ఆఫీసులో పర్సనల్‌ ఫోన్‌?!

24 Oct, 2019 03:24 IST|Sakshi

వృత్తి నిబద్ధత

ఉద్యోగాలు చేసేవారు కొన్ని అంశాలను విధిగా పాటించాలి. పదిమందితో కలిసి పనిచేసేటప్పుడు, పక్కన ఉన్నవారికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవడం ప్రతి ఉద్యోగి బాధ్యత. వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. ఇటీవలికాలంలో సెల్‌ ఫోన్లు ఎక్కువయ్యాయి. అందువల్ల పని మధ్యలో కూడా ఫోను మాట్లాడవలసి వస్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడు అలా మీకు పర్సనల్‌ కాల్‌ వస్తే, వీలైనంతవరకు సహోద్యోగులకు కాస్త దూరంగా వెళ్లి మాట్లాడాలి. ఒకవేళ ఆ అవకాశం లేకపోతే, ‘నేను మళ్లీ ఫోన్‌ చేస్తాను’ అని నెమ్మదిగా చెప్పి ఫోన్‌ కట్‌ చేసేయాలి.

అత్యవసరమనుకుంటే ఆఫీసు బయటకు వెళ్లి, లాంజ్‌లో కాని, ఆరుబయట కాని మాట్లాడుకోవాలి. ఆఫీసులో ఉన్నప్పుడు వృత్తికి సంబంధించిన ఫోన్లు వస్తుంటాయి కాబట్టి వాటికి ప్రాధ్యాన్యం ఇస్తూ వ్యక్తిగతంగా ఫోన్‌ చేసినవారితో, ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని చెప్పాలి. అలాగే కంప్యూటర్‌ని, ఫోన్‌ను మ్యూట్‌ లేదా సైలెంట్‌ మోడ్‌లో ఉంచుకోవాలి. అందువల్ల ఇమెయిల్‌ వచ్చినా, మెసేజ్‌ వచ్చినా అవి చేసే శబ్దాల వల్ల మిగతావారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు మంచి క్రమశిక్షణ ఉన్న ఉద్యోగిగా కూడా గుర్తింపు పొందుతారు.

మరిన్ని వార్తలు