‘రేపటి గతా’న్ని హెచ్చరిస్తున్న గేదెమీది పిట్ట | Sakshi
Sakshi News home page

‘రేపటి గతా’న్ని హెచ్చరిస్తున్న గేదెమీది పిట్ట

Published Mon, Apr 11 2016 12:14 AM

novel is key role in literature

నేడుకి నిన్నా, రేపూ కూడా ప్రాధాన్యతలేని అంశమై పోతున్నప్పుడు, సమాజంలోని అన్ని మూలలూ కాలంతో పరుగులెట్టే వేగాన్ని తమలో ఇముడ్చుకున్నప్పుడు సగటు మానవుల బతుకులో క్షణాలు నాణేలుగా మారుతున్న సందర్భాన్ని పట్టుకుని ఆ నేపథ్యంలో సమాజ స్వరూపం ఎంత వికృతంగా ఉంటుందో చెప్పే హెచ్చరిక ఈ నవల.

ఇంజనీరింగ్ చేసి, సరైన ఉద్యోగం లేక, చేస్తున్న చిన్న ఉద్యోగంతో సంతృప్తి లేక, ఏ ఇంటర్వ్యూలోనూ గెలవలేక నిరుత్సాహాన్ని, నిర్వేదాన్ని మోస్తూన్న ఆదినారాయణ మూర్తి ఆదిప్రకాశ్‌గా - ప్రకాష్‌గా చేసిన ప్రయాణం ఈ నవల. స్థిరమైన ఉద్యోగాన్ని పొందిన భార్య, రిటైర్ అయి బ్యాంకు బ్యాలన్స్‌తో ఉండే తండ్రి, తన ఉదాసీనతను పోగొట్టే ప్రయత్నం చేసే కూతురు ఆదికి కేరాఫ్. నగరీకరణ విస్తృతమవుతున్న నేటికాలంలో మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ వ్యవస్థకీ మధ్య పెరుగుతున్న దూరానికీ, ఆక్రమిస్తున్న శూన్యానికీ ‘ఆది’ ఒక చిరునామా. నిన్నలు, మొన్నలు, ఇవాళలు ఒకేలా గడిచిపోతున్న ఆదికి అనుకోని కొన్ని పరిచయాలు శారీరక సుఖాన్ని, కొంత ఆదాయాన్ని ఇస్తూ ఉంటాయి.  విచిత్రంగా ప్రతి పరిచయానుభవం తర్వాత ఆదిలోని నిర్లిప్తత కొవ్వొత్తిలా కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది. ఇది పతంజలి శాస్త్రి తొలి ప్రమాద హెచ్చరిక.

కొడుకులోని నిర్వేదనని, నిస్తేజాన్ని పసిగట్టి ఎప్పటికప్పుడు గుప్పెడు ఉత్సాహాన్ని పోగేస్తున్న తండ్రి కూడా కొడుకుకు ఉన్న పరిపరి పరిచయాలను చూసి ఏమీ మాట్లాడలేక కేవలం ‘ఆరోగ్యం జాగ్రత్త’ అని మాత్రమే చెప్పి లోకం నుండి నిష్ర్కమించడం పతంజలి శాస్త్రి రెండో ప్రమాద హెచ్చరిక. లెక్కల టీచరుగా తన కుటుంబంలో ప్లస్‌లని, మైనస్‌లని లెక్కిస్తూ, అప్పుడప్పుడుగా మొదలై ఎప్పుడూ వస్తున్న ఆది అదనపు ఆదాయంతో తమ జీవితాలని అందంగా అలంకరించడానికి మాత్రమే ప్రయత్నిస్తూ... ఆ ప్రయత్నంలో తమ గది ఇప్పుడు తనదిగానూ, భర్తది మరో గదిగానూ మారిపోయిందన్న సత్యం గుర్తించలేక పోవడం ముచ్చటగా పతంజలి శాస్త్రి మూడో హెచ్చరిక. ఈ మూడు హెచ్చరికల మధ్య పతంజలి శాస్త్రి కథనం గ్రీజు దట్టించిన మిషనులా నిశ్శబ్దంగా, వేగంగా, విశదంగా పాఠకుడిని తనవేపు లాక్కుంటుంది.

ఈ నవల అసంపూర్తిగా మిగిలిపోయిన సంపూర్ణ నవల. ఎక్కడ ముగుస్తుందో నవల మళ్ళీ అక్కడ ప్రారంభమై... ఓ ప్రొలాగ్‌లాగా మనకి మొదటి పేజీలో కనపడుతుంది. తన జీవితంపై ఏ మాత్రం ఆసక్తి లేని ఆదితో మొదలైన ఈ కథనం బాగా నురుగు పట్టించి, నున్నగా షేవ్ చేసుకుని, అక్కడక్కడ మెరుస్తున్న తెల్లటి వెంట్రుకలను అద్దంలో చూసుకుంటున్న ప్రకాష్‌తో ముగుస్తుంది.

ఈ నవలా శీర్షిక- ‘గేదెమీది పిట్ట’. బూడిద రంగు పిట్టలు మనుషులే. నడుస్తున్న గేదే నిన్నటిని, రేపుని, ఈ రోజుని మోస్తున్న సమాజం. మనిషికి, సమాజానికి మధ్య కాలం ఎప్పుడూ వారధిగా ఉంటుంది. మనుష్యుల అవసరాలు కాలాతీతమైతే సమాజం మనుషుల జాడను విస్మరిస్తుంది. మనుషుల అవసరాలు కాలంలోనివి అయితే సమాజం మానవ జాడను నిలిపి ఉంచుతుంది. అవసరాలు కాలం కన్నా వేగంగా పరుగెడుతున్న కాలంలో సమాజం ఎక్కడ మనుషులను విస్మరిస్తుందో అన్న ఆందోళనను ఈ నవల వ్యక్తం చేస్తుంది.

అయితే, ఈ నవలలో ‘ఆది’ పరిచయాల సంగతుల విస్తృతి ఎక్కువగా ఉండడం పాఠకుడికి ఇబ్బంది కలిగించే విషయమే. ఎంత విషయమయినా ఒక్క వాక్యంలోనో, ఒక్క పేరాలోనో ఒదిగించే రచయిత అయినా కూడా, వీటిని అలా విస్తరించడానికి కావలసిన బేస్ ఇవ్వలేక పొయారు. ఆధునిక నగర జీవితంలో స్పందన రాహిత్యంగా బతుకుతున్న ‘ఆది’ లాంటి వాళ్ళు కూడా అటు భార్య అయిన పూర్ణనూ, ఇటు కొత్తగా ఏర్పడిన పరిచయాలనూ తలచుకోవడం విచిత్రంగానే అనిపిస్తుంది. అంత తెలివైన పూర్ణ తన భర్తలోని తప్పటడుగులను గుర్తించకపోవడంలోని మర్మమూ అర్థంకాదు.
 
నండూరి రాజగోపాల్
9848132208

Advertisement
Advertisement