బుడతడి వైద్యం 2 డాలర్స్‌ ఓన్లీ!

26 Dec, 2016 06:27 IST|Sakshi
బుడతడి వైద్యం 2 డాలర్స్‌ ఓన్లీ!

చీరో ఆర్టిజ్‌.. ఈ చిన్నారి పేరు. వయసు 11. ఉంటున్నది అమెరికాలో. ఈ మధ్య న్యూయార్క్‌లోని ఓ సబ్‌వే స్టేషన్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. సబ్‌వేలు ఉండేది రోడ్డుకు ఇటువైపు, అటు వైపు వెళ్లడానికి. అండర్‌ గ్రౌండ్‌లో ఉంటాయి. సొరంగంలాంటి ఆ మార్గంలో సాధారణంగా మనుషులెవ్వరూ నిలుచోరు. హస్క్‌ కొట్టరు. ఒక ప్రవాహంలా కదిలిపోతూనే ఉంటారు. ఆ ప్రవాహంలో చిన్న బ్రేక్‌.. ఈ కుర్రాడు. వచ్చేవారికి, వెళ్లేవారికి కనిపిస్తూ ఓ మూల కుర్చీలో కూర్చొని ఉంటాడు. అతడి ముందు ఒక మడత బల్ల ఉంటుంది. ఆ బల్లకు ఓ బోర్డు వేలాడుతూ ఉంటుంది. ‘ఎమోషనల్‌ అడ్వైస్‌. 2 డాలర్స్‌’. అదీ ఆ బోర్డు! ఎమోషనల్‌గా ఏదైనా బాధలో ఉండి, సలహా కోసం చూస్తూ, థెరపిస్టు దగ్గరికి వెళ్లే సమయం, ఓపిక, డబ్బు లేనివాళ్లకు ఇప్పుడీ సబ్‌వే థెరపిస్టు ‘భూతవైద్యుడి’లా సాక్షాత్కరిస్తున్నాడు.

నిజంగా భూతవైద్యం కాదు. ఇంత చిన్నపిల్లాడేం చెప్తాడు అనే ఆసక్తితో అతడిని చూసినప్పుడు.. విచిత్రంగా, మాయగా, మంత్రంగా అనిపిస్తుంది. అలా ఇది భూతవైద్యం అన్నమాట. వీడి ప్రాక్టీస్‌ వెనుక చిన్న కథ ఉంది. స్కూల్‌లో ఎవరో చీరోను హర్ట్‌ చేశారు. చీరో హర్ట్‌ అయ్యాడు. హర్ట్‌ కాకుండా ఎలా ఉండాలి? హర్ట్‌ చేసేవాళ్లను ఎలా దారిలోకి తేవాలి అని ఆలోచించాడు. అమ్మానాన్నతో మాట్లాడాడు. ‘లైట్‌గా తీస్కో’ అని నాన్న ఆడమ్, అమ్మ జాస్మిన్‌ సలహా ఇచ్చారు. ఆ సలహా చీరోకి బాగా నచ్చింది. సమస్య ఎంత పెద్దదైనా, తేలిగ్గా తీసుకోవడం వల్ల అది తగ్గిపోతుంది. అంటే.. ‘మనసుకు పట్టించుకోవడమే మన అసలు సమస్య’ అని కనిపెట్టాడు చీరో. దాంతో అతడికో ఆలోచన వచ్చింది. పైకి చెప్పుకోరు కానీ, ప్రతి మనిషికీ ఏదో ఒక ఎమోషనల్‌ సమస్య ఉంటుంది. దానికి సలహా ఇవ్వాలని అనుకున్నాడు. ఉచిత సలహాలు ఎవరూ తీసుకోరు కదా.

అందుకే 2 డాలర్ల ఫీజు పెట్టాడు. ఇప్పటికైతే చీరో ప్రాక్టీస్‌ బాగా సాగుతోంది. ఒక్కోరోజు 50 డాలర్లతో ఇంటికి వెళుతున్నాడు. మన రూపాయల్లో సుమారు 3,400. ప్రేమ, పెళ్లి, రిలేషన్స్, జాబ్, ఫ్యూచర్‌ ఇలా... అన్నిరకాల సలహాల కోసం బెడ్‌ఫోర్డ్‌ సబ్‌వేలోని ఇతడి ‘క్లినిక్‌’ దగ్గర కొద్ది నిమిషాలు ఆగేవారు ఎక్కువయ్యారు. కొంతమందైతే.. ‘డాక్టరు గారు మీ సలహా అద్భుతంగా పనిచేసిందండీ’ అని మళ్లీ వచ్చి థ్యాంక్స్‌ కూడా చెబుతున్నారు! ఏ సమస్యకైనా చీరో చెప్పే సమాధానం ఒకటే.. ‘జీవితం విలువైనది. బాధపడడానికి ఏమాత్రం టైమ్‌ కేటాయించకు’ అని మాత్రమే. అలాగని సేమ్‌.. ఇవే మాటలతో చెప్పడు. ప్రేమ సమస్య అయితే ప్రేమ మాటల్లో చెబుతాడు. మనీ ప్రాబ్లమ్‌ అయితే, డబ్బు భాషలో చెప్తాడు.  ఇక కొంతమందైతే.. సరదాగా ట్రంప్‌ గురించి, తమ ఇంట్లో పని చేయని పంప్‌ గురించీ ఏవో రెండు మాటలు మాట్లాడి, అక్కడికక్కడే రిలాక్సై పోయి చీరో చేతిలో రెండు డాలర్లు పెట్టి పోతున్నారట! సబ్‌వేలో ఓ రెండు గంటలు మాత్రమే అందుబాటులో ఉండే చీరోకి క్రమక్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. అతడి కోసం వేచి ఉండే ‘పేషెంట్‌’ల సంఖ్య కూడా పెరుగుతోంది.

మరిన్ని వార్తలు