హీరోషిమా!

5 Aug, 2014 22:55 IST|Sakshi
హీరోషిమా!

హిరోషిమా... అంటే వెడల్పైన దీవి అని అర్థం. జపాన్‌లో ఉన్న 6,852 దీవుల్లో ఇది అతి పెద్ద దీవి. పురాతన కాలం నుండి జపాన్ వాణిజ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడిందీ నగరం. ఎన్నో కర్మాగారాలు నెలకొన్న ఈ నగరం పత్తి మిల్లులకు ఎంతో ప్రసిద్ధి.  దేశ విదేశాల నుండి వచ్చే వ్యాపారుల రాకపోకలతో మామూలు జీవితానికి అలవాటు పడిపోయిన నగరం ఇది.
 
ఆగస్టు 6... ఎప్పటిలానే తెల్లారింది. పదమూడేళ్ళ షిగోకు ససామొరె ఉదయపు ఎండలో పరిగెడుతోంది. ఆరోజు నగరాన్ని శుభ్రపరిచే బాధ్యత వారి స్కూలుదే. అంతలో ఏదో ఎగురుతున్న శబ్దం ఆమె చెవిన పడింది. ఏంటా అని తలపెకైత్తి చూడగా, వెండిలా తళతళా మెరుస్తూన్న విమానం వారి నగరం వైపు వస్తోంది. ‘హయ్య! విమానం!’ అని ఆశ్చర్యంతో ఆమె కళ్ళు మెరిశాయి. ఆ మెరుపులకు ప్రతిగా ఆ విమానం దాని కడుపును తెరిచింది.
   
1945 ఆగస్ట్ 6... ఉదయం 8.15 గంటలు... ఎనిమిదేళ్ళ చిన్నారి టాకషీ తానామొరె స్కూల్‌లో తన స్నేహితులతో దాగుడుమూతలు ఆడుతున్నాడు.  కిటికీ వైపు తిరిగి అంకెలు లెక్క పెడుతున్నాడు... ఐదు.. నాలుగు... మూడు... రెండు... ఒకటి... కళ్ళు తెరిచి చూశాడు. తెల్లటి కాంతి, అరక్షణం పాటు భారీ విస్ఫోటనం తాలూక చప్పుడు వినిపించింది. అల్లంత దూరాన అయోవి బ్రిడ్జ్ ఉండాల్సిన చోట తెల్లని పొగ. నేలకి 500 మీటర్ల ఎత్తులో పేలాడు లిటిల్ బాయ్. 64 కేజీల యురేనియం గొలుసుకట్టు చర్య జరిగి ఒక ట్యూమర్ కణంలా పెరుగుతూ 67 టన్నుల జౌల్స్ శక్తిని విడుదల చేసింది. క్షణంలో 70 వేలమంది ఉన్న చోటే చచ్చి పడిపోయారు! కార్బన్ రియాక్షన్ జరిగి బాంబు సమీపంలో ఉన్న వాళ్ళ శరీరాలు కార్బన్ బొమ్మలుగా మారిపోయాయి. రెండు నిమిషాలు... చుట్టుపక్కల నుండి చూస్తే నేల మీద ఒక 50వేల అడుగుల పుట్ట గొడుగు ఆకారపు మేఘంలా ఉందా విధ్వంసం. నగరం ఆవిరైపోయింది. రెండు నిమిషాల ముందు జనజీవనంతో అలరారిన నగరం ఇప్పుడు సాక్ష్యాధారాల్లేకుండా మాయమైపోయింది. ఇలా ఆ భారీ విస్ఫోటనం ఆగస్టు 6న చరిత్రని తుడిచిపెట్టడంతో పాటు కొత్త చరిత్రని సృష్టించింది.
  
హిరోషిమా ఇప్పటికీ వెడల్పైన దీవే. ఇప్పటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరమే. దేశవిదేశాల నుండి ఇప్పటికీ ఎందరో వ్యాపారుల రాకపోకలతో ‘ఇంకా’ మామూలు జీవితం గడుపుతోంది హిరోషిమా!
   
69 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఆ నగరాన్ని రాతియుగంలోకి నెట్టింది. వేలాది జీవరాసులు కాలి భస్మం అయిపోయాయి. ఆ విధ్వంసాన్ని చూసి, శత్రువులైన అమెరికన్లే కన్నీరు పెట్టారు. కానీ, ఆ విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది... జీవాన్ని కాదు! రెండేళ్ళ తరువాత బూడిదమయమై వున్న ఆ నగరంలో మొలకలు రావడం మళ్లీ మొదలైంది. యురేనియం ఆనవాళ్ళు చెరిగి మెల్లగా జన జీవనం మొదలైంది. కానీ ఆ యురేనియం వెళ్ళిపోయినా దాని తాలూకు దుష్పరిణామాలు అలాగే మిగిలిపోయాయి. ఆ పేలుడులో బతికిన వారి జీవితాన్ని నరకంగా మార్చేందుకు డిసీజ్ ఎక్స్ అనే రోగం పుట్టుకొచ్చింది. ఒంటినిండా మచ్చలు వచ్చి రక్తపు వాంతులతో ప్రాణాలని మింగేస్తుందా రోగం. 6 లక్షలమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. అది అప్పటి తరాలనేకాక రాబోయే తరాలని కూడా పీడిస్తుంది. ఈ రేడియేషన్ తాలూకు రోగాల ప్రభావం కనీసం వంద ఏళ్ళు ఉంటుందని అప్పటి డాక్టర్లు అంచనా వేశారు. వారి అంచనా తప్పు అని నిరూపించడానికి పూనుకున్నారు హిరోషిమా వాసులంతా. ఆ రోగానికి కారణమైన రేడియేషన్ తాలూకు పరిశోధనలు ఎన్నడూ జరగలేదు. డిసీజ్ ఎక్స్ సోకిన వారంతా ఆటంబాంబ్ క్యాజువాలిటీ కమిషన్‌కి చేరుకున్నారు. స్వచ్ఛందంగా వారి శరీరాలని అప్పచెప్పి ఎన్నో ప్రయోగాల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ప్రయోగ నిమిత్తం వారిని నగ్నంగా పరీక్షించిన సందర్భాలు ఎన్నో! వీటన్నిటినీ పళ్ల బిగువున భరించారు వారంతా.ఫలితంగా ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్‌కారక వ్యాధులు ఎంతో తక్కువ. రాబోయే తరాలు సుఖంగా ఉండాలని, ఒక తరం చేసిన సాహసం, త్యాగాల ప్రతిఫలం హిరోషిమా!
   
అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, ఆకాశాన్ని తాకే భవనాల నడుమ రాత్రిపూట నియాన్ దీపాల వెలుగులో నక్షత్రాల దీవిలా కనిపిస్తుంది హిరోషిమా. నామరూపాలు లేకుండా పోయిన ఒక నగరానికి తిరిగి రూపాన్ని తీసుకురావడం, దాన్ని ఇంతకముందు కన్నా అపురూపంగా తీర్చిదిద్దడమనేది కేవలం జపాన్‌వాసులకే సాధ్యం. వారి గొప్పతనం అణువిధ్వంసాన్ని మరచిపోవడం కాదు... క్షమించగలగడం! ఇప్పుడా నగరం కర్మాగారాలు, విశ్వవిద్యాలయాలకు నిలయమై 11.2 కోట్ల జపాన్‌వాసులకు నీడనిస్తోంది. ఇంత మార్పుని చేరడానికి హిరోషిమా కాలంతోపాటు కాదు... కాలం కన్నా వేగంగా పరుగులు తీసింది. వినాశనానికి విశ్వాసంతో సమాధానం చెప్పింది... ప్రపంచశాంతికి చిహ్నంగా మారి, శాంతి కపోతాన్ని స్వేచ్ఛగా ఎగరవేస్తోంది హిరోషిమా!    - జాయ్
 
 

మరిన్ని వార్తలు