ఆ సమస్య ఎందుకు వస్తోంది?

12 Apr, 2020 07:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 సందేహం

నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. అయితే నేను ఉండేది చిన్న పల్లెటూరిలో. గర్భిణులు ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలని, మాంసం, చేపలు, బీన్స్‌ వంటివి తీసుకోవాలని చెబుతుంటారు. అయితే లాక్‌డౌన్‌ వల్ల ఇవేమీ తినలేకపోతున్నాను. దీనివల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇప్పుడున్న పరిమితులలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఏమైనా టాబ్లెట్లు తీసుకోవాలా? – కె.పద్మ, ఉప్పరపల్లి, వరంగల్‌ జిల్లా

ప్రెగ్నెన్సీ సమయంలో మాంసాహారం తప్పనిసరిగా తినాలని ఏమీ లేదు. దానికి బదులుగా తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు అన్నిరకాలు, ఖర్జూరం, పల్లి పట్టీలు, డ్రైఫ్రూట్స్‌ వంటివి తీసుకోవచ్చు. పల్లెటూర్లలో కూడా ఆకుకూరలు, కూరగాయలు, వేరుశెనగ, కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పులు, పాలు, పెరుగు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి దొరుకుతాయి కదా!  వీటన్నింటిలో కూడా గర్భిణి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు కావలసిన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్స్, మినరల్స్‌ దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందకుండా, పైన చెప్పినవి ఏవి దొరికితే అవి ఆహారంలో తీసుకుంటే మీరు, మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంతో పాటు గర్భిణులు తప్పకుండా ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, క్యాల్షియం, విటమిన్‌–డి, మల్టీవిటమిన్‌ మాత్రలు రోజుకొకటి చొప్పున వేసుకోవాలి. 

నా వయసు 26 సంవత్సరాలు. నేను వైట్‌డిశ్చార్జీ సమస్యతో బాధపడుతున్నాను. అసలు ఇది ఎందుకు వస్తుంది? నివారణ ఏమిటి? ‘ఫిజియోలాజికల్‌ వైట్‌డిశ్చార్జీ’ అంటే ఏమిటి?– ఎన్‌ఆర్, ఒంగోలు

ఆడవారిలో యోని భాగంలో, గర్భాశయ ముఖద్వారంలో మ్యూకస్‌ స్రవించే గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి కొద్దిగా నీటిలాంటి జిగురుగా ఉండే ద్రవం వస్తుంది. దీనినే వైట్‌ డిశ్చార్జ్‌ అంటారు. ఇందులో చెడు వాసన, దురదలాంటివి ఉండవు. ఈ స్రావాలలో ఉండే ఆమ్లగుణం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి వ్యాధికారక క్రిములు గర్భాశయం లోపలకు వెళ్లకుండా అక్కడే చనిపోతుంటాయి. ఈ వైట్‌ డిశ్చార్జినే ల్యుకేరియా అంటారు. హార్మోన్ల ప్రభావం వల్ల అనేక సమయాలలో వైట్‌ డిశ్చార్జి కొద్దిగా ఎక్కువగా విడుదలవుతుంది. పీరియడ్‌ వచ్చిన 11–16 రోజులలో అండం విడుదలయ్యే సమయంలోను, పీరియడ్స్‌కు ముందు, కలయిక సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో వైట్‌ డిశ్చార్జి కొద్దిగా ఎక్కువ విడుదలవుతుంది. దీనినే ఫిజియోలాజికల్‌ వైట్‌ డిశ్చార్జి అంటారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు.

కొందరిలో గనేరియా, క్లామిడియా, ప్రోటోజోవా, ట్రైకోమోనియా క్యాండిడా ఫంగస్, కొన్ని రకాల వైరస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల వైట్‌ డిశ్చార్జి పసుపు రంగు, నురగతో కలిసి లేదా పెరుగులాగా ఉంటూ యోనిలో, యోని చుట్టూ దురద, మంటతో పాటు చెడు వాసనతో స్రవిస్తుంది. ఒకవేళ మీకు పైన చెప్పిన లక్షణాలతో వైట్‌ డిశ్చార్జి ఉంటే తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి యాంటీబయోటిక్స్‌ లేదా యాంటీఫంగల్‌ మందులు పూర్తి కోర్సు సరిగా వాడటం మంచిది. మీకు వివాహం అయిందా లేదా రాయలేదు.

ఒకవేళ వివాహం అయి ఉంటే కలయిక ద్వారా కూడా ఇన్ఫెక్షన్లు దంపతులలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇద్దరూ మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా రక్తహీనత లేకుండా, రోగనిరోధక శక్తి సరిగా ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేసుకుంటూ, కనీసం రోజుకు రెండు లీటర్ల మంచినీరు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే యోని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి.
- డా. వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు