కథ చెబుతారాఊ... కొడతాను

20 Nov, 2019 05:55 IST|Sakshi

పిల్లల లోకం

ఈ ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందారు. అయినా ఇప్పటికీ బడికి వెళుతుంటారు. అక్కడ పిల్లలకు కథలు చెబుతూ, వారి చేత చెప్పిస్తూ.. చిన్నారుల మేధాశక్తికి పదును పెడుతుంటారు. బాలల కోసం రచనలు చేస్తూ... బాలలే లోకం అని విశ్వసిస్తున్న ఈ (అ)విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి పేరే వి.రాజేశ్వర శర్మ.

ఆయనది పిల్లల లోకమే. పిల్లలే ఆయన కథా వస్తువు. ఆయన రచనలన్నీ పిల్లలకు సంబందించినవే. చివరకు ఆయన పీహెచ్‌డీ చేసింది కూడా పిల్లలకు సంబంధించిన అంశాలపైనే. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి చెందిన డాక్టర్‌ వి.రాజేశ్వరశర్మ (వీఆర్‌శర్మ) గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన రెండు దశాబ్దాలుగా పిల్లలకు సంబంధించిన రచనలతో ఎన్నో పుస్తకాలను తీసుకువచ్చారు. ‘పిల్లల లోకం’ అన్న పేరుతో ఆయన పిల్లలతో కథలు, కవితలు రాయిస్తూ, బొమ్మలు గీయిస్తూ వాటì తో పుస్తకాలు వేయించారు. పిల్లలతో మాట్లాడితే వారిలోని మేధాశక్తి బయటకు వస్తుందని విశ్వసించే శర్మ పిల్లల లోకం పేరుతో గడచిన రెండు దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రచనలూ చేస్తున్నారు. 1998లో మొదలైన ఆయన ప్రయత్నం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఉద్యోగ విరమణ తరువాత మరింత సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. 

డాక్టర్‌ వీఆర్‌శర్మ ‘పిల్లల లోకం’ పేరుతో రాసిన కవితలు, కథలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. అలాగే ‘ఆనందం’ అనే పిల్లల పాటలు, ‘కానుక’ అనే పేరుతో ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల, బడిపిల్లలు రాసిన కథలను కూర్చి ‘బంగారు నెలవంకలు’ అన్న పుస్తకాన్ని, ‘కవులు పిల్లలు’ అన్న సంకలనాన్ని తీసుకొచ్చారు.  సామాజిక అంశాలపై ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు ముద్రితమయ్యాయి. ఆయన రాసిన దాదాపు అన్ని పుస్తకాల కవర్‌పై పిల్లల చిత్రాలే కనిపిస్తాయి. కాగా పూర్వ కాలంలో తాత, బామ్మలు పిల్లలకు పురాణాలు, ఇతిహాసాలు, నీతికథలు చెప్పేవారు. వాటి ప్రభావం పిల్లలపై ఎంతో ఉండేది. కుటుంబాలు విడిపోతున్న కారణంగా పిల్లలకు నీతి కథలుగాని, ఇతర కథలు కాని చెప్పేవారు లేకుండాపోయారు.

బడి పిల్లలతో కథలు చెప్పిస్తూ.. రికార్డు చేయిస్తూ.. పిల్లలు చాలామంది కథలు చెప్పే మేధస్సు ఉన్నా వాటిని వెలికితీసే ప్రయత్నం జరగడం లేదు.అయితే డాక్టర్‌ వీఆర్‌శర్మ పిల్లలలోకం పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలతో కథలు చెప్పిస్తున్నారు. పిల్లలు చెప్పిన క£ý లను రికార్డు చేయడం ద్వారా వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. గర్గుల్, సిద్దిపేట తదితర ఉన్నత పాఠశాలల్లో ఆయన పిల్లలతో కథలు చెప్పించారు. దాదాపు ముపై ్పమంది పిల్లలు చెప్పిన కథలు విని ఆయన ఆశ్చర్యపోయారు. పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్లలో సృజనాత్మక ఆలోచనలు మరింతగా పెరుగుతాయని, నీతి కథను కొత్తగా చెప్పగలుగుతారని శర్మ అంటున్నారు. అలాగే సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఐడీఏ బొల్లారం ఉన్నత పాఠశాలలో కూడా పిల్లల లోకం కార్యక్రమాన్ని నిర్వహించారు.

పిల్లలకు నగదు ప్రోత్సాహకాలు
డాక్టర్‌ వీఆర్‌శర్మ పాఠశాలల్లో విద్యార్థులతో కథలు చెప్పించే సందర్భంలో మంచి కథలు చెప్పిన వారిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.3 వందల నగదు, రెండో స్థానం సంపాదించిన విద్యార్థికి రూ.రెండు వందలు, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ. 100 నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు. అంతేగాక బాలసాహిత్య పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి పిల్లలతో కథలు చెప్పించడం ద్వారా మిగిలిన పిల్లలు వాటిని వింటూంటే తాము కూడా నేర్చుకోవాలన్న ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే పిల్లలను కథ చెబుతారా ఊ కొడతాను అని అడుగుతుంటారు. ఇప్పటివరకు వందలాది మంది విద్యార్థులు కథలు చెప్పారని, ఆ కథలన్నింటినీ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నానని, ఇలా చేయడం వల్ల అవి విశ్వవ్యాపితం అవుతాయన్నారు.
– సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి

మరిన్ని వార్తలు