మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? సర్జరీ చేయాల్సిన పనిలేదు

7 Nov, 2023 15:01 IST|Sakshi

ఎంతోకాలంగా మోకాలినొప్పితో బాధపడుతున్నారా? ఫిజియో థెరపీ, స్టారాయిడ్‌ ఇంజెక్షన్లు, సర్జరీ వంటివన్నీ ట్రై చేశాక కూడా ఎలాంటి ఫలితం లేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఎలాంటి సర్జరీ లేకుండానే మీ నొప్పిని తగ్గించేందుకు డ్యూక్‌ యూనివర్సిటీ నేతృత్వంలోని ఓ అధ్యయన బృందం ఒక హెడ్రైజెల్‌ను తీసుకొచ్చారు. ఇది మోకాలి నొప్పులను త్వరగా నయం చేస్తుందట.

ఈరోజుల్లో కీళ్లనొప్పుల సమస్య సర్వసాధారణం అయిపోయింది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్లలో ఈ సమస్య మరీ అధికంగా ఉంటోంది. దీనికి కారణం ఆర్థరైటిస్‌. దీన్నే కీళ్ళవాపు వ్యాధి అంటారు.  అనారోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పటికీ కీళ్లనొప్పులకు శాశ్వత పరిష్కారం లేదు.

మెట్లు ఎక్కాలన్నా, పరిగెత్తాలన్నా, ఎక్కువసేపు నడవాలన్నా మోకాలి నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాలు లోపలి కణజాలం దెబ్బతింటుందని, దీని వల్ల లోపల cartilage (మృదులాస్థి) అరిగిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాస్త లెగ్‌ స్ట్రెచ్‌ చేసినా, మూమెంట్‌ ఇచ్చినా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. విపరీతంగా బరువు ఉండటం, సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం, శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం వంటివన్నీ మోకాలి నొప్పికి కారణాలు.

కొందరు నొప్పి భరించలేక శస్త్రచికిత్సల బాట పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు డ్యూక్‌ యూనివర్సిటీ సైంటిస్టులు. ఎందుకంటే సెల్యూలోజ్‌ ఫైబర్‌తో తయారుచేసిన ఓ హైడ్రోజెల్‌తో మోకాలి నొప్పులను తగ్గించవచ్చని వెల్లడించారు. ఈ హైడ్రోజెల్‌ను పాలిమర్‌తో తయారుచేశారు.

సెల్యూలోజ్‌ ఫైబర్‌ యోక్క పలుచని షీట్‌లను తీసుకొని వాటిని పాలీ వినైల్‌ ఆల్కహాల్‌ కూడిన పాలిమర్‌తో అనుసంధానం చేసి ఓ జిగట లాంటి జెల్‌ను రూపొందించారు. సెల్యూలోజ్‌ ఫైబర్‌ కొల్లాజిన్‌ ఫైబర్‌లా పనిచేస్తాయని డ్యూక్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తమ పరిశోధనలో వెల్లడించారు. ఇది cartilage కంటే ధృడంగా ఉంటుందని తెలిపారు. కాళ్లను ముందుకి, వెనక్కి స్ట్రెచ్‌(సాగదీసినప్పుడు) హైడ్రోజెల్‌ మోకాలి నొప్పిని పట్టి ఉంచుతుంది.

హైడ్రోజెల్‌ ఉన్న ఇంప్లాట్‌తో కీళ్ల నొప్పి చాలావరకు తగ్గిపోతుందని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. దీనికోసం సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో హైడ్రోజెల్‌లను రూపొందించడానికి జెల్‌లోని స్ఫటికాలను ఉత్పత్తి చేయడానికి ఫ్రీజ్-థా ప్రక్రియను ఉపయోగించారు. కానీ తాజా అధ్యయనంలో ఎనియలింగ్ అనే హీట్‌ ట్రీట్‌మెంట్‌ని ఉపయోగించారు. ఫలితంగా కీళ్లలో వచ్చే ఒత్తిడిని రెండు రెట్లు ఎక్కువగా తట్టుకునే శక్తిని కలిగి ఉన్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు