-

చర్మం పొట్టుగా రాలుతోంది!

14 Dec, 2016 00:40 IST|Sakshi
చర్మం పొట్టుగా రాలుతోంది!

నా వయసు 28 ఏళ్లు. రెండు మూడు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతోంది. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమైన ఉపశమనమే ఉంది. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. దీనికి హోమియోలో మందు ఉందా?
– రాజేశ్, మంచిర్యాల


మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సొరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సొరియాసిస్‌ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు.

కారణాలు : వంశపారంపర్యం లేదా అధిక ఒత్తిడి ముఖ్యంగా ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్లు సొరియాసిస్‌కు ప్రధాన కారణం.
లక్షణాలు:  ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది lకేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి lతలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది.

ఈ వ్యాధితో బాధపడుతున్నవారు చూడటానికి కూడా బాగాలేక మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.

వ్యాధి ఉన్నప్పుడు...
ఆధునిక జీవన శైలి వల్ల వంశపారంపర్యంగా ఈ వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావిడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి.

చికిత్స
ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సొరియాసిస్‌ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది.

ఛాతీ నొప్పి... సమస్య ఏమిటి?
నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా?
– నవీన్‌కుమార్, నల్లగొండ

మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్‌ డిసీజ్‌’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్‌ డిసీజ్‌ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ  నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్ష ణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

నా వయసు 40 ఏళ్లు. నెల రోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రతించాను. పరీక్షల్లో కడుపులో చిన్న పుండు ఉందని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్‌ అవసరమా?
– టి. రవి, వరంగల్‌


సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు యాసిడ్‌ పెప్టిక్‌ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రతించి తగిన చికిత్స తీసుకోండి.

మరిన్ని వార్తలు