గ్యాస్ సిలెండర్‌కీ ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుంది!

25 Feb, 2015 00:06 IST|Sakshi
గ్యాస్ సిలెండర్‌కీ ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుంది!

గత రెండు నెలల కాలంలో గ్యాస్ సిలెండర్లు పేలిన ఘటనలు వార్తల్లో చాలా కనిపించాయి. వేసవి కాలంలో ఇటువంటి ప్రమాదాలు మరింత పెరుగుతుంటాయి. ఇలాంటివి విన్నప్పుడు వంటింట్లోకి వెళ్లాలంటే అడుగులు కాస్త తడబడతాయి. అయితే అంత భయపడాల్సిన పని లేదు. గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చు.
 
గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అదే అసలు సమస్య. సిలెండర్ పైన సంవత్సరాన్ని సూచించే అంకెతో పాటు ఎ,బి,సి,డి అనే అక్షరాలు ఉంటాయి. ఎ అంటే మార్చి, బి అంటే జూన్, సి అంటే సెప్టెంబర్, డి ఉంటే డిసెంబర్ వరకు అని అర్థం. ఆ నెల దాటితే  వాడటం ప్రమాదమే. కాబట్టి కచ్చితంగా కాల పరిమితి చూసుకుని తీసుకోండి.

 సిలెండర్ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి. లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది.  వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి. కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి.  కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి.

రబ్బర్ ట్యూబ్‌ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దాని దగ్గరగా ఎటువంటి వేడి వస్తువులూ పెట్టకూడదు. ఐదేళ్లకోసారి ట్యూబ్‌ను తప్పకుండా మార్చాలి.  తక్కువ రేటు పొయ్యిలు వాడితే వాటి భాగాలు త్వరగా పాడవుతాయి. ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మంచి స్టౌ వాడాలి. దాన్ని కూడా సంవత్సరానికోసారి పరీక్ష చేయించాలి. గ్యాస్ ఏజెన్సీవాళ్లను పిలిస్తే వాళ్లే వచ్చి చేస్తారు.  వంట పూర్తి కాగానే స్టౌ కట్టేసి ఊరుకోకుండా, రెగ్యులేటర్‌ని తప్పకుండా ఆఫ్ చేయండి.
 

మరిన్ని వార్తలు