ఫైబ్రాయిడ్స్‌ తిరగబెట్టకుండా నయం చేయవచ్చా?

12 Sep, 2019 04:40 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 43 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు.  హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా?
– ఎమ్‌. రాధాబాయి, మిర్యాలగూడ

గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు.

1) సబ్‌సీరోజల్‌ ఫైబ్రాయిడ్స్‌ 2) ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ 3) మ్యూకోజల్‌ ఫైబ్రాయిడ్స్‌.

కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్‌ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.

లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు.

చికిత్స: జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,
హైదరాబాద్‌

 నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా?
నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువై డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన ఎమ్మారై తీసి డిస్క్‌ బల్జ్‌తో పాటు సయాటికా అంటున్నారు. నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా? దయచేసి వివరంగా చెప్పండి.
– వెంకటరామ్, తాడేపల్లిగూడెం

సయాటికా అనే పదాన్ని రోజుల్లో వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీలతో పాటు హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యలను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటిది అయిన నరం పేరు సయాటికా. అది వీపు కింది భాగం నుంచి పిరుదుల మీదుగా కాలి వెనక భాగం మీదుగా కాలి మడమల వరకు వరకు వెళ్తుంది. ఈ నరం మీద వెన్నుపూసల ఒత్తిడి పడి, నరం నొక్కుకుపోవడం వల్ల కాలి వెనక భాగం తీవ్రమైన నొప్పికి గురవుతుంది. దీన్నే సయాటికా నొప్పి అంటారు. దీని కారణంగా తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరు అవుతుంటారు.

కారణాలు :
నర్వ్‌ కంప్రెషన్‌: నర్వ్‌ రూట్స్‌ ప్రెస్‌ కావడం వల్ల నొప్పి వస్తుంది. స్పైనల్‌ డిస్క్‌ హెర్నియేషన్‌: ఎల్‌4, ఎల్‌5 నరాల రూట్స్‌ ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్‌లో ఒంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది.
స్పైనల్‌ కెనాల్‌ స్టెనోసిస్‌: వెన్నుపూసల మధ్య ఒక సన్నటి కెనాల్‌ ఉండి, అందులో వెన్నుపాము నుంచి వచ్చే నరాల వ్యవస్థ ఉంటుంది. ఆ వెన్నుపూసల మధ్యనున్న నాళం (కెనాల్‌) సన్నబారడం వల్ల వెన్నుపాములోని నరాలు నొక్కుకుపోవడం వల్ల కూడా ఈ నొప్పి వస్తుంది.

పెరిఫార్మిస్‌ సిండ్రోమ్‌ : దెబ్బలు, గాయాలు పెరిఫార్మిస్‌ అనే కండరం నర్వ్‌రూట్స్‌ను నొక్కుతుంది. దీనివల్ల కూడా సయాటికా నొప్పి వస్తుంది.
శాక్రో ఇలియాక్‌ జాయింట్‌ డిస్క్‌ ఫంక్షన్‌ : శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు. గర్భవతులకు, తమ ప్రెగ్నెన్సీ చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్‌రూట్స్‌ మీద ఒత్తిడి పడటం వల్ల సయాటికా నొప్పి వస్తుంది.

పరీక్షలు : ఎక్స్‌రే తో పాటు ఎమ్మారై స్కాన్‌ సహాయంతో డిస్క్‌హార్నియేషన్, డిస్క్‌ప్రొలాప్స్‌ నిర్ధారణ చేయవచ్చు. ఏ నర్వ్‌రూట్‌ ఎక్కడ కంప్రెస్‌ అయ్యిందో తెలుసుకోవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. నొప్పిమాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, అసిడిటీ, అల్సర్‌ రావచ్చు.

చికిత్స : సయాటికాకు రోగలక్షణాలు, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. ఇప్పుడు ఇందుకోసం రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్‌ వంటి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల సర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది.

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

తిన్నవెంటనే కడుపునొప్పి... ఏమిటీ సమస్య?
నా వయసు 43 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి.
– జి. సుధీర్‌బాబు, విజయవాడ

►మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు.
►అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు
►దీర్ఘకాల జ్వరాలు
►మానసిక ఆందోళన
►కుంగుబాటు
►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం
►జన్యుపరమైన కారణలు

చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్‌ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్‌ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్‌ బ్రీత్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.

వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు:
►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి
►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి 
►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

హోమియోలో చికిత్స: ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్‌ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

మరిన్ని వార్తలు