రుచికే కాదు.. ఆరోగ్యానికీ...

11 Apr, 2016 00:19 IST|Sakshi
రుచికే కాదు.. ఆరోగ్యానికీ...

తిక్క లెక్క


మామూలు వంటకాలను సైతం తన ఘుమఘుమలతో మరింత రుచిగా మార్చే పుదీనాను రోమన్లు, గ్రీకులు మొదటిసారిగా గుర్తించి, దాని వాడకాన్ని వెలుగులోకి తెచ్చారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని వారి నమ్మకం. ఏథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించుకునేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట. పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే యాంటీబయాటిక్స్‌లా పని చేస్తాయని పలు పరిశోధనలు తేల్చాయి.

దీని నుంచి తీసే మెంథాల్‌ను తల, గొంతు, నొప్పి నివారణకు వాడుతున్నారు. పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటిదుర్వాసన దూరమవుతుంది. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టిపడడమే కాకుండా, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ తగ్గుముఖం పడతాయట. ఎండాకాలంలో మజ్జిగతేటలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే ఎండదెబ్బ కొట్టకుండా ఉంటుందట. బిర్యానీలో పుదీనా ఆకులను వేసేది రుచికి, సువాసనకే కాదు... అజీర్తిని, విషాలను తొలగించడానికేనట!

మరిన్ని వార్తలు