గుడ్డు ముందా... కోడి ముందా...?

4 Feb, 2015 00:08 IST|Sakshi
గుడ్డు ముందా... కోడి ముందా...?

‘‘ఇంతకూ... గుడ్డు ముందా... కోడి ముందా...? నీ దృష్టిలో ఏది ముందో నువ్వు చెప్పు’’ అంటూ అడిగారు మా శ్రీవారు.
 అంతకు ముందు ఆ అంశంపై మా శ్రీవారూ, వారి స్నేహితులు కొందరు కలిసి ఓ రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. పెరట్లో సాగిన ఈ చర్చల సమయంలో వారు తినడానికి వీలుగా చిప్స్, కారప్పూసా, చివరన కూల్‌డ్రింక్స్... ఆ మధ్య ఒకసారి బ్రేక్‌లో కాసింత కాఫీ నీళ్లూ... ఇవన్నీ వాళ్లకు నేనే సర్వ్ చేశా.

 ‘‘ఏం... మీ సుదీర్ఘ చర్చల్లో ఏ విషయమూ తేలలేదా? పైగా రెండు గంటలకు పైగా సాగింది కదా ఆ సంభాషణ’’ అన్నాను కాస్త వ్యంగ్యం ధ్వనించేలా. ఆయనకు అది అర్థం కాలేదు. అర్థం అవుతుందని కూడా నేననుకోలేదనుకోండి! ‘‘ఏవిటోనోయ్... మేమందరమూ కాస్త బుద్ధిజీవులమే. పైగా సైన్స్ కోణంలో కొద్దిసేపూ, చివరన ఆధ్యాత్మిక-లౌకిక-పారలౌకిక-అలౌకిక దృష్టితో మరికాసేపూ... ఇలా అన్ని కోణాల నుంచి ఒక నిబద్ధత కూడిన అర్థవంతమైన చర్చసాగించి, బలవంతంగా ప్రయత్నించినా ఫలవంతమైన ఫలితం రాలేదోయ్. అందుకే అడుగుతున్నా. గుడ్డు ముందా? కోడి ముందా నువ్వైనా చెప్పు’’ అంటూనే... ‘‘అయినా నీ కోడిమెదడుకు ఇంతటి లోతైన సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకోవడం నా పొరబాటేనోయ్’’ అంటూ ఒక సెటైరు విసిరారు.

 ‘‘అవునండీ... నా కోడిమెదడుకు ఇలాంటి చర్చలూ, వాటి ఫలితాలూ పెద్దగా పట్టవు. కానీ కోడి ముందా, గుడ్డు ముందా అనే ఓ సైంటిఫికల్ మిక్స్‌డ్ తాత్విక సమస్య కంటే నేను చాలా చిన్న విషయాలకే ప్రాధాన్యమిస్తా’’ అన్నాన్నేను.
 ‘‘అంటే?’’ అడిగారాయన.

 ‘‘అంటేనా? మనింట్లో అరడజను కోడి గుడ్లుంటే... మన పిల్లలు ఆరోగ్యంగా, బలంగా, ఎత్తుగా పెరగాలంటే వాటిని బాయిల్డ్ ఎగ్స్ రూపంలో పిల్లలకు పెట్టాలా? లేక రుచిగా తినిపించడానికి ఆమ్లెట్లు వేయాలా అన్నదే నాలో అంతర్గతంగా జరిగే చర్చ. ఒకవేళ బాయిల్డ్ ఎగ్స్ చేస్తే... నలభై దాటిన మీ ఆరోగ్యం దృష్ట్యా మీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకూ, ఎగ్ కలర్ తాలూకు ఎల్లో మెరుగులు నా ముఖాన నిగారింపులా పదికాలాలపాటు పదిలంగా నిలిచేందుకు దాని పసుపుసొన ఉండను... మన పిల్లలకు పెట్టి మీకు ఎగ్ వైట్ మాత్రమే పెట్టాలా అనేది కూడా నా మనసులో జరిగే చర్చ. ఇక పిల్లలు ఆరోగ్యకరంగా పెరుగుతూ, మీకూ గుండె చుట్టూ కొవ్వు పెరగకుండా ఉండాలంటే వేటమాంసానికి బదులు వైట్‌మీటైన చికెన్ పెడితేనే మంచిది కదా అన్న చిన్న విషయాలే నాకు పెద్ద సందేహాలు. వీటితోనే నేను సతమతమవుతూ ఉంటే మేధావులైన మీరూ-మీ మిత్రుల్లా కోడి ముందా, గుడ్డు ముందా అనే అంశంపై తాత్విక, శాస్త్రీయ, గతితార్కికవాద.. లాంటి అనేక కోణాలకు తావెక్కడుంటుందండీ’’అంటూ నా ముఖాన అమాయకత్వాన్ని ఒలికిస్తూ జవాబిచ్చాను.    -వై!
 
 

మరిన్ని వార్తలు