విదేశీ వేస్ట్ వారియర్..!

4 May, 2014 22:30 IST|Sakshi
విదేశీ వేస్ట్ వారియర్..!

విదేశీయులెవరైనా మన దేశానికి వస్తే... మన సంస్కృతిని చూసి ముచ్చటపడతారు. మన సంప్రదాయాలను చూసి సెల్యూట్ చేస్తారు. మన కళలను చూసి హ్యాట్సాఫ్ చెబుతారు. కానీ ఒక్క విషయానికి మాత్రం ముఖం చిట్లిస్తారు. అది... అపరిశుభ్రత. జోడీ అండర్‌హిల్‌ని కూడా మన దేశంలోని అపరిశుభ్రత చాలా చికాకు పెట్టింది. కానీ ఆమె మిగతావారిలా ముఖం తిప్పుకునో, ముక్కు మూసుకునో వెళ్లిపోలేదు. చీపురు పట్టింది. చెత్తను ఊడ్చడం మొదలుపెట్టింది. భారతదేశాన్ని చెత్త బారి నుంచి రక్షిస్తానంటూ శపథం చేసింది!
 
పార్‌‌కలో సరదాగా కూర్చుని చిప్స్ తింటాం. ఖాళీ అయిన ప్యాకెట్‌ని అక్కడే వదిలి వెళ్లిపోతాం. దాహంగా ఉందని వాటర్ బాటిల్ కొంటాం. ఖాళీ అయిన తర్వాత విసిరేస్తాం. వాటివల్ల తిరిగి మనకే నష్టం వాటిల్లుతుందన్న స్పృహ మనకి ఉండదు. ఆ స్పృహను కలిగించేందుకే తాను వచ్చానంటుంది జోడీ అండర్‌హిల్. ఎక్కడో బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి, భారతదేశాన్ని చెత్తరహిత దేశంగా మార్చాలని కంకణం కట్టుకుంది. అందుకే ఉత్తర భారతదేశంలో అందరూ ఈమెని ‘చెత్తమ్మాయి’ అంటుంటారు.
 
1976లో ఇంగ్లండులో పుట్టింది జోడీ.  మొదట్నుంచీ సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తుండేది. అందువల్లే పెద్దయ్యాక రకరకాల ఉద్యోగాలు చేసినా ఏవీ తృప్తినివ్వలేదు. దాంతో ఓ స్వచ్ఛంద సంస్థలో చేరింది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. దానికి తోడు జోడీకి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. దాంతో పలు దేశాలు తిరిగి నిధులు సేకరించేది. పనిలో పనిగా అక్కడి సంస్కృతీ సంప్రదాయాల గురించి ఇష్టంగా తెలుసుకునేది. ఆ విధంగానే 2009లో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వచ్చింది. ఆ పర్యటన తనను ఎప్పటికీ భారతదేశంలోనే ఉంచేస్తుందని ఆమె ఊహించి ఉండదు.
 
ఒంటరిగా వచ్చింది... సైన్యంగా మారింది...

ఉత్తర భారతదేశం జోడీని చాలా ఆకర్షించింది. పర్వత సానువులు, వాటిపై పేరుకున్న మంచు ముద్దలు, పచ్చని చెట్లు, చక్కని జలపాతాలు... ఆ ప్రాకృతిక సౌందర్యానికి పరవశించింది జోడీ. కానీ అంత అందమైన ప్రకృతి పరిశుభ్రంగా లేకపోవడం ఆమెను బాధపెట్టింది. ముఖ్యంగా మల్లెపువ్వులా మెరవాల్సిన హిమాలయాలు సైతం మురికిగా తయారవడాన్ని ఆమె చూడలేకపోయింది. ఆమెలోని సామాజిక స్పృహ మేల్కొంది. అందరినీ కలిసి పరిసరాలను, పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించేది. కొందరు విని వదిలేసేవారు.

కొందరు వినడానికి ఇష్టపడేవారే కాదు. దాంతో మొదటి అడుగు తనే వేయాలని నిర్ణయించుకుంది జోడీ. చలికోటు, బూట్లు, గ్లవుజులు వేసుకున్నా వణికిం చేంత చలి ఉండే హిమాలయాల్లో చెత్త ఏరడం ప్రారం భించింది. అందరూ తనని విచిత్రంగా చూస్తున్నా, చెత్తమ్మాయి అంటున్నా పట్టించుకునేది కాదు. దాంతో కొన్నాళ్లకు ఆమె తపనను అందరూ అర్థం చేసుకున్నారు. ఆమె పనిలో సాయపడటం మొదలుపెట్టారు.  
 
అయితే తన పని అంతటితో అయిపోలేదని, చేయా ల్సింది చాలా ఉందని జోడీకి తర్వాత అర్థమైంది. గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన కొన్ని దృశ్యాలు ఆమెను కదిలించాయి. ఇళ్ల పక్కనే చెత్తకుప్పలు ఉండటం, వాటి దగ్గరే పిల్లలు ఆడుకోవడం, శుభ్రత లేకపోవడం వల్ల అంటు వ్యాధులు ప్రబలడం వంటివి చూశాక తన సేవలను విస్తరించాల్సిన అవసరం కనబడింది జోడీకి. అప్పుడే ‘వేస్ట్ వారియర్‌‌స’ను నెలకొల్పింది. ఆసక్తి ఉన్నవారిని వాలం టీర్లుగా చేర్చుకుంది. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే... భారతదేశంలో చెత్త అన్న మాట వినబడకుండా చేయడం!
 
ఎక్కడ చెత్త ఉంటే అక్కడ వేస్ట్ వారియర్‌‌స ప్రత్యక్షమైపోతారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చెత్త అనేది కనబడకుండా చేశారు.  భారత దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ చెత్తరహితంగా చేయాలనే ఆశయంతో పని చేస్తున్నారు. తన లక్ష్యానికి అడ్డు ఉండకూడదని పెళ్లి కూడా మానుకుంది జోడీ. అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అవసరమా అని అడిగితే... ‘రోజులో ఎక్కువ సమయం చెత్త ఏరు కోవడంలోనే మునిగిపోయే అమ్మాయిని భరించే మగాడు ఎక్కడ దొరుకుతాడు’ అంటూ నవ్వేస్తుంది. పిల్లల్ని పెంచడానికి కేటాయించే సమయాన్ని పనికే కేటాయిస్తాను అంటుంది. సమాజం కోసం బతికేవాళ్లకు తన అనే స్వార్థం ఉండదు. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ఓటమీ ఉండదు!                       
 
- సమీర నేలపూడి
 
‘‘పరిశుభ్రత అనేది ఏ ఒక్కరివల్లో సాధ్యమయ్యేది కాదు. ప్రతి ఒక్కరిలోనూ శుభ్రంగా ఉండాలన్న ఆలోచన ఉంటేనే అది సాధ్యపడుతుంది. చెత్తను తేలికగా తీసుకుంటాం. ఎక్కడ పారేస్తే ఏంటి అనుకుంటాం. దానివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రకృతికి హాని కలుగుతుంది. పర్యాటక రంగానికి హాని కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే... దేశ ప్రతిష్ఠను కూడా అది దెబ్బ తీస్తుంది. భారతదేశాన్ని చెత్తదేశం అని ఎవరూ అనకూడదనే నేను ‘చెత్తమ్మాయి’గా మారాను!’’
 

మరిన్ని వార్తలు