లాకర్ తీసుకుందామా...

18 Apr, 2014 22:52 IST|Sakshi
లాకర్ తీసుకుందామా...

రమేష్ చాలా జాగ్రత్తపరుడు. ఆర్థిక విషయాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. ఇలా ఉండగా.. ఒకసారి దగ్గరి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో రమేష్ కుటుంబం మొత్తం వెళ్లాల్సి వచ్చింది. ఇంటికీ, బీరువాలకు తాళాలు గట్రా అన్ని పకడ్బందీగానే వేసుకుని వెళ్ళారు. ఫంక్షన్ చూసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో గాభరాపడుతూ లోపలికెళ్లారంతా. తీరా చూస్తే బీరువాలో దాచుకున్న బంగారు నగలు, కొంత డబ్బు అంతా కూడా దొంగలు దోచుకెళ్లారని అర్థమవడంతో గొల్లుమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చోరీ అయినవి చేతికి ఎప్పుడొస్తాయో తెలియదు. ఇలాంటి ఉదంతాలు.. నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇలా దోపిడీ దొంగల భయం పెరిగిపోతున్న నేపథ్యంలో కాస్త మెరుగైన భద్రతను అందించే బ్యాంకు లాకర్లకు డిమాండ్ పెరుగుతోంది. కొండొకచో బ్యాంకులకు కూడా దొంగతనాల బెడద ఎదుర్కొంటున్నప్పటికీ.. విలువైన వాటిని భద్రంగా దాచుకునేందుకు ఇంటితో పోలిస్తే బ్యాంకు లాకర్లే కొంత సురక్షితమైనవిగా ఉంటున్నాయి. అందుకే వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీటి ప్రాధాన్యత గుర్తించే ఆంధ్రా బ్యాంకు లాంటివి ప్రత్యేకంగా లాకర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి.
 
బ్యాంకు ఖాతాల్లో డబ్బు దాచుకున్నట్లే.. విలువైన ఆభరణాలు, వస్తువులు, కీలకమైన పత్రాలు మొదలైన వాటిని దాచుకునేందుకు బ్యాంకులు లాకర్లను అద్దెకి ఇస్తుంటాయి.  వీటిని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా లేదా సంస్థల పేరు మీద కూడా తీసుకోవచ్చు. డిమాండ్ గణనీయంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం బ్యాంకు లాకర్లు పొందడమన్నది కష్టసాధ్యంగా మారింది. చాలా బ్యాంకుల్లో వెయిటింగ్ లిస్టు ఉంటోంది.

ఇందులోనూ మళ్లీ ప్రొఫైల్‌ని బట్టి కీలకమైన ఖాతాదారులకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. లాకరు ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకు శాఖలో ఖాతా కలిగి ఉండాల్సి వస్తుంది. అలాగే నిర్దిష్ట మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని కూడా బ్యాంకులు అడుగుతున్నాయి. లాకరు తీసుకునేటప్పుడు జాయింట్‌గా గానీ లేదా నామినేషన్ పద్ధతిలో గానీ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగినా.. లాకర్లలో ఉన్నవి వారసులకు చేరడంలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
 
సాధారణంగా ప్రతి లాకరుకు తాళం చెవులు రెండు ఉంటాయి. ఒకటి బ్యాంకు దగ్గర, రెండోది లాకరు అద్దెకు తీసుకున్న వారి దగ్గర ఉంటుంది. ఈ రెండింటినీ ఉపయోగిస్తేనే లాకరు తెరుచుకుంటుంది. తాళం చెవిని పోగొట్టుకున్నారంటే .. మొత్తం తాళాన్నే మార్చాల్సి వస్తుంది. అందుకయ్యే ఖర్చునంతా కూడా భరించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 12 సార్ల దాకా లాకరును తెరిచి చూసుకునేందుకు ఉచితంగా అనుమతిస్తున్నాయి. ఎస్‌బీఐలో అయితే.. 12 సార్లకు మించితే వెళ్లిన ప్రతిసారీ రూ. 51 కట్టాల్సి ఉంటుంది.
 
ఒక్కసారైనా..

లాకర్ తీసుకున్న తర్వాత కనీసం ఏడాదికోసారైనా బ్యాంకుకు వెళ్లి, లాకరును తెరిచి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాది గడిచినా అలా చేయకపోతే ఆ లాకర్‌ను రద్దు చేసే అధికారం బ్యాంకులకు ఉంది. అయితే, నేరుగా రద్దు చేసే అధికారం లేదు. ముందుగా ఒక సంవత్సరం నుంచి మీ లాకర్‌లో లావాదేవీలు జరగటం లేదు కాబట్టి రద్దు చేయాలనుకుంటున్నామంటూ ఖాతాదారుకు సమాచారం అందించాలి. ఒకవేళ ఖాతాదారు మరణిస్తే వారసులకు తెలపాలి. వీరెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆ అకౌంట్‌ను పరిచయం చేసిన వ్యక్తి ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేయాలి.

ఇవన్నీ విఫలమైతే వాడకంలో లేని అకౌంట్‌గా పరిగణించి ప్రత్యేక లెడ్జర్‌ను తయారు చేయడం ద్వారా ఆ లాకర్‌ను రద్దు చేసి వేరే వారికి ఇవ్వొచ్చు. ఇలా చేయకుండా సకాలంలో అద్దె చెల్లించలేదనో, లేక మొక్కుబడిగా సమాచారం అందించో, లాకర్‌ను రద్దు చేసిన అనేక సందర్భాల్లో వినియోగదారుల ఫోరంలో ఖాతాదారులదే పై చేయి అయ్యింది.
 
వివిధ పరిమాణాలు..
 
చిన్నవి, మధ్యస్థాయి, పెద్దవి, అతి పెద్దవంటూ లాకర్లు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. సాధారణంగా 864 ఘనపు అంగుళాల నుంచి 3,456 ఘనపు అంగుళాల దాకా వివిధ సైజుల్లో ఇవి లభిస్తాయి. లాకర్ల పరిమాణం, బ్యాంకు శాఖలు ఉన్న ప్రాంతాలను బట్టి అద్దెలు మారుతుంటాయి. పెద్ద నగరాల్లో ఎక్కువగాను.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాయిలు కాస్త తక్కువగాను ఉంటాయి.
 
అద్దెలు..వ్యయాలు..
 
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) చిన్న సైజు లాకరుకు గ్రామీణ ప్రాంతాల్లో అద్దె ఏడాదికి రూ. 764 కాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 1,019గా ఉంది. లాకరు సైజు, ప్రాంతాన్ని బట్టి కిరాయి గరిష్టంగా రూ. 5,093 దాకా ఉంది. అదే ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. వార్షికంగా రెంట్ రూ. 1,250 నుంచి రూ. 10,000 దాకా (లాకర్ సైజు, ప్రాంతాన్ని బట్టి) ఉంది. సిటీ బ్యాంకు లాంటి వాటిల్లో గరిష్టంగా రూ. 40,000 దాకా కూడా అద్దె ఉంది.


 ఇవే కాకుండా.. తాళం చెవి గానీ పోగొట్టుకుంటే .. కొత్త తాళం చెవిని ఇచ్చేందుకు కూడా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. కొన్నింటిలో ఇది రూ. 500పైచిలుకు ఉంది. ఇక అద్దె గానీ బకాయి పడితే.. వార్షిక కిరాయిలో పది శాతం నుంచి 50 శాతం దాకా చార్జీలు విధిస్తోంది  (బకాయి పడిన కాలానికి) ఎస్‌బీఐ.
 
మరోవైపు, లక్షల రూపాయల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తేనో లేదా బీమా పథకాల్లాంటివి కొంటేనో మాత్రమే లాకర్లు ఇస్తామంటూ షరతులు పెడుతుంటాయి బ్యాంకులు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఖాతాదారు లాకరుని ఉపయోగించకుండా, అద్దె కట్టకుండా వదిలేస్తే.. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో నుంచి బకాయిలను జమ చేసుకోవడం దీని వెనుక ముఖ్యోద్దేశం. అయితే, లక్షల రూపాయల్లో ఎఫ్‌డీలో లేదా బీమా పథకాలో తీసుకోవాలన్నది కచ్చితం కాదంటోంది రిజర్వ్ బ్యాంక్. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కొత్తగా లాకర్ తీసుకునేవారి నుంచి మూడేళ్ల అద్దె, బ్రేకింగ్ చార్జీలు మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందస్తుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఏడాదికి రూ. 1,200 అద్దె అనుకుంటే.. బ్రేకింగ్ చార్జీలు రూ. 100 అనుకుంటే.. మూడేళ్లకు సంబంధించి బ్యాంకులు రూ. 3,700 దాకా బ్యాంకులు సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవచ్చు.
 
భద్రత ..
 
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు సాధారణంగానే పటిష్టమైన లాకర్లు, అలారం సిస్టమ్, సీసీటీవీలు, గార్డులు వంటి గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తాయి. అయితే, కొన్ని సార్లు ఇంతటి భద్రత వ్యవస్థ కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల బారిన కూడా పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పరిహారాల్లాంటివి చెల్లించడం తమ బాధ్యత కాదంటున్నాయి బ్యాంకులు. మనం లాకర్లలో ఏం దాచుకున్నదీ, వాటి విలువ ఎంత ఉంటుందనేది కూడా తమకు తెలియదు కాబట్టి వాటిలోవి పోతే అందుకు తమది పూచీ ఉండదన్నది వాటి వాదన.
 
ఇలాంటప్పుడు బ్యాంకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని నిరూపిస్తే తప్ప పరిహారాల కోసం పోరాడటం కుదరదు. అయితే, ఇలాంటి కొన్ని కేసుల్లో ఖాతాదారులు విజయం సాధించిన సందర్భాలు, నష్టపరిహారం దక్కించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే, ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి కనుక.. ఆ మేరకు లాకర్లను సురక్షితమైనవిగానే పరిగణించవచ్చు.
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

లాకరు తీసుకునేటప్పుడు షరతులు, నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా తెలుసుకోవాలి. లాకరులో ఏమేమి ఉంచుతున్నారో రాసి పెట్టుకోవాలి. వీలైతే ఫొటో కాపీలు తీసి ఉంచుకుంటే మరీ మంచిది. ఒకవేళ అనూహ్యమైన ఘటన ఏదైనా జరిగినా.. డిమాండ్ చేయాల్సిన పరిహారం గురించి ఒక అవగాహన ఉంటుంది. లాకరు తెరిచి, మూసిన ప్రతిసారి తాళం సరిగ్గా పడిందో లేదో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి.

మరిన్ని వార్తలు