సొర వంటి తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, గోంగూరను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకొని తాజాగా వండుకొని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తుండడం విశేషం.                          
– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు

బిళ్లా వెంకటేశ్వరరావు, రామతులసి
 

మరిన్ని వార్తలు