ఎలా నాటాలి? ఎలా పెంచాలి? | Sakshi
Sakshi News home page

ఎలా నాటాలి? ఎలా పెంచాలి?

Published Tue, Aug 5 2014 10:54 PM

ఎలా నాటాలి? ఎలా పెంచాలి? - Sakshi

పాడి-పంట: అనకాపల్లి (విశాఖపట్నం): చెరకు సాగులో మూడు కళ్ల ముచ్చెలకు బదులు ఒంటికన్ను కణుపులను వినియోగించడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని, నికరాదాయం పెంచుకోవచ్చు. ఈ పద్ధతిలో ముందుగా ట్రేలల్లో నారు మొక్కలను పెంచి, ఆ తర్వాత వాటిని ప్రధాన పొలంలో నాటాలి. నారు మొక్కల పెంపకంపై నిన్నటి ‘పాడి-పంట’లో వివరాలు అందించాం. ఆ మొక్కలను ఎలా నాటాలి? ఎరువులు-నీటి యాజమాన్యం, కలుపు నివారణపై విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ భరతలక్ష్మి అందిస్తున్న సూచనలు...
 
 ఇలా నాటండి
 ముందుగా ప్రధాన పొలాన్ని 2-3 సార్లు ఇనుప నాగలితో బాగా దున్ని, రోటోవేటర్‌తో మెత్తని దుక్కి చేసి, ఎత్తుపల్లాలు లేకుండా చదును చేయాలి. జంట సాళ్ల పద్ధతిలో... అంటే 60/120 సెంటీమీటర్ల దూరంలో సాళ్లు వేసుకోవాలి. సాళ్ల మధ్య జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు వేసుకొని, ఆ మొక్కలను 40-45 రోజుల వయసులో భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుంది. భూభౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలను అంతరపంటలుగా కూడా వేసుకోవచ్చు. బిందుసేద్యానికి ఈ పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. మొక్కల మధ్య 40 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తే అంతరకృషి, బోదెలు ఎగదోయడం వంటి పనులను మినీ ట్రాక్టర్/పవర్ టిల్లర్‌తో చేసుకోవచ్చు.
 
 జంట వరుసల (డబుల్ రో) పద్ధతిలో కూడా మొక్కలు నాటుకోవచ్చు. ఒకే కాలువలో రెండు వరుసల్లోనూ (వరుసల మధ్య 25-30 సెంటీమీటర్ల దూరం ఉండేలా) మొక్కలు నాటుకున్నట్లయితే దిగుబడులు పెరగడంతో పాటు యంత్రం సాయంతో చెరకు నరకడం తేలికవుతుంది. నారు మొక్కలను నాటడానికి ఎకరానికి 6-8 మంది కూలీలు అవసరమవుతారు. యంత్రం సాయంతో నాటితే ఇద్దరు సరిపోతారు. మొక్క నాటే చోట ముందుగా నీరు పోయాలి. వేర్లకు అంటుకొని ఉన్న కొబ్బరి పీచు ఎరువుతో సహా మొక్కను నాటాలి. నాటిన మొక్కలు 4-5 రోజులకు నిలదొక్కుకుంటాయి. నాటిన తర్వాత 3-4 రోజులకు ఒక తడి చొప్పున ఇవ్వాలి.
 
 ఎరువుల యాజమాన్యం
 నారు మొక్కలు నాటినప్పటి నుంచి మట్టిని మొదళ్లకు ఎగదోసే వరకూ (90-100 రోజులు) ఎరువులను దఫదఫాలుగా వేయాలి. దీనివల్ల దిగుబడి పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. మొక్కలు నాటేటప్పుడు ఎకరానికి 1.5 టన్నుల పశువుల ఎరువు, 12.5 కిలోల డీఏపీని మొదళ్ల దగ్గర వేసి మట్టితో కప్పాలి. నాటిన 10 రోజుల తర్వాత మళ్లీ అదే మోతాదులో ఎరువులు వేయాలి. అనంతరం 10-15 రోజుల వ్యవధి ఇచ్చి ఎకరానికి 25 కిలోల డీఏపీని పశువుల ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ 10-15 రోజుల వ్యవధి ఇచ్చి ఎకరానికి 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. తిరిగి 10-15 రోజుల వ్యవధి ఇచ్చి ఎకరానికి 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఎరువును పైపాటుగా వేయకుండా మొక్కల మొదళ్ల వద్ద వేసి, మట్టితో కప్పేయాలి.
 
 ఎరువులు వేసిన ప్రతిసారీ తేలికపాటి తడి ఇవ్వాలి. పైరు 90-100 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 100 కిలోల యూరియా, 100 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్‌ను మొక్కల మొదళ్ల వద్ద వేసి మట్టిని కప్పాలి. ఆ తర్వాత మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ఇలా దఫదఫాలుగా ఎరువులను అందించడం వల్ల మొక్కలు ఎక్కువ పిలకలను పెడతాయి. మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోసిన తర్వాత కొత్త పిలకలు పుట్టి దృఢంగా తయారవుతాయి. అవన్నీ గడలుగా మారతాయి.
 
 కలుపు నివారణ
 నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటిన 3 రోజుల లోపు ఎకరానికి 450 లీటర్ల నీటిలో 2 కిలోల అట్రాజిన్ లేదా 600 గ్రాముల మెట్రిబుజిన్ కలిపి పిచికారీ చేయాలి. ఆ తర్వాత కలుపు ఉధృతిని బట్టి మొక్కలు నాటిన 20-25 రోజులకు ఎకరానికి 450 లీటర్ల నీటిలో 400 గ్రాముల మెట్రిబుజిన్ + 80 గ్రాముల 2, 4-డీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఏకదళ, ద్విదళ బీజ జాతికి చెందిన కలుపు మొక్కలను నివారించవచ్చు. కూలీల లభ్యతను బట్టి వరుసల మధ్య గొప్పు తవ్వించి కలుపు తీయిస్తే మొక్కల వేర్లకు గాలి బాగా తగులుతుంది. ఎక్కువ పిలకలు వస్తాయి. వరుసల మధ్య ట్రాక్టర్ లేదా కోనోవీడర్‌ను నడిపితే కలుపు నిర్మూలనతో పాటు భూమి గుల్లబారుతుంది.
 
 నీటి తడులు ఇలా...
 నారు మొక్కలను నాటిన తర్వాత 3-4 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి. మొక్కలు నిలదొక్కుకున్న తర్వాత పైరు బాల్య దశలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి కాలువల్లో నీరు పారించాలి. బిందుసేద్య పద్ధతిని అనుసరించే వారు నత్రజని ఎరువును నీటిలో కలిపి, మొక్కలు నాటిన 10 రోజుల నుంచి వారం రోజుల వ్యవధి ఇస్తూ 20 దఫాలుగా నీటిని అందించాలి. పైరు పెరుగుదలను బట్టి 2-3 జడచుట్లు వేసి మొక్కలను నిలబెట్టాలి. తోటను సరైన సమయంలో భూమట్టానికి నరికి ఫ్యాక్టరీకి తరలిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement